
బాలనటుడిగా, కధానాయకుడిగా, నిర్మాతగా వరుసగా చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అభిమానులని సొంతం చేసుకున్న మంచు మనోజ్ కుమార్ గురించి తెలుసుకుందాం.
సినీ ప్రస్థానం
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1993 సంవత్సరంలో నందమూరి తారకరామారావు, శారదా, మోహన్ బాబు, నగ్మా, రమ్య కృష్ణ కలిసి నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో బాలనటుడిగా నటించారు మంచు మనోజ్ కుమార్. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించి నటించిన చిత్రం పుణ్యభూమి నా దేశం. మీనా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, అన్నపూర్ణ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంలో మోహన్ బాబు చిన్నప్పటి పాత్రలో మంచు మనోజ్ కుమార్ నటించడం విశేషం.
బి. గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాతగా నటించిన చిత్రం అడవిలో అన్న. రోజా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కుమార్ చిన్నప్పటి మోహన్ బాబు పాత్ర చేయడం జరిగింది. సాయి ప్రకాష్ దర్శకత్వంలో మోహన్ బాబు, లైలా, “రెబెల్ స్టార్” కృష్ణంరాజు కలిసి నటించిన ఖైదీగారు చిత్రంలో మంచు మనోజ్ కుమార్ ఒక పాత్ర చేశారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.
కధానాయకుడిగా
సుబ్రమణియం శివ దర్శకత్వంలో 2004 సంవత్సరంలో మంచు మనోజ్ కుమార్, సదా, సునీల్, రాజీవ్ కనకాల కలిసి నటించిన చిత్రం దొంగ దొంగది. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు భాద్యతగా ఎలా మారాడు అనే నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరదా సరదాగా సాగిపోయే ఈ చిత్రంలో “మన్మధ రాజా” పాట ప్రజాదరణ పొందింది. తమిళ్ చిత్రం తిరుడా తిరుడి చిత్రానికి రీమేక్ గా దొంగ దొంగది చిత్రం విడుదలైంది.
దశరథ్ దర్శకత్వంలో సోదరి మంచు లక్ష్మి ప్రసన్న నిర్మాణంలో మంచు మనోజ్ కుమార్, తమన్నా కలిసి నటించిన శ్రీ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందించడం విశేషం. సూర్యకిరణ్ దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, షీలా కలిసి నటించిన రాజు భాయ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2008 సంవత్సరంలో అజయ్ శాస్ట్రీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం నేను మీకు తెలుసా.
మంచు మనోజ్ కుమార్, స్నేహ ఉల్లాల్, రియా సేన్ కలిసి నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. లక్ష్మి మంచు నిర్మించిన ఈ చిత్రం మంచు మనోజ్ కుమార్ పాత్రకి మంచి పేరు తీసుకొచ్చింది. తమిళ్ చిత్రం గజినీ స్పూర్తితో వచ్చిన నేను మీకు తెలుసా చిత్రంలో మంచు మనోజ్ కుమార్ ఉదయం లేవగానే అంతా మరిచిపోయే పాత్ర చేయడం జరిగింది.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, పాయల్ ఘోష్ కలిసి నటించిన చిత్రం ప్రయాణం మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మొత్తం ఎయిర్పోర్ట్ లో కొనసాగడం విశేషం. మహేష్ శంకర్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.
2010 సంవత్సరంలో వీరు పోట్ల దర్శకత్వంలో మంచు మనోజ్, షీనా శహబాది, వెన్నెల కిశోర్, సుబ్బరాజు కలిసి నటించిన బిందాస్ చిత్రం విజయాన్ని అందుకుంది. పూర్తిగా వినోదాత్మకంగా తీసిన బిందాస్ చిత్రానికి మంచు మనోజ్ కుమార్ నంది పురస్కారం అందుకోవడం విశేషం. బోబో శశి సంగీతం అందించిన ఈ చిత్రం కన్నడ భాషలో రీమేక్ చేయడం జరిగింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో “స్టైలిష్ స్టార్” అల్లు అర్జున్, మంచు మనోజ్ కుమార్, అనుష్క, దీక్షాసేథ్, లేఖ వాషింగ్టన్ కలిసి నటించిన చిత్రం వేదం. వేదం చిత్రంలో మంచు మనోజ్ కుమార్ రాక్ స్టార్ పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం అలరించింది మరియు వేదం చిత్రానికి కొన్ని పురస్కారాలు రావడం జరిగింది.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, తాప్సి కలిసి నటించిన ఝుమ్మందినాదం చిత్రం పరవాలేదనిపించింది. మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని అన్ని పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి.
వరుస చిత్రాలు
అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, కృతి కర్బందా, సన ఖాన్ కలిసి నటించిన Mr. నూకయ్య చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. శేఖర్ రాజా దర్శకత్వంలో 2012 సంవత్సరంలో వచ్చిన చిత్రం ఊ కొడతారా ఉలిక్కిపడతారా. మంచు మనోజ్ కుమార్, నందమూరి బాలకృష్ణ, సోను సూద్, దీక్షాసేథ్, లక్ష్మి మంచు కలిసి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
పవన్ వాడేయార్ దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, రేచల్, అనుప్రియ గోయెంకా కలిసి నటించిన చిత్రం పోటుగాడు. 2013 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2014 సంవత్సరంలో శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్, తనీష్, వరుణ్ సందేశ్, వెన్నెల కిశోర్, రవీనా టండన్, హన్సిక, ప్రణీత కలిసి నటించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం కరెంట్ తీగ. జగపతిబాబు ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో సన్నీ లియోన్ నటించడం జరిగింది. 2014 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైంది.
దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్ నటించిన చిత్రం శౌర్య. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో కథానాయికగా రెజీనా కస్సన్ద్ర నటించారు మరియు ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. 2016 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచింది.
సి. కళ్యాణ్ నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, సురభి కలిసి నటించిన ఎటాక్ చిత్రం నిరాశపరిచింది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతం అందించారు.
ఎస్. కె. సత్య దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, ప్రగ్య జైస్వాల్ కలిసి నటించిన గుంటూరోడు చిత్రం నిరాశపరిచింది మరియు ఈ చిత్రానికి ప్రముఖ నటులు “మెగాస్టార్” చిరంజీవి గాత్ర దానం చేయడం విశేషం. 2017 సంవత్సరంలో వచ్చిన చిత్రం ఒక్కడు మిగిలాడు, మంచు మనోజ్ కుమార్, అనిషా అంబ్రోస్ కలిసి నటించిన ఈ చిత్రం అపజయాన్ని చూసింది.
మరికొన్ని విశేషాలు
మోహన్ బాబు నటించిన పొలిటికల్ రౌడీ, లక్ష్మి మంచు నటించిన దొంగాట, నందు నటించిన సూపర్ స్టార్ కిడ్నాప్, తరుణ్ నటించిన ఇది నా లవ్ స్టోరీ, శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 చిత్రంలో అతిధి పాత్రలో నటించారు మంచు మనోజ్ కుమార్. Mr. నూకయ్య చిత్రంలో రచయితగా రెండు గీతాలని రాయడం విశేషం. కొన్ని చిత్రాలకి సమర్పించారు మరియు నిర్మించారు. ఓటిటి యాప్ “ఈటీవి విన్” లో ఉస్తాద్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు మంచు మనోజ్ కుమార్.
వ్యక్తిగతం
మోహన్ బాబు, నిర్మల దేవి దంపతులకు 1983 సంవత్సరం, మే 20న చెన్నై నగరంలో జన్మించారు మంచు మనోజ్ కుమార్. మంచు మనోజ్ కుమార్ అన్నయ్య మంచు విష్ణు, మరియు అక్క మంచు లక్ష్మి ప్రసన్న. 2015 సంవత్సరంలో లక్ష్మి ప్రణతి అనే యువతితో మంచు మనోజ్ కుమార్ వివాహం జరిగింది.
కొంతకాలానికి వారు విడిపోవడంతో 2023 సంవత్సరంలో ప్రముఖ రాజకీయ నాయకులూ భూమా నాగిరీడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో వివాహం జరిగింది మరియు వీరికి ఒక కుమార్తె.
మంచు మనోజ్ కుమార్ నటించిన చిత్రాల గురించి చూద్దాం
బాలనటుడిగా
- మేజర్ చంద్రకాంత్
- పుణ్యభూమి నా దేశం
- అడవిలో అన్న
- ఖైదీ గారు
కధానాయకుడిగా
- దొంగ దొంగది
- పొలిటికల్ రౌడీ (అతిధి పాత్ర)
- శ్రీ
- రాజు భాయ్
- నేను మీకు తెలుసా
- ప్రయాణం
- బిందాస్
- వేదం
- ఝుమ్మందినాదం
- Mr. నూకయ్య
- ఊ కొడతారా ఉలిక్కిపడతారా
- పోటుగాడు
- పాండవులు పాండవులు తుమ్మెద
- కరెంటు తీగ
- దొంగాట (అతిధి పాత్ర)
- సూపర్ స్టార్ కిడ్నాప్ (అతిధి పాత్ర)
- శౌర్య
- ఎటాక్
- గుంటూరోడు
- ఒక్కడు మిగిలాడు
- ఇది నా లవ్ స్టోరీ (అతిధి పాత్ర)
- ఆపరేషన్ 2019 (అతిధి పాత్ర)