Rebel Star Prabhas Filmography

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత అంచలంచలుగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని తెలుగు సినిమా మాత్రమే కాకుండా భారత దేశ సినిమా గర్వించ్చదగ్గ నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్ గురించి తెలుసుకుందాం.

సినీ ప్రస్థానం

ఈశ్వర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ప్రభాస్. 2002 సంవత్సరంలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటులు విజయకుమార్ కుమార్తె శ్రీదేవి కధానాయికగా నటించారు. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించడమే కాకుండా పాటలు కూడా జనాదరణ పొందడం విశేషం.

రాజకీయ నాయకుడి కుమార్తెని ప్రేమించే ఒక బస్తి కుర్రాడి పాత్రలో నటించారు ప్రభాస్. ఈ చిత్రం విజయం సాధించడంతో పాటు మాస్ ప్రేక్షకులకు ప్రభాస్ దెగ్గరయ్యారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, అన్షు కలిసి నటించిన రాఘవేంద్ర చిత్రం నిరాశపరిచింది. ఎప్పుడు కోపంగా ఉండే తమ కొడుకుని తన తల్లిదండ్రులు శాంతంగా మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఈ చిత్రంలో చూడొచ్చు.

ఈ చిత్రంలో మంత్రాలయం ఆలయంలో జరిగే సన్నివేశాలు చూడొచ్చు. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం పరవాలేదనిపించింది.  ప్రభాస్ నటన బాగున్నాకూడా ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిదండ్రులుగా మురళీమోహన్, ప్రభ నటించారు.

స్టార్ ఇమేజ్

ప్రముఖ నిర్మాత ఎం. ఎస్. రాజు నిర్మాణంలో 2004 సంవత్సరంలో శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష కలిసి నటించిన వర్షం చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో నటుడు గోపీచంద్ ప్రతినాయకుడి పాత్ర పోషించడం విశేషం. వర్షం  చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం మరియు పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.

ఈ చిత్రంలో ప్రముఖ గాయని చిత్ర పాడిన “ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన” పాట ఒక సంచలనం సృష్టించింది. ఇప్పటికి అభిమానులు ఈ పాట పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు మరియు వర్షం చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు.

ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. పాత అడవి రాముడు చిత్రం లోని “ఆరేసుకోబోయి పారేసుకున్న” పాట ఈ చిత్రంలో చిత్రీకరించారు దర్శకులు బి. గోపాల్. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం పరవాలేదనిపించింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్, ఆసిన్, ఛార్మి కలిసి నటించిన చక్రం చిత్రం ప్రేక్షకులని అలరించలేదు. చక్రం సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభాస్ తండ్రి కొడుకులుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2004 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఆసిన్ తో పెళ్ళికి నిరాకరించి తన మనసులో ఒక చెడు వ్యక్తిగా కనిపించాలని పెళ్లి సమాయంలో పారిపోతారు ప్రభాస్.

ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మరియు ప్రభాస్ ఒక కాలానికి వెళ్లడం అక్కడ పరిస్థితులు ఎలా చెక్కదిద్దడు అనేది ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ చిత్రానికి చక్రి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు దర్శకులు కృష్ణవంశీ, పాటల రచయితా “సిరివెన్నెల” సీతారామశాస్ట్రీ గారికి నంది పురస్కారాలు రావడం విశేషం.

యంగ్ రెబెల్ స్టార్ బిరుదు

ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, శ్రియ శరన్ కలిసి నటించిన ఛత్రపతి చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా ప్రభాస్ నటనకి ప్రశంసలు అందాయి. 2005 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా ప్రముఖ నటి భానుప్రియా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంతో ప్రభాస్ నటనకి “యంగ్ రెబెల్ స్టార్” బిరుదు రావడం విశేషం. ప్రభాస్ తమ్ముడి పాత్రలో షఫీ నటన అద్భుతం అని చెప్పొచ్చు.

ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ పాత్ర మరియు నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. “ఒక్క అడుగు” అంటూ కోట శ్రీనివాసరావు గారితో చెప్పే సంభాషణ మరియు మిగితా ప్రజల ముందు చెప్పే సంభాషణలు ప్రేక్షకులను చప్పట్లు, ఈలలు కొట్టేలాచేసాయి. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా  ప్రేక్షకులను అలరించింది.

ఈ చిత్రాన్ని బాంగ్లాదేశ్, కన్నడ మరియు హిందీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కధానాయకుడిగా ఛత్రపతి చిత్రాన్ని హిందీ భాషలో చిత్రీకరించడం జరిగింది.

ప్రభుదేవా దర్శకత్వంలో ఎం. ఎస్. రాజు నిర్మాతగా ప్రభాస్, త్రిష, ఛార్మి, సింధు తులాని కలిసి నటించిన పౌర్ణమి చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యి ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రతినాయకుడిగా రాహుల్ దేవ్ నటించారు. సాంప్రదాయ నృత్యం నేపథ్యంలో సాగే కథతో వచ్చిన పౌర్ణమి చిత్రం ప్రేక్షకులను అలరించలేదు. పౌర్ణమి చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా “మువ్వలా నవ్వ కల”, “భారత వేదమున” పాటలు జనాదరణ పొందాయి.

వి. వి. వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్, నయనతార కలిసి నటించిన యోగి చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో తల్లి పాత్రలో శారదా నటించడం విశేషం. రమణ గోగుల అందించిన సంగీతం మరియు గురుకిరణ్ అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరించాయి. కన్నడ భాషలో వచ్చిన జోగి చిత్రానికి తెలుగులో యోగి పేరుతొ రూపొందించారు.

మరికొన్ని చిత్రాలు

దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్, ఇలియానా కలిసి నటించిన మున్నా చిత్రం పరవాలేదనిపించింది. ప్రకాష్ రాజ్, కళ్యాణి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో శ్రియ శరన్ ఒక పాటలో నటించడం జరిగింది. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ పాడిన “మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా” పాట ప్రజాదరణ పొందడమే కాకూండా పురస్కారం కూడా లభించింది.

పూరీజగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష, సంజన కలిసి నటించిన బుజ్జిగాడు చిత్రం విజయాన్ని అందించింది. తమిళ యాసలో మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితురాలైన చిట్టిని వెతికే పాత్రలో నటించారు ప్రభాస్. విలక్షణ కధానాయకుడు “కలెక్షన్ కింగ్” మోహన్ బాబు బుజ్జిగాడు చిత్రంలో త్రిషకి అన్న పాత్రలో నటించడం విశేషం. సందీప్ చౌతా అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. బాంగ్లాదేశ్ భాషలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం విశేషం.

ప్రముఖ హిందీ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన డాన్ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం బిల్లా. మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్, కృష్ణంరాజు, అనుష్క, నమిత, సుబ్బరాజు, హన్సిక కలిసి నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. బిల్లా మరియు రంగా పాత్రలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటించడం జరిగింది. మలేషియా దేశంలో అండర్వరల్డ్ డాన్ పాత్రలో మరియు హైదరాబాద్ నగరంలో ఉండే దొంగ పాత్రలో ప్రభాస్ నటించి మెప్పించారు.

మలేషియా దేశంలో బిల్లాని పట్టుకునే ఏ సి పి పాత్రలో కృష్ణంరాజు నటించడం జరిగింది. మణిశర్మ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరించగా పాటలు కూడా విజయం సాధించాయి. బిల్లా తరువాత ప్రభాస్ నటించిన చిత్రం ఏక్ నిరంజన్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కధానాయికగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రబస్, పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం ఏక్ నిరంజన్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలో సోను సూద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

వరుస విజయాలు

దర్శకులు కరుణాకరన్ దర్శకత్వంలో 2010 సంవత్సరంలో ప్రభాస్, కాజల్ నటించిన ప్రేమకథ చిత్రం డార్లింగ్. తమిళ నటులు ప్రభు ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం అద్భుతంగా చిత్రకరించారు దర్శకులు కరుణాకరన్. జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు అన్ని పాటలు జనాదరణ పొందాయి.

శ్రద్ధాదాస్ మరో కధానాయికగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది మరియు ఈ చిత్ర్రాన్ని కన్నడ భాషలో రీమేక్ చేయడం జరిగింది. డార్లింగ్ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

2011 సంవత్సరంలో దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్, కాజల్, కలిసి నటించిన రెండవ చిత్రం Mr. పర్ఫెక్ట్. “నాకు నచ్చిందే నేను చేస్తా ఎవ్వరి మాట వినను” అనే పాత్రలో ప్రభాస్ అంతేకాకుండా సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న పాత్రలో కాజల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది అలాగే పాటలు కూడా ప్రేక్షకులను అలరించింది. తాప్సి, ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం విజయం సాధించడమే కాకుండా కొన్ని పురస్కారాలు లభించడం విశేషం. 

ప్రముఖ నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, తమన్నా, దీక్షసేథ్ కలిసి నటించిన చిత్రం రెబెల్. రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కుడా అందించారు రాఘవ లారెన్స్.

కొరటాల శివ దర్శకత్వంలో 2013 సంవత్సరంలో ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాద్యాయ్, సుబ్బరాజు ప్రధాన పాత్రలో వచ్చిన మిర్చి చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం మిర్చి అవ్వడం విశేషం. మిర్చి చిత్రంలోని కధ, కధనం మరియు ప్రభాస్ నటన ప్రేక్షకులను అలరించాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ తల్లితండ్రులుగా సత్యరాజ్, నదియా నటించడం జరిగింది. మిర్చి చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంతో పాటు పాటలు కూడా అలరించాయి.  మరియు ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

పాన్ ఇండియా చిత్రాలు

ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అడవి శేష్, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు నటించిన చిత్రం బాహుబలి – ది బిగినింగ్ మరియు బాహుబలి – ది కంక్లూషన్. 2015 సంవత్సరంలో మొదటి భాగం అలాగే 2017 సంవత్సరంలో రెండవ భాగం విడుదలయ్యాయి.

కల్పిత కధ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై భారీ విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. మాహిష్మతి సామ్రాజ్యం అనే కల్పిత రాజ్యం సృష్టించి ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లారు దర్శకులు ఎస్. ఎస్. రాజమౌళి. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మరియు శివుడు పాత్రలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయడం జరిగింది.

బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ మరె చిత్రంలో కూడా నటించకుండా 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ప్రభాస్ పడ్డ కష్టానికి తెలుగు సినీ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న భారత సినీ అభిమానులు ప్రభాస్ నటనకి బ్రహ్మరధం పట్టారు. “ఏది మరణం” అంటూ యుద్ధం సమయంలో ప్రభాస్ చెప్పిన సంభాషణలు అలాగే “జై మాహిష్మతి” అంటూ ప్రభాస్ ప్రమాణస్వీకారం చేసే సన్నివేశం చూస్తుంటే ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే ప్రతినాయకుడిగా భళ్లాలదేవ పాత్రలో రానా చాలా అద్భుతంగా నటించారు అనడంకంటే జీవించారు అని చెప్పొచ్చు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ, దేవసేన పాత్రలో అనుష్క, అవంతిక పాత్రలో తమన్నా, కట్టప్ప పాత్రలో ప్రముఖ తమిళ నటులు సత్యరాజ్ నటించారు అనడంకంటే జీవించారు అని చెప్పుకోవచ్చు.

బాహుబలి చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఈ ఛిట్ర్రంలోని ప్రతి పాట ప్రేక్షకులని అలరించింది. మొదటి భాగం మరియు రెండవ భాగంలో వచ్చే ప్రతీ పాట మరియు నేపధ్య సంగీత కూడా ప్రేక్షకులను అలరించాయి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ మీద ప్రసాద్ దేవినేని, శోబు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి చిత్ర రెండు భాగాలకు ఎన్నో పురస్కారాలు లభించడం విశేషం.

మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మరో చిత్రం సాహు. సుజిత్ దర్శకత్వంలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ తొలిసారి తెలుగులో కధానాయికగా నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జాకీ శ్రోఫ్ తండ్రి పాత్రలో నటించారు మరియు ఈ చిత్రానికి గిబ్రాన్ నేపధ్య సంగీతం అందించగా, తనిష్క్ బాగ్చి, గురు రంధావా, బాద్షా మరియు శంకర్ ఇషాన్ లాయి సంగీతాన్ని సమకూర్చారు.   

సాహు తరువాత వచ్చిన రాధేశ్యామ్ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్, పూజ హెగ్డే కలిసి నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యి విఫలమైంది. 1970 సంవత్సరం ఇటలీ దేశంలో జరిగే కథతో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా అలాగే తన గురువు పాత్రలో “రెబెల్ స్టార్” కృష్ణంరాజు వృద్ధ జ్యోతిష్యులు పాత్రలో కనిపించడం విశేషం. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది.

2022 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్ ప్రసీద, భూషణ్ కుమార్ కలిసి నిర్మించగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ తెలుగు పాటలకి సంగీతం అందించగా ఎస్. ఎస్. థమన్ నేపధ్య సంగీతం అందించారు. మిథూన్, మనన్ భరద్వాజ్, అమల్ మల్లిక్ హిందీ పాటలకి మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార నేపధ్య సంగీతం అందించారు.

హిందీ పరిశ్రమలో అడుగు

మొదటి సారి ప్రభాస్ తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకున్నారు. దర్శకులు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్ కలిసి నటించారు. హిందూ పురాణ ఇతిహాసమైన రామాయణం కథ నుంచి ఒక ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ తీసిన ఆదిపురుష్ చిత్రం  ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురుకుంది.

రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతిసనన్ నటించిన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. 2023 సంవత్సరంలో టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సంచిత్ బల్హార, అంకిత్ బల్హార నేపధ్య సంగీతం అందించగా అజయ్ అతుల్, సచేత్ – పరంపర సంగీతాన్ని సమకూర్చారు.

కెజిఫ్ చిత్రాన్ని తీసిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హస్సన్ కలిసి నటించిన చిత్రం సలార్: పార్ట్ – 1 – సీస్ ఫైర్. పూర్తిగా యాక్షన్ నేపథ్యంతో తీసిన ఈ చిత్రంలో మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఖాంసార్ అనే ఊహాతీతమైన ప్రపంచాన్ని సృష్టించారు ప్రశాంత్ నీల్. తెలుగు వ్యాఖ్యాత ఝాన్సీ మరియు తమిళ నటుడు విశాల్ వదిన శ్రియ రెడ్డి, కన్నడ నటులు దేవరాజ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.

2023 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి రవి బర్సుర్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం మరియు పాటలు ప్రేక్షకులని అలరించాయి. విజయ్ కిరగందురు నిర్మించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఉత్కంఠకి గురిచేస్తుంది. ఈశ్వరి రావు ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా నటించి మెప్పించారు.

ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి దర్శకులు నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి 2898 AD. సి. అశ్వినీదత్ నిర్మాణంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద విడుదలైన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మహాభారతం యుద్ధంతో మొదలై ఆ తరువాత 6000 సంవత్సరాల తరువాత పరిస్థితులు ఎలాగున్నాయి అనే కల్పిత కధతో తీసిన చిత్రం కల్కి 2898 AD.

ఈ చిత్రంలో బాలీవుడ్ “బిగ్ బి” అమితాబ్ బచ్చన్, “లోకనాయకుడు” కమల్ హస్సన్, “నటకిరీటి” రాజేంద్ర ప్రసాద్, “రెబెల్ స్టార్” ప్రభాస్, బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, దిశా పటాని నటించారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో శోభన, విజయ్ దేవరకొండ, మలయాళం నటులు దుల్కర్ సల్మాన్, దర్శకులు ఎస్. ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

వ్యక్తిగతం

ప్రముఖ నటులు రెబెల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 సంవత్సరం, అక్టోబర్ 23న చెన్నై నగరంలో జన్మించారు. ప్రభాస్ సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగల్తూరు. చదువంతా చెన్నై, భీమవరం మరియు హైదరాబాద్ నగరంలో కొనసాగింది.

ప్రభాస్ తండ్రి ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు తల్లి పేరు శివ కుమారి. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ మీద కొన్ని చిత్రాలు నిర్మించారు ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ప్రభాస్ కి ఒక సోదరుడు మరియు ఒక సోదరి.

సత్యానంద్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకున్నారు ప్రభాస్. ఇప్పటివరకు ఎన్నో రకాలుగా గుప్తదానాలు చేశారు ప్రభాస్. హిందీలో విడుదలైన యాక్షన్ జాక్సన్ చిత్రంలోని ఒక పాటలో అతిధి పాత్ర చేశారు అంతే కాకుండా మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రానికి గాత్ర దానం చేశారు ప్రభాస్.

ప్రభాస్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. ఈశ్వర్
  2. రాఘవేంద్ర
  3. వర్షం
  4. అడవిరాముడు
  5. చక్రం
  6. ఛత్రపతి
  7. పొర్ణమి
  8. యోగి
  9. మున్నా
  10. బుజ్జిగాడు
  11. బిల్లా
  12. ఏక్ నిరంజన్
  13. డార్లింగ్
  14. Mr. పర్ఫెక్ట్
  15. రెబల్
  16. మిర్చి
  17. యాక్షన్ జాక్సన్ (ఒక పాటలో అతిధి పాత్ర)
  18. బాహుబలి: ది బిగినింగ్
  19. బాహుబలి: ది కంక్లూషన్
  20. సాహు
  21. రాధేశ్యామ్
  22. ఆదిపురుష్
  23. సలార్
  24. కల్కి 2898 AD

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *