
హాస్య నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత కధ బలమున్న పాత్రలతో పాటు అన్ని రకాల పాత్రలలో నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్న నటులు అల్లరి నరేష్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
సినీ ప్రస్థానం
ప్రముఖ నటులు చలపతిరావు తనయుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లరి. ఈ చిత్రంలో కధానాయకుడిగా ప్రముఖ దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ తనయుడు నరేష్ కధానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. శ్వేతా అగర్వాల్, నీలాంబరి కథానాయికలుగా నటించిన అల్లరి చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో నరేష్ పేరు ముందు అల్లరి వచ్చి చేరింది, అప్పటినుంచి “అల్లరి” నరేష్ అని పిలవడం మొదలుపెట్టారు.
శివ నాగేశ్వర్రావు దర్శకత్వంలో నరేష్, అల్లరి నరేష్ మరియు ఆదిత్య ఓం కలిసి నటించిన చిత్రం ధనలక్ష్మి ఐ లవ్ యు. ఈ చిత్రం పరవాలేదనిపించింది. 2002 సంవత్సరంలో ఇవివి సత్యనారాయణ దర్శక నిర్మాతగా తొట్టిగ్యాంగ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, ప్రభుదేవా, సునీల్, గజాల మరియు అనిత కలిసి నటించారు మరియు ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
జూనియర్స్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులముందుకు వచ్చిన అల్లరి నరేష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అల్లరి నరేష్, సదా కలిసి నటించిన ప్రాణం చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. గతజన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్, రమ్యకృష్ణ, మౌనిక కలిసి నటించిన చిత్రం మా అల్లుడు వెరీ గుడ్.
మా అల్లుడు వెరీ గుడ్ చిత్రంలో అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ దొంగతనాలు చేసే దొంగల పాత్రలో నటించి అందర్నీ నవ్వించారు. వీరిద్దరూ పండించిన హాస్యం ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రంలో “మావగారు పిల్లనచ్చింది” పాటలో అన్ని చిత్రాల పేర్లను వచ్చేటట్టు పాటను రచించడం విశేషం.
విష్ణు వర్ధన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, నికిత, దియా కలిసి నటించిన తమిళ చిత్రం కురంబు. తెలుగులో విడుదలైన అల్లరి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం విడుదల చేయడం జరిగింది మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.
ఇ. సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్, వేద కలిసి నటించిన చిత్రం నేను. అమాయకుడి పాత్రలో కొత్త తరహా నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శక నిర్మాతగా తన ఇద్దరు కుమారులైన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లతో కలిసి తీసిన చిత్రం నువ్వంటే నాకిష్టం. అనుమెహతా కధానాయికగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో అల్లరి నరేశ్, సాయిరామ్ శంకర్, అభిషేక్, స్వాతి కలిసి నటించిన డేంజర్ చిత్రం విజయం సాధించగా ఆ తరువాత వచ్చిన పార్టీ చిత్రం విజయం సాధించలేదు. పార్టీ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించగా అల్లరి నరేష్, శశాంక్ కథానాయకులుగా నటించారు.
వరుస చిత్రాలు
ఇ.వి.వి. సత్యనారాయణ దర్శక నిర్మాతగా అల్లరి నరేష్, గీత సింగ్, మధుశాలిని, కృష్ణభగవాన్ కలిసి నటించిన చిత్రం కితకితలు. ఈ చిత్రం ప్రేక్షకులని నిజగా కితకితలు పెట్టించింది. హాస్య నటులు ఏవిఎస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, బాలాదిత్య, శ్రీనివాసరెడ్డి, సుమంత్ శెట్టి, నవనీత్ కౌర్ కలిసి నటించిన రూంమేట్స్ నిరాశపరిచింది.
జనార్దన్ మహర్షి దర్శకత్వంలో అల్లరి నరేష్, ఆర్తి చాబ్రియా, గౌరీ ముంజల్, కలిసి నడిచిన గోపి: గోడ మీద పిల్లి చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో జగపతిబాబు, వడ్డే నవీన్, వినోద్ కుమార్, సురేష్, రంభ, సాయికిరణ్ ఇతర పాత్రలో నటించడం విశేషం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్, విదిష, కౌష రిచ్ కలిసి నటించిన అత్తిలి సత్తిబాబు ఎల్. కే. జి చిత్రం విజయాన్ని అందుకుంది.
ముప్పలేని శివ దర్శకత్వంలో అల్లరి నరేష్, వేణు, పార్వతి మెల్టన్, మల్లికా కపూర్ నటించిన అల్లరే అల్లరి చిత్రం నిరాశపరిచింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్, కమిలిని ముఖర్జీ, హరీష్ కలిసి నటించిన పెళ్లయింది కానీ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి భానుప్రియ అల్లరి నరేష్ తల్లి పాత్రలో నటించారు.
పెళ్లయింది కానీ చిత్రంలో అల్లరి నరేష్ మానసిక ఎదుగుదలలేని పాత్రలో నటించారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్, ఫర్జానా, కలిసి నటించిన సీమ శాస్త్రి చిత్రం విజయాన్ని అందించింది. ఒక పౌరోహిత్యం చేసే అబ్బాయి ఫ్యాక్షనిస్ట్ కూతుని ప్రేమించగా, ఆ ప్రేమని పెళ్లివరకు ఎలా తీసుకెళ్లారు, ఈ క్రమంలో జరిగే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
బాపు దర్శకత్వంలో అల్లరి నరేష్, ఛార్మి నటించిన సుందరకాండ చిత్రం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన విశాఖ ఎక్ష్ప్రెస్స్ చిత్రం విజయాన్ని అందించింది. వర ముళ్ళపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, సింధు తులాని, ప్రీతి ఝిన్గనియా కలిసి నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ ప్రతినాయకుడి పాత్ర ఛాయలో నటించడం జరిగింది.
అల్లరి నరేష్, శివాజీ, శ్రీదేవి కలిసి నటించిన పెళ్లికాని ప్రసాద్ నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన గమ్యం చిత్రం ఘన విజయం సాధించింది. అల్లరి నరేష్, శర్వానంద్, కమిలిని ముఖర్జీ కలిసి నటించిన గమ్యం చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ధనవంతుడి పాత్రలో శర్వానంద్ నటించగా దొంగ పాత్రలో అల్లరి నరేష్ నటించి మెప్పించారు.
మరికొన్ని చిత్రాలు
గమ్యం చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు మరియు ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్, ఫర్జానా, కృష్ణ భగవాన్, చారులత కలిసి నటించిన బొమ్మనా బ్రదర్స్ చందాన సిస్టర్స్ ఘన విజయం సాధించింది. దొంగతనాలు చేసే ఒక కుటుంబం ధనవంతుల కూతుళ్ళని మోసం చేసి ఎలా పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈ చిత్ర కధ.
పూర్తిగా హాస్యభరితంగా తీసిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం పండించిన హాస్యంతో పాటు మిగితా హాస్యనటులు పండించిన హాస్యం కూడా ప్రేక్షకులను అలరించింది. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్, శ్రద్ధ దాస్ నటించిన సిద్దు ఫ్రొం శ్రీకాకుళం నిరాశపరచగా ఆ తరువాత వచ్చిన బ్లేడ్ బాబ్జి, దొంగలబండి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
అల్లరి నరేష్, మదాలస శర్మ కలిసి నటించిన ఫిట్టింగ్ మాస్టర్ పరవాలేదనిపించిన ఆ తరువాత వచ్చిన బెండప్పారావు ఆర్. ఎం. పి చిత్రం భారీ విజయం సాధించింది. పల్లెటూరిలో తన విచిత్రమైన వైద్యంతో అందరికి వైద్యసేవలు చేస్తూ అల్లరి నరేష్ నటన మరియు మిగితా హాస్య నటులు కలిసి చేసే హాస్యం ఈ చిత్రాన్ని విజయాన్ని అందించింది. కామ్నా జెట్మలానీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, రోజా, అభునయ కలిసి నటించిన శంభో శివ శంభో చిత్రం విజయం సాధించింది. తమిళ దర్శకులు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010 సంవత్సరంలో విడుదలయింది. ఈ చిత్రంలో అందరి నటన అద్భుతం అని చెప్పొచ్చు. రాంబాబు గాడి పెళ్ళాం, ఆకాశరామన్న చిత్రాలు గుర్తింపుకి నోచుకోలేదు. అల్లరి నరేష్, నిధి కలిసి నటించిన చిత్రం బెట్టింగ్ బంగార్రాజు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ దర్శకత్వంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ కలిసి నటించిన శుభప్రదం, వంశీ దర్శకత్వంలో వచ్చిన సరదాగాకాసేపు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్, కామ్నా జెట్మలానీ కలిసి నటించిన కత్తి కాంతారావు చిత్రం విజయాన్ని అందుకుంది. కత్తి కాంతారావు చిత్రంలో వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రమణ్యంతో పాటు మిగిలిన హాస్య నటులు పండించిన హాస్యం ప్రేక్షకులను అలరించింది.
మ్నారికొన్ని చిత్రాలు
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో వచ్చిన అల్లరి నరేష, రీతు బర్మేచ కలిసి నటించిన చిత్రం అహనా పెళ్ళంట. ప్రముఖ నటులు శ్రీహరి ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్, సామ్నా కసిం కలిసి నటించిన సీమటపాకాయ్ విజయాన్ని అందుకుంది ఆ తరువాత వచ్చిన మడతకాజా చిత్రం అపజయాన్ని చూసింది.
సముద్రఖని దర్శకత్వంలో తమిళ భాషలో వచ్చిన చిత్రం పోరాలి. శశికుమార్, అల్లరి నరేష్, స్వాతి, నివేద థోమస్ మరియు వసుంధర కశ్యప్ కలిసి నటించిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది మరియు ఈ చిత్రాన్ని తెలుగులో సంఘర్షణ పేరుతొ తెలుగు లో అనువదించారు. అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ శరన్ కలిసి నటించిన నువ్వా నేనా చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో “వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్” పాట జనాదరణ పొందింది.
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ కలిసి నటించిన సుడిగాడు చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ భాషలో వచ్చిన చిత్రాలను అలాగే కొన్ని ధారావాహికలు, కార్యక్రమాలను కలిపి సరదాగా చిత్రీకరించిన సుడిగాడు చిత్రం ప్రేక్షకులను అలరించింది. యముడికి మొగుడు, యాక్టిన్ 3D, కెవ్వుకేక, లడ్డుబాబు, జంప్ జిలాని చిత్రాల్లో నటించి అలరించారు అల్లరి నరేష్.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ కలిసి నటించిన చిత్రం బ్రదర్ అఫ్ బొమ్మాళి. ఈ చిత్రంలో ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక అల్లరి నరేష్ కి చెల్లిగా నటించడం విశేషం మరియు ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బందిపోటు, జేమ్స్ బాండ్, మామ మంచు అల్లుడు కంచు, సెల్ఫీ రాజా, ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం, మెడ మీద అబ్బాయి, సిల్లీ ఫెలోస్ చిత్రాలతో అలరించారు అల్లరి నరేష్.
మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే కలిసి నటించిన మహర్షి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో నటించారు అల్లరి నరేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అనన్య, సాయికుమార్, జయసుధ, జగపతిబాబు నటించారు. బంగారు బుల్లోడు, నాంది, ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, ఉగ్రం చిత్రాల్లో నటించి అలరించారు అల్లరి నరేష్.
ప్రముఖ నృత్య దర్శకులు విజయ్ బిన్నీ దర్శకత్వంలో “కింగ్” అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రూక్షర్ ధిల్లాన్ కలిసి నటించిన చిత్రం నా సామీ రంగ. నాగార్జున స్నేహితడిగా అల్లరి నరేష్ అంజి పాత్రలో నటించి మెప్పించడం విశేషం. ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమల్లి చిత్రాలు నిరాశపరిచాయి.
వ్యక్తిగతం
1982 సంవత్సరం 30 జూన్ న చెన్నై నగరంలో ఇ. వి. వి. సత్యనారాయణ, సరస్వతి కుమారి దంపతులకు జన్మించారు అల్లరి నరేష్. తన చదువంతా చెన్నై, హైదరాబాద్ లో జరిగింది. అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా కధానాయకుడిగా నటించారు. 2015 సంవత్సరంలో అల్లరి నరేష వివాహం జరిగింది మరియు వీరికి ఒక కుమార్తె.
అల్లరి నరేష్ నటించిన చిత్రాల గీయించి తెలుసుకుందాం
- అల్లరి
- ధనలక్ష్మి ఐ లవ్ యు
- తొట్టిగ్యాంగ్
- జూనియర్స్
- ప్రాణం
- మా అల్లుడు వెరీ గుడ్డు
- కురంబు (తమిళ్)
- నేను
- బొమ్మలాట (అతిధి పాత్ర)
- నువ్వంటే నాకిష్టం
- డేంజర్
- పార్టీ
- కితకితలు
- రూంమేట్స్
- గోపి – గోడ మీద పిల్లి
- అత్తిలి సత్తి బాబు ఎల్.కే.జి
- అల్లరే అల్లరి
- పెళ్ళైందికాని
- సీమ శాస్త్రి
- బొమ్మనా బ్రదర్స్ చందాన సిస్టర్స్
- సిద్దు ఫ్రొం సికాకుళం
- బ్లేడ్ బాబ్జి
- దొంగల బండి
- సుందరకాండ
- విశాఖ ఎక్ష్ప్రెస్స్
- పెళ్లి కానీ ప్రసాద్
- గమ్యం
- ఫిట్టింగ్ మాస్టర్
- బెండు అప్పారావు ఆర్.ఎం.పి
- రాంబాబు గాడి పెళ్ళాం
- ఆకాశ రామన్న
- బెట్టింగ్ బంగార్రాజు
- శుభప్రదం
- సరదాగా కాసేపు
- కత్తి కాంతారావు
- శంభో శివ శంభో
- అహ నా పెళ్ళంటా
- సీమటపాకాయ్
- మడతకాజా
- పోరాలి (తమిళ్)
- చందమామ కథ (అతిధి పాత్ర)
- నువ్వా నేనా
- సుడిగాడు
- యముడికి మొగుడు
- యాక్షన్ 3D
- కెవ్వు కేక
- లడ్డు బాబు
- జంప్ జిలాని
- బ్రదర్ అఫ్ బొమ్మాళి
- బందిపోటు
- మామ మంచు అల్లుడు కంచు
- సూపర్ స్టార్ కిడ్నాప్ (అతిధి పాత్ర)
- సెల్ఫీ రాజా
- ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం
- మేడ మీద అబ్బాయి
- సిల్లీ ఫెలోస్
- మహర్షి
- బంగారు బుల్లోడు
- నాంది
- ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
- ఉగ్రం
- నా సామి రంగ
- ఆ ఒక్కటి అడక్కు
- బచ్చలమల్లి