క్రికెట్ అంటే భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఆట, ఢిల్లీ నుంచి గల్లీ దాక ప్రతి ఒక్కరు చూసి ఆనందించే ఆట, కాస్త చిన్న స్థలం దొరికిన కూడా అక్కడ క్రికెట్ ఆడుతూ కనిపించే స్నేహితులని మనం చూస్తుంటాం, అలాగే ప్రతి భారత క్రికెట్ అభిమాని కల ఒక్కసారైనా దేశం తరపున ఆడాలి అని, కానీ అది అందరికి సాధ్యపడదు దానికోసం ఏంతో పట్టుదల, కృషి ఉండాలి.
మరి అలంటి కృషి పట్టుదలతో కష్టపడి భారత జట్టులో చోటు సంపాదించి విఫలమయ్యి మళ్ళీ జట్టులోకి వచ్చి అందరి అంచనాలని పటాపంచలు చేస్తూ తనకంటూ జట్టులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు తన ఖాతాలో వేసుకున్న తెలుగు కుర్రాడు, ఎలాంటి వివాదాలు లేకుండా 16 సంవత్సరాలు క్రికెట్ ఆడి ఆ తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగా, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా అలాగే అండర్ 19 క్రికెట్ జట్టుకి, మరియు ఇండియా ఏ జట్టుకి కోచ్ గా తన సేవలు అందిస్తున్న మన హైదరాబాద్ ఆటగాడు వి. వి. ఎస్. లక్ష్మణ్ గురించి తెలుసుకుందాం.
ఆంగ్లం లో “వెరీ వెరీ స్పెషల్” గా తెలుగు లో “సొగసరి” ఆటగాడిగా పిలవబడే ఆటగాడు ఎవరు అంటే వి. వి. ఎస్. లక్ష్మణ్. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేందర్ సెహ్వాగ్ మరియు అనిల్ కుంబ్లే లాంటి దిగజ్జ క్రికెట్ క్రీడాకారుల సరసన చేరిన ఆటగాడు వి. వి. ఎస్. లక్ష్మణ్. వి. వి. ఎస్. లక్ష్మణ్ పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్.
ఆరంగ్రేటం
1996 సంవత్సరంలో దక్షిణాఫ్రికా జట్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు వి. వి. ఎస్. లక్ష్మణ్. మొదటి మ్యాచ్లో అర్ధ శతకం సాధించిన కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 1996 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినా కూడా తగినంత గుర్తింపు రాకపోవడం మరియు సెలక్షన్ కమిటీని పెద్దగా ఆకర్షించలేకపోవడం వల్ల జట్టులో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయారు. జింబాబ్వే జట్టుతో వన్డే క్రికెట్లో అరంగ్రేటం చేసిన వి. వి. ఎస్. లక్ష్మణ్ అక్కడ కూడా నిరాశ పరచడంతో సంవత్సరం పాటు వన్డే జట్టులో స్థానం కోల్పోయారు.
జాతీయ జట్టులో స్థానం సంపాదించి స్థిరంగా కొనసాగాలని మళ్ళీ రంజీ ట్రోఫీ లోకి అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నారు. అనుకున్న విధంగా రంజీ ట్రోఫీ సీజన్లో పరుగుల వరద సాధించి మళ్ళీ జాతీయ జట్టు నుంచి కబురు వచ్చి జట్టులో ఎంపికయ్యేలా ఆడటం జరిగింది.
మలుపు తిప్పిన ఆట
భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా పర్యటనకి బయలుదేరడం ఆ సిరీస్ కోసం వి. వి. ఎస్. లక్ష్మణ్ ని జట్టులో ఎంపిక చేయడం ఆ తరువాత ఆ సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్లో తన ప్రదర్శన ఆకట్టుకోవడం, అది కూడా మిగితా ఆటగాళ్లంతా చేతులెత్తేసిన సమయంలో వి. వి. ఎస్. లక్ష్మణ్ ఒక్కడే పోరాడడం జరిగింది.
2001 సంవత్సరం భారత్ లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో లక్ష్మణ్ తన విశ్వరూపం చూపించారు. ఓడిపోతుంది అనే మ్యాచ్ని రాహుల్ ద్రావిడ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసి జట్టుని గెలిపించారు వి. వి. ఎస్. లక్ష్మణ్. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్ భారత్ ఫాలోఆన్ ఆడుతూ భారీ స్కోర్ సాధించి ఆస్ట్రేలియా మీద విజయం సాధించడం విశేషం. టెస్ట్ మ్యాచ్లో భారత్ సాధించిన విజయాలలో ఇది ఛాలా ప్రత్యేకమైనది మరియు చెప్పుకోదగినది. టెస్ట్ మ్యాచ్ లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియా జట్టుకి ఈ పరాజయంతో బ్రేక్ పడింది.
ఈ మ్యాచ్లో వి. వి. ఎస్. లక్ష్మణ్ మొదటి ఇన్నింగ్స్లో అర్ధశతకం మరియు రెండవ ఇన్నింగ్స్లో 281 పరుగులు సాధించి చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు భారత్ జట్టు తరుపున సునీల్ గవాస్కర్ చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 236 రికార్డుని వి. వి. ఎస్. లక్ష్మణ్ 281 పరుగులు చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. 2004 సంవత్సరం వరకు ఇదే భారత టెస్ట్ క్రికెట్ లో ఒక ఆటగాడికి అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా ఉండడం విశేషం.
2001 సంవత్సరం వి. వి. ఎస్. లక్ష్మణ్ ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శనకి భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించారు. ఆ తరువాత వన్డే జట్టులో కూడా మంచి అవకాశాలు వచ్చినా పరుగులు సాధించినా ఆ పరుగులని భారీ పరుగులుగా మార్చడంలో విఫలం అవ్వడం జరిగింది. ఆ కారణం వల్ల 2003 క్రికెట్ ప్రపంచకప్ లో స్థానం సంపాదించలేకపోయారు.
ఐపీఎల్
2008 సంవత్సరంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలవడంతో హైదరాబాద్ జట్టుకి వి. వి. ఎస్. లక్ష్మణ్ ని ఐకాన్ ఆటగాడిగా మరియు జట్టుకి సారధిగా నియమించడం జరిగింది. 2009 సంవత్సరంలో సారధి భాద్యతలు వదిలేసి ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడైన ఆడమ్ గిల్క్రిస్ట్ కు ఇవ్వడం జరిగింది. 2010 ఐపీఎల్ వేలంపాటలో లక్ష్మణ్ ని కొచ్చి జట్టు కొనుగోలు చేయడం జరిగింది. ఆ సీజన్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు లక్ష్మణ్.
2011 సంవత్సరం లో కొచ్చి జట్టు నిషేదానికి గురవ్వడం వల్ల మళ్ళీ లక్ష్మణ్ వేలంపాటలో వచ్చినా కూడా ఎవరు కొనుగోలు చేయకపోవడంతో ఆటగాడిగా ఐపీఎల్ నుంచి తప్పుకుని హైదరాబాద్ జట్టుకి మెంటర్ గా వ్యవహరించడం మొదలుపెట్టారు. 2012 సంవత్సరం ఆగష్టు 18న వి. వి. ఎస్. లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
వ్యక్తిగత జీవితం
1974 సంవత్సరం నవంబర్ 1న హైదరాబాద్ లో జన్మించారు వి. వి. ఎస్. లక్ష్మణ్. తన తల్లిదండ్రులిద్దరూ వైద్యులు అవ్వడంతో లక్ష్మణ్ ని కూడా అదే వృత్తి కొనసాగించాలి అనుకున్నారు కానీ తన ధ్యాసంతా క్రికెట్ వైపే ఉండటంతో క్రికెట్ వైపు ప్రోత్సహించడం జరిగింది. 16 ఫిబ్రవరి 2004 సంవత్సరంలో లక్ష్మణ్ వివాహం శైలజ తో జరిగింది మరియు వారికి ఇద్దరు పిల్లలు.
గణాంకాలు
ఇప్పటివరకు వి. వి. ఎస్. లక్ష్మణ్ 134 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడి, 8,781 పరుగులు సాధించారు. 45.97 సగటు తో 17 శతకాలు మరియు 56 అర్ధ శతకాలు తన ఖాతాలో ఉండటం విశేషం. అత్యధిక స్కోర్ 281. ఇక క్యాచ్లు విషయానికి వస్తే మొత్తం 135 క్యాచ్లు అందుకున్నారు. ఇక వన్డే మ్యాచ్లు విషయానికి వస్తే 86 మ్యాచ్లు ఆడి, 2,338 పరుగులు సాధించారు. 30.76 సగటు తో 6 శతకాలు మరియు 10 అర్ధ శతకాలు సాధించారు. అత్యధిక స్కోర్ 135. క్యాచ్లు విషయానికి వస్తే మొత్తం 39 కాచ్లు అందుకున్నారు. తన పూర్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో కేవలం 2 వికెట్లు పడగొట్టారు వి. వి. ఎస్. లక్ష్మణ్, ఒక వికెట్ వెస్ట్ ఇండీస్ మరొక్క వికెట్ పాకిస్తాన్ మీద తీయడం జరిగిందిట. ఈ రెండు వికెట్లు టెస్ట్ మ్యాచ్ లో తీయడం జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్ష్మణ్ మొత్తం 20 మ్యాచ్లు ఆడి 282 పరుగులు సాధించారు. 15.7 సగటుతో ఒక్కటే అర్ధ శతకం సాధించారు. అత్యధిక స్కోర్ వచ్చేసి 52 మరియు 4 కాచ్లు పట్టుకోవడం జరిగింది.
త్రిసభ్య కమిటీ
బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరియు సెక్రెటరీ అనురాగ్ ఠాకూర్ కలిసి స్థాపించిన క్రికెట్ సలహా కమిటీ లో వి. వి. ఎస్. లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ మరియు సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉండడం జరిగింది. ఈ కమిటీలో భారత క్రికెట్ బోర్డులో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఈ కమిటీ నెలకొల్పడం జరిగింది.
వి. వి. ఎస్. లక్ష్మణ్ గురించి మరి కొన్ని విశేషాలు
- 2011 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది.
- 2001 సంవత్సరంలో అర్జున పురస్కారం అందుకున్నారు.
- వంద టెస్ట్ మ్యాచ్లు ఆడిన భారత క్రికెటర్స్ లో వి. వి. ఎస్. లక్ష్మణ్ ఒకరు.
- 2002 సంవత్సరంలో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురాస్కారాన్ని అందుకున్నారు.
- 2003 సంవత్సరం లో ప్రముఖ నటుడు “విక్టరీ” వెంకటేష్ నటించిన తెలుగు చిత్రం వసంతం లో క్రికెట్ కోచ్ గా చిన్న అతిధి పాత్ర చేయడం జరిగింది.
- 2015 సంవత్సరం ఫిబ్రవరి 4న న్యూ ఢిల్లీ లోని టెరి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది.