అది 2001 సంవత్సరం భారత క్రికెట్ జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగంలో బలంగా ఉంది కానీ భారత జట్టుకి ఉన్న ప్రధానమైన సమస్య సరైన వికెట్ కీపర్ లేకపోవడమే. అప్పటి వరకు భారత జట్టుకి వికెట్ కీపర్ & బ్యాటర్ స్థానంలో సేవలందించిన నయన్ మోంగియా ఒక వైపు బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టడం మరో వైపు వికెట్ కీపింగ్ చేస్తూ చాకచక్యంగా క్యాచ్లు అందుకోవడం జరిగేది.
కానీ 2001 సంవత్సరం తరువాత నయన్ మోంగియా భారత క్రికెట్ జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సరైన వికెట్ కీపర్ మరియు బ్యాటర్ భారత జట్టుకి దొరకలేదు. ఎంతోమంది ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చిన కూడా ఎవరు వినియోగించుకోలేదు. విజయ్ దహియా, సబా కరీం, సమీర్ దీఘే, దీప్ దాస్ గుప్త, దినేష్ కార్తీక్, అజయ్ రాత్ర, పార్థివ్ పటేల్ లాంటి ఆటగాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినా కూడా నిరాశపరిచారు.
చివరికి భారత క్రికెట్ బోర్డు రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్ ఆటగాడిని ఒప్పించి వన్డే క్రికెట్లో వికెట్ కీపింగ్ చేయమని కోరడంతో తను ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. కానీ టెస్ట్ మ్యాచ్లో మాత్రం వికెట్ కీపర్ సమస్య తొలగిపోలేదు. ఒక్కో సిరీస్ కోసం ఒక్కో వికెట్ కీపర్ని ఎంపిక చేయడం వారు విఫలం అవ్వడం అలా కొనసాగుతుంది.
వికెట్ కీపింగ్ కోసం మళ్లి నయన్ మోంగియా ని వెనక్కి పిలవాలా లేక మరో కొత్త ఆటగాడి కోసం వేచి చూద్దామా లేక ఇప్పుడున్న వాళ్ళతోనే కొనసాగిద్దామా అనే ఆలోచనలో పడ్డారు భారత క్రికెట్ బోర్డు పెద్దలు మరియు అప్పటి సారధి సౌరవ్ గంగూలీ. వికెట్ కీపర్ గురించి ఆలోచిస్తుండగానే మరో సిరీస్ కోసం భారత జట్టు బాంగ్లాదేశ్ పర్యటనకి బైలుదేరడానికి సిద్దపడింది.
ఈసారి మరో కొత్త వికెట్ కీపర్ కి అవకాశం ఇచ్చి తనని బాంగ్లాదేశ్ సిరీస్ కోసం ఎంపిక చేయడం జరిగింది. అప్పటికే ఆ కొత్త ఆటగాడి పేరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అందరు చర్చించుకోవడంతో ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలనే ఉద్దేశంతో ఆ కొత్త ఆటగాడికి ఎంపిక చేయడం జరిగింది. భారత జట్టులో ఎంపిక చేసిన ఆ కొత్త ఆటగాడిని బాంగ్లాదేశ్ సిరీస్ కోసం తమతో తీసుకెళ్లింది భారత జట్టు.
విదేశీ, స్వదేశీ సిరీస్
2004 సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఆ కుర్రాడికి బ్యాట్టింగ్ చేసే అవకాశం రావడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆడిన మొదటి బంతికే రన్ ఔట్ అవ్వడం చక చక జరిగిపోయాయి. ఆ తరువాత జరిగిన మరో రెండు మ్యాచ్లలో 12 మరియు 7 పరుగులు చేసి క్రికెట్ అభిమానులని నిరాశపరిచారు.
ఆ సిరీస్ తరువాత పాకిస్తాన్ జట్టుతో భారత్ జట్టు స్వదేశంలో ఆడే సిరీస్ కోసం ఆ కుర్రాడికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటి మ్యాచ్ పరవాలేదనిపించినా రెండవ మ్యాచ్లో శతకం సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు మరియు ఆ సిరీస్ లో ఆ యువ ఆటగాడు పరవాలేదనిపించారు.
శ్రీలంక జట్టుతో భారత జట్టు స్వదేశంలో ఆడిన వన్డే సిరీస్ లో జరిగిన మూడవ మ్యాచ్లో శ్రీలంక జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించడానికి భారత జట్టు ఆ కుర్రాడిని మూడవ స్థానంలో దింపగా ఆ కుర్రాడు భారీ శతకం సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. 145 బంతులు ఆడి 183 పరుగులు చేసి అవుట్ అవ్వకుండా భారత జట్టుని గెలిపించడం విశేషం మరియు ఆ సిరీస్ లో తన ఆటతో అభిమానులని సంపాదించుకున్నారు.
ఆ కుర్రాడి పేరేంటి
బీహార్ రాష్ట్రం, రాంచి నగరంలో 1981 సంవత్సరం జులై 7న జన్మించిన ఆ కుర్రాడి పేరు మహేంద్ర సింగ్ ధోని. ఒకప్పుడు రాంచి నగరం బీహార్ రాష్ట్రంలో ఉండగా విభజన జరిగిన తరువాత ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధానిగా మారింది రాంచి నగరం.
చిన్నతనం నుంచి ఫుట్ బాల్ క్రీడా మీద ఆసక్తి ఎక్కువ ఉండటంతో పాఠశాలలో ఎక్కువగా ఫుట్ బాల్ ఆడుతూ ఉండేవారు మహేంద్ర సింగ్ ధోని. ఫుట్ బాల్ క్రీడలో తన పాత్ర వచ్చేసి గోల్ కీపింగ్ చేయడం మరియు గోల్ కీపింగ్ చేయడంలో ప్రావిణ్యం చెందారు. ఒక రోజు తను చదువుకునే పాఠశాలలో క్రికెట్ మ్యాచ్ ఉండటంతో ఆ క్రికెట్ జట్టులో ఆడే వికెట్ కీపర్ రాకపోవడంతో ఆ పాఠశాలలో ఉన్న క్రికెట్ కోచ్ ధోనితో మాట్లాడి తమ క్రికెట్ జట్టులో వికెట్ కీపింగ్ చేయమని కోరడం జరిగింది. ముందు నిరాకరించిన ఆ తరువాత ఒప్పుకున్నారు మహేంద్ర సింగ్ ధోని.
ఆ తరువాత కోచ్ ఇచ్చిన సలహా మేరకు ధోని ఫుట్ బాల్ వదిలి క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా వికెట్ కీపింగ్ మీద ద్రుష్టి సాధించామని ధోనిని కోచ్ పదే పదే చెప్పడం జరిగింది. తనకు బ్యాటింగ్ లో కూడా శిక్షణ కావాలి అని కోరినప్పుడు కూడా, బ్యాటింగ్ తరువాత ముందు వికెట్ కీపింగ్ చేయమని తన కోచ్ చెప్పేవారు. అలా ధోని వికెట్ కీపింగ్ మీదనే ద్రుష్టి సాధించి శిక్షణ తీసుకుంటూ కోచ్ లేనప్పుడు మాత్రం బ్యాటింగ్ మీద శిక్షణ చేసేవారు.
క్రికెట్ అరంగ్రేటం
ఫుట్ బాల్ నుంచి క్రికెట్ ఆటకు దెగ్గరయ్యాక విరామం లేకుండా శిక్షణ తీసుకుంటూ ఒక వైపు చదువుకుంటూ మరో వైపు క్రికెట్ సాధన చేసేవారు మహేంద్ర సింగ్ ధోని. చదువుకుంటూనే మరోవైపు రకరకాల క్రికెట్ క్లబ్లలో ఆడుతూ వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ మెరుగు పరుక్కుకునేవారు. 1999 సంవత్సరంలో బీహార్ జట్టు తరఫునుంచి మొదటిసారి రంజీ ట్రోఫీ టౌర్నమెంట్లో అడుగుపెట్టారు మహేంద్ర సింగ్ ధోని.
అస్సాం జట్టుతో ఆడిన ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 40 మరియు రెండవ ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసి ఒక స్టంపింగ్ చేశారు మరియు ఈ మ్యాచ్ బీహార్ జట్టు గెలిచింది. ఆ సీజన్లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని పరవాలేదనిపించారు. ఆ తరువాత మరొక్క సీజన్లో బెంగాల్ జట్టు మీద ఒక శతకం సాధించారు. మరుసటి రంజీ ట్రోఫీ సీజన్లో వరుసగా 5 అర్ధ శతకాలు సాధించారు మహేంద్ర సింగ్ ధోని.
1999 – 2004 సంవత్సరం మధ్య బీహార్ జట్టుకి రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడిన ధోని ఆ తరువాత 2004 సంవత్సరం నుండి ఝార్ఖండ్ జట్టు తరుపున రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడటం మొదలుపెట్టారు.
అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం
2004 సంవత్సరం బంగ్లాదేశ్ జట్టు మీద అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగ్రేటం చేసిన మహేంద్ర సింగ్ ధోని పెద్దగా ఆకట్టుకోలేపోయారు. ఆడిన మూడు మ్యాచ్లలో విఫలం అయ్యారు. భారత జట్టు తరఫునుంచి 158వ క్యాప్ ఆటగాడిగా భారత అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అడుగుపెట్టారు ధోని. ఆ తరువాత వరుసగా పాకిస్తాన్ జట్టుపై మరియు శ్రీలంక జట్టుపై స్వదేశంలో చేసిన భారీ శతకాలతో మళ్ళి వెనక్కి తిరిగి చూసుకోలేదు మహేంద్ర సింగ్ ధోని మరియు అతని స్థానానికి, అతను చేసే వికెట్ కీపింగ్ పాత్రకి వన్డే క్రికెట్లో పదిలంగా ఉండిపోయింది.
2005 సంవత్సరంలో 251వ క్యాప్ ఆటగాడిగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో భారత జట్టులో అడుగుపెట్టారు మహేంద్ర సింగ్ ధోని. శ్రీలంక జట్టుతో జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్లో 30 పరుగులు చేశారు మరియు ఈ సిరీస్ లో 5 ఇన్నింగ్స్ ఆడి ఒక అర్ధ శతకం సాధించారు ధోని. ఇక వరుసగా ప్రతి సిరీస్ లో అవకాశాలు రావడంతో తన ఆటని నిరూపించుకున్నారు మహేంద్ర సింగ్ ధోని, కొన్ని సార్లు విఫలం అవ్వడం వల్ల విమర్శల పాలయ్యారు ధోని.
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ మ్యాచ్లో 2వ క్యాప్ ఆటగాడిగా ధోని ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ భారత జట్టుకి మొదటి అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ అవ్వడం విశేషం. ఈ మ్యాచ్లో ధోని రెండు బంతులు ఎదుర్కొని 0 పరుగులకు వెనుదిరిగారు మరియు ఒక క్యాచ్ అందుకుని, ఒక రన్ అవుట్ లో పాలుపంచుకున్నారు.
ప్రపంచకప్ మరియు సారధి బాధ్యతలు
అప్పుడే భారత జట్టు 2007 సంవత్సరంలో వెస్ట్ ఇండీస్ దేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఓడిపోయి ఘోరపరాభవం చూసి మధ్యలోనే నిష్క్రమించింది. ఆ బాధలో ఉన్న భారత జట్టుకి ఇంకో ప్రపంచకప్ మొదలవుతుంది అనగానే, కుర్రాళ్లతో కూడిన భారత జట్టుని దక్షిణాఫ్రికా పంపించాలని అప్పటి సారధి రాహుల్ ద్రావిడ్ నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ మరియు మిగితా సీనియర్ ఆటగాళ్లు ఆమోదించారు. మరి భారత జట్టు సారధిగా ఎవరుంటారు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలవ్వగా, అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తూ 20 – 20 క్రికెట్ ప్రపంచకప్ భారత జట్టు సారధిగా మహేంద్ర సింగ్ ధోని ని ఎంపిక చేశారు భారత క్రికెట్ బోర్డ్ పెద్దలు.
20 – 20 క్రికెట్ ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో 20 – 20 క్రికెట్ ప్రపంచకప్ మొదలుపెట్టారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పెద్దలు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్ లో భారత జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం జరిగింది.
భారత జట్టు ఆడిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా పాకిస్తాన్ జట్టుతో ఆడిన రెండవ మ్యాచ్ టై గా ముగిసింది. బౌల్ అవుట్ పద్దతి ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు. ఈ బౌల్ అవుట్ పద్దతి ద్వారా భారత జట్టు విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సూపర్ ఎయిట్, సెమీ ఫైనల్ మ్యాచ్లు గెలిచి భారత జట్టు ఫైనల్ వరకు చేరింది.
ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుతో భారత జట్టు తలపడగా, భారత జట్టు అనూహ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచింది. చేజారిపోతుంది అనుకున్న మ్యాచ్ మలుపులు తిరిగి భారత జట్టు వైపు తిరిగి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ధోని చేసిన సారధ్యం, అతను తీసుకున్న నిర్ణయాలు ఈ విజయంలో భాగమవ్వడం విశేషం.
ఇక 20 – 20 క్రికెట్ ప్రపంచకప్ విజయం తరువాత మహేంద్ర సింగ్ ధోని పూర్తి స్థాయి అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ సారధి బాధ్యతలు తీసుకున్నారు. 2007 సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ సారధి బాధ్యతల నుండి తప్పుకున్నాక మహేంద్ర సింగ్ ధోని వన్డే క్రికెట్ సారధి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన సిరీస్ నుండి భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహించడం మొదలుపెట్టారు ధోని.
ఇక టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే అప్పటి వరకు స్పిన్ దిగజ్జం అనిల్ కుంబ్లే సారధిగా ఉండగా, గాయం కారణంగా ఒక టెస్ట్ మ్యాచ్లో అనిల్ కుంబ్లే తప్పుకోగా ఆ బాధ్యత మహేంద్ర సింగ్ ధోనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన టెస్ట్ సిరీస్ మధ్యలో అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనుక్హ్యాంగా వీడ్కోలు పలకడంతో పూర్తి స్థాయి సారధ్య బాధ్యతలు తీసుకున్నారు మహేంద్ర సింగ్ ధోని.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
2008 సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టౌర్నమెంట్లో మహేంద్ర సింగ్ ధోని వేలంపాటలో భారీ ధరకి చెన్నై జట్టు కొనుగోలు చేయడం జరిగింది. చెన్నై జట్టుకి ఆటగాడిగానే కాకుండా సారధి బాధ్యతలను కూడా అప్పజెప్పారు చెన్నై జట్టు యజమానులు. అప్పటినుండి చెన్నై జట్టుకి ధోని సారధ్య బాధ్యతలు వహించడం విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 9 మరియు 10 వ సీజన్లలో (2016 & 2017 సంవత్సరం) రెండేళ్లు చెన్నై జట్టు నిషేదానికి గురవ్వడం వల్ల మహేంద్ర సింగ్ ధోని పూణే జట్టుకి ఆడటం జరిగింది. సారధిగా కాకుండా కేవలం ఆటగాడిగా ఆడారు ధోని, ఆ తరువాత మళ్ళి నిషేధం తొలిగిపోయాక చెన్నై జట్టుకి తిరిగి సారధిగా భాద్యతలు వహించారు మహేంద్ర సింగ్ ధోని.
తన సారథ్యంతో, ప్రతిభతో, రకరకాల వ్యూహాలు వేయడంలో అలాగే ఎత్తులు, పైఎత్తులతో ప్రత్యర్థి జట్టుని బోల్తా కొట్టించి చెన్నై జట్టుకి 5 సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గెలవడం విశేషం. అంతేకాకుండా ధోని సారధ్యంలో 5 సార్లు చెన్నై జట్టు రన్నరప్ అవ్వడం విశేషం. చెన్నై జట్టు నిషేదానికి గురైనప్పుడు పూణే జట్టు రెండేళ్లు ఈ టౌర్నమెంట్లో ఆడితే రెండవ సారి పూణే జట్టుని రన్నరప్ జట్టుగా నిలవడంతో ధోని పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. సారధిగా కాకుండా ఆటగాడిగా పూణే జట్టుతో ఆడారు ధోని.
ఛాంపియన్స్ లీగ్
దేశ విదేశాల్లో జరిగే 20 – 20 క్రికెట్ మ్యాచ్లలో ఏ జట్టైతే విన్నర్ మరియు రన్నర్ అవుతారో ఆ రెండు జట్లని మరో కొత్త లీగ్ టోర్నమెంట్లో ఆడించడం జరుగుతుంది, ఆ లీగ్ పేరే ఛాంపియన్స్ లీగ్ 20 – 20 క్రికెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఈ లీగ్ కూడా ఉండటం విశేషం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మరియు మరికొన్ని దేశాల్లో జరిగే డొమెస్టిక్ క్రికెట్ లీగ్లలో ఏ జట్లైతే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయో ఆ జట్లు ఛాంపియన్స్ లీగ్ 20 – 20 క్రికెట్లో పాల్గొంటాయి.
ఈ ఛాంపియన్స్ లీగ్ 20 – 20 క్రికెట్ టౌర్నమెంట్లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై జట్టు 5 సార్లు అర్హత సాధిస్తే రెండు సార్లు ట్రోఫీ గెలవడం విశేషం.
2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ
భారత జట్టు 1983 సంవత్సరంలో కపిల్ దేవ్ సారధ్యంలో వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించి ప్రపంచకప్ గెలిచింది, ఆ తరువాత ఎప్పుడు కూడా భారత్ ప్రపంచకప్ గెలిచింది లేదు మరియు దెగ్గరగా వచ్చి ఓడిపోయేది, అలా ప్రపంచకప్ భారత్ జట్టుకి అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ ధోని సారధ్యంలో 2011 సంవత్సరంలో భారత్ దేశంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ జట్టు శ్రీలంక జట్టు మీద ఫైనల్ మ్యాచ్ ఆడి ప్రపంచకప్ గెలిచింది.
సిక్స్ కొట్టి ధోని విజయాన్ని అందించగా, ఆ విజయాన్ని దిగజ్జ ఆటగాడు సచిన్ టెండూల్కర్కి అంకితం ఇవ్వడం విశేషం. ఈ మ్యాచ్లో సారధి మహేంద్ర సింగ్ ధోని 91* పరుగులు చేసి భారత జట్టుని గెలిసిపించడమే కాకుండా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సంపాదించారు. ధోని సారధ్యంలో 2 ఆసియా కప్ ట్రోఫీలు (2010, 2016 సంవత్సరం) మరియు ఆటగాడిగా 2018 సంవత్సరంలో ఒక ట్రోఫీ గెలవడం విశేషం.
2013 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జరిగిన వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా భారత జట్టు ఫైనల్ చేరడం, ఆ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్, భారత జట్టు మధ్య జరగడం, వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్ 20 ఓవర్లకు కుదించడం, తరువాత భారత జట్టు విజయం సాధించడం జరిగిపోయాయి.
ఇలా ఐసీసీ టౌర్నమెంట్లో ఉన్న మూడు రకాల ట్రోఫీలు, అలాగే ఆసియ ఖండానికి మాత్రమే పరిమితమైన ఆసియ కప్ టోర్నమెంట్ మ్యాచ్లు గెలిచిన సారధిగా ధోని చరిత్ర సృష్టించారు. అన్ని రకాల ఫార్మాట్లోనూ తనదైన శైలిలో సారధిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఒకవైపు బ్యాటింగ్ చేస్తూ మరోవైపు వికెట్ కీపింగ్ చేస్తూ భారత జట్టుని ముందుకు నడిపించారు మహేంద్ర సింగ్ ధోని.
భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ధోని తన సారధి బాధ్యలతో పాటు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆటకు కూడా వీడ్కోలు పలకడం జరిగింది. మూడవ టెస్ట్ మ్యాచ్ తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ధోని.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఫార్మటు నుంచి వీడ్కోలు పలికిన తరువాత వన్డే క్రికెట్ మరియు 20 – 20 క్రికెట్ ఫార్మాట్లలో రాణించారు ధోని. 2015 సంవత్సరంలో జరిగిన క్రికెట్ పరపంచకప్ లో భారత జట్టుని సెమీఫైనల్ వరకు తీసుకెళ్లారు ధోని. అనూహ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది.
వన్డే మరియు 20 – 20 క్రికెట్ వీడ్కోలు
ఇక 2016 సంవత్సరంలో వెస్ట్ ఇండీస్ జట్టుతో జరిగిన రెండు 20 – 20 క్రికెట్ మ్యాచ్లు తరువాత సారధి బాధ్యతలకు వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగారు. 2019 సంవత్సరంలో భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 20 – 20 క్రికెట్ సిరీస్ లో 29 & 40 పరుగులు చేసి 20 – 20 క్రికెట్ ఫార్మాటుకు వీడ్కోలు పలకడం జరిగింది.
అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ ఫార్మాటుకు వీడ్కోలు పలికిన వన్డే క్రికెట్ ఫార్మాట్లో కొనసాగారు మహేంద్ర సింగ్ ధోని. 2016 సంవత్సరంలో జింబాబ్వే జట్టుతో జరిగిన 3 వన్డే సిరీస్ గెలిచి ఆ తరువాత సారధి బాధ్యతలకు వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగారు. ఈ సిరీస్ లో ధోని కి బ్యాట్టింగ్ అవకాశం రాలేదు కానీ వికెట్ కీపింగ్ చేస్తూ 4 క్యాచ్లు అందుకున్నారు.
2016 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ లో జరిగిన మూడు వన్డే సిరీస్ లో ఒక శతకం సాధించారు మహేంద్ర సింగ్ ధోని మరియు ఆ సిరీస్ భారత్ గెలిచింది. 2017 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఓడిపోవడం జరిగింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని కేవలం ఒక్క అర్ధ శతకం సాధించారు.
వెస్ట్ ఇండీస్ జట్టుతో వారి దేశంలో జరిగిన వన్డే సిరీస్ లో రెండు అర్ధ శతకాలు సాధించి 5 క్యాచ్లు మరియు 2 స్టంపింగ్స్ చేయడం జరిగింది. ఆ వన్డే సిరీస్ భారత జట్టు గెలవడం విశేషం. అలా వరుస సిరీస్ లో ఆటగాడిగా ఆడుతూ కొన్ని మంచి ఇన్నింగ్స్ లో పాలు పంచుకుంటూ కొనసాగారు ధోని. 2019 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన ధోని కేవలం రెండు అర్ధ శతకాలు సాధించి 7 క్యాచ్లు, 2 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
ఈ ప్రపంచకప్ లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో ధోని 50 పరుగులు చేసి రనౌట్ అవ్వడం జరిగింది మరియు ఈ మ్యాచ్ భారత జట్టు ఓడిపోవడం బాధాకరం. ఈ ప్రపంచకప్ తరువాత మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. తన మొదటి వన్డే మ్యాచ్ రనౌట్ తో ప్రారంభించి ఆఖరి వన్డే మ్యాచ్ కూడా రనౌట్ తో ముగించారు ధోని.
సారధిగా రికార్డ్స్
టెస్ట్ క్రికెట్: టెస్ట్ క్రికెట్ సారధిగా మహేంద్ర సింగ్ ధోని మొత్తం 60 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 27 మ్యాచ్లో విజయాలు సాధించి, 18 మ్యాచ్లు అపజయాలు పాలయ్యారు మరియు 15 మ్యాచ్లు డ్రా గా ముగిసాయి.
వన్డే క్రికెట్: వన్డే క్రికెట్ సారధిగా మహేంద్ర సింగ్ ధోని మొత్తం 200 మ్యాచ్లు ఆడగా 110 మ్యాచ్లో విజయాలు సాధించి, 74 మ్యాచ్లు అపజయాలు పాలయ్యారు మరియు 5 మ్యాచ్లు టై అవ్వగా 11 మ్యాచ్లలో ఫలితం రాలేదు.
20 – 20 క్రికెట్: 20 – 20 క్రికెట్ సారధిగా మహేంద్ర సింగ్ ధోని మొత్తం 72 మ్యాచ్లు ఆడగా 41 మ్యాచ్లో విజయాలు సాధించి, 28 మ్యాచ్లు అపజయాలు పాలయ్యారు మరియు ఒక మ్యాచ్ టై అవ్వగా 2 మ్యాచ్లు ఫలితం రాలేదు.
ఐపీఎల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టౌర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సారధిగా ఉంటూ మొత్తం 226 మ్యాచ్లు ఆడగా 133 మ్యాచ్లో విజయాలు సాధించి, 91 మ్యాచ్లు అపజయాలు పాలయ్యారు మరియు 2 మ్యాచ్లు ఫలితం రాలేదు.
ఛాంపియన్స్ లీగ్: 20 – 20 క్రికెట్ ఛాంపియన్స్ లీగ్ టౌర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సారధిగా ఉంటూ మొత్తం 23 మ్యాచ్లు ఆడగా 14 మ్యాచ్లో విజయాలు సాధించి, 8 మ్యాచ్లు అపజయాలు పాలయ్యారు మరియు ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో మొత్తం 90 మ్యాచ్లు ఆడి 38.09 సగటుతో 4,876 పరుగులు సాధించారు, ఇందులో 6 శతకాలు, 33 అర్ధ శతకాలు ఉండగా, అత్యధిక స్కోర్ వచ్చేసి 224. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 96 బంతులు వేయగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు మరియు వికెట్ కీపింగ్ విషయానికి వస్తే మొత్తం 256 క్యాచ్లు అందుకోగా, 38 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
వన్డే క్రికెట్: మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో మొత్తం 350 మ్యాచ్లు ఆడి 50. 57 సగటుతో 10,773 పరుగులు సాధించారు, ఇందులో 10 శతకాలు, 73 అర్ధ శతకాలు ఉండగా, అత్యధిక స్కోర్ వచ్చేసి 183* ఇక బౌలింగ్ విషయానికి వస్తే 36 బంతులు వేయగా 31.00 సగటుతో ఒక్క వికెట్ పడగొట్టారు మహేంద్ర సింగ్ ధోని. అత్త్యుత్తమ బౌలింగ్ 1/14, అలాగే వికెట్ కీపింగ్ గురించి చెప్పుకోవాలంటే 321 క్యాచ్లు అందుకుని, 123 స్టంపింగ్స్ చేశారు.
20 – 20 క్రికెట్: మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ 20 – 20 క్రికెట్ లో మొత్తం 98 మ్యాచ్లు ఆడి 37.60 సగటుతో 1,617 పరుగులు సాధించారు, ఇందులో 2 అర్ధ శతకాలు మాత్రమే ఉన్నాయి, అత్యధిక స్కోర్ వచ్చేసి 56. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే 57 క్యాచ్లు అందుకోగా, 34 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
మరికొన్ని గణాంకాలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్: ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని మొత్తం 131 మ్యాచ్లు ఆడి 36.84 సగటుతో 7,038 పరుగులు సాధించగా, ఇందులో 9 శతకాలు, 47 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ వచ్చేసి 224 మరియు 364 క్యాచ్లు అందుకోగా 57 స్టంపింగ్స్ చేయడం జరిగింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 126 బంతులు వేయగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు.
లిస్ట్ ఏ క్రికెట్: లిస్ట్ ఏ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని మొత్తం 423 మ్యాచ్లు ఆడి 50.38 సగటుతో 13,353 పరుగులు సాధించగా, ఇందులో 17 శతకాలు, 87 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ వచ్చేసి 183*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 63 బంతులు వేయగా 26.50 సగటుతో 2 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 1/14. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే 402 క్యాచ్లు అందుకోగా, 141 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
20 – 20 క్రికెట్: దేశి 20 – 20 క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని మొత్తం 391 మ్యాచ్లు ఆది 38.11 సగటుతో 7,432 పరుగులు సాధించారు, ఇందులో 28 శతకాలు ఉన్నాయి మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 84*. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 12 బాల్స్ వేసి ఒక్క వికెట్ పడగొట్టలేదు. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే 224 క్యాచ్లు, 87 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
లీగ్ మ్యాచ్లు
ఐ. పీ. ఎల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సంవత్సరం వరకు ధోని 264 మ్యాచ్లు ఆడి 39.12 సగటుతో 5,243 పరుగులు చేయగా, 24 అర్ధ శతకాలు సాధించారు మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 84*. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే 152 క్యాచ్లు అందుకుని 42 స్టంపింగ్స్ చేయడం జరిగింది.
ఛాంపియన్స్ లీగ్: ఛాంపియన్స్ లీగ్ లో ధోని 24 మ్యాచ్లు ఆడి 29.93 సగటుతో 449 పరుగులు సాధించారు, ఇందులో ఒక్క అర్ధ శతకం ఉండటం విశేషం. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే 14 క్యాచ్లు అందుకోగా 11 స్టంపింగ్స్ చేయడం జరిగింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 12 బంతులు వేసి ఒక్క వికెట్ పడగొట్టలేదు.
వ్యక్తిగతం
1981 సంవత్సరం, 7 జులై న బీహార్ రాష్ట్రం, రాంచి నగరంలో పాన్ సింగ్, దేవకీ దేవి దంపతులకి మూడో బిడ్డగా జన్మించారు మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని చదువంతా రాంచి నగరం, డి. ఏ. వి. జవహర్ విద్య మందిర్ లో కొనసాగింది. డిగ్రీ లో బి. కామ్ కంప్యూటర్స్ చదువుతున్న ధోని క్రికెట్ వల్ల మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది.
సాక్షి సింగ్ రావత్ అనే యువతిని 2010 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఒక పాపా జీవా. అంతకుముందు ధోని ఒక అమ్మాయిని ప్రేమించగా, ఆ అమ్మాయి ఒక కారు ప్రమాదంలో మరణించడం బాధాకరం.
మరికొన్ని విషయాలు
కుడి చేతి బ్యాటర్, కుడు చేతి మీడియం బౌలర్ మరియు వికెట్ కీపర్ గా భారత జట్టుకి ఆడారు మహేంద్ర సింగ్ ధోని. మెరుపు వేగంతో, రెప్పపాటులో స్టంపింగ్ చేయడం ధోని ప్రత్యేకత. ధోని స్టంపింగ్ చేస్తుంటే మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు వీక్షిస్తున్న అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ధోని ఆడే షాట్స్ చూసి అభిమానులు ఆనందానికి హద్దులుండవ్.
ధోని ఆడే హెలికాప్టర్ షాట్ చాల ప్రత్యేకమైనది, బంతి కాలు దెగ్గర పడిన వెంటనే బ్యాట్ తో వేగంగా కొట్టడంతో ఆ బ్యాట్ వేగంగా తిరుగుతుంది. ధోని ఇష్టపడే షాట్స్లో ఇది ప్రత్యేకం అని చెప్పొచ్చు. తన చిన్నప్పుడు తోటి స్నేహితుడు ఈ షాట్ నేర్పించడం విశేషం. ధోని పేరుతొ హిందీ భాషలో M. S. ధోని: ది ఉంటోల్డ్ స్టోరీ పేరుతొ చిత్రాన్ని చిత్రీకరించారు దర్శకులు నీరజ్ పాండే. ఈ చిత్రానికి అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కలిసి నిర్మించడం జరిగింది.
ధోని పాత్రలో కధానాయకుడు సుశాంత్ సింగ్ రాజపుట్ పోషించగా, కియారా అద్వానీ కథానాయకి మరియు భార్య పాత్ర పోషించడం జరిగింది. ధోని కోచ్ పాత్రలో రాజేష్ శర్మ నటించారు. 2016 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి ముఖ్యపాత్రలో నటించిన ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ధోని అభిమానిగా మరియు క్రికెట్ ప్రేమికుడిగా ఆకాష్ పూరి అద్భుతంగా నటించారు.
ఇంకొన్ని విశేషాలు
తండ్రి చెప్పడంతో రైల్వేస్ లో ఉద్యోగం లో చేరిన ధోనికి కొన్ని రోజులు తరువాత ఆ పని నచ్చక తిరిగి ఇంటికి రావడం మళ్ళి ఫస్ట్ క్రికెట్ ఆడటం చేశారు. 2008 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్నారు. 2008, 2009 సంవత్సరంలో ఐసీసీ వన్డే ప్లేయర్ పురస్కారం అందుకున్నారు.
భారత క్రికెట్ కోసం ధోని చేసిన సేవలు గురించి భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవం దక్కింది. 2006 సంవత్సరంలో ఎం. టి. వి యూత్ ఐకాన్ అఫ్ ది ఇయర్ గా నిలిచారు. 2009 సంవత్సరం లో పద్మశ్రీ మరియు 2018 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.
2011 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని ఒక డి మోంట్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. 2011 ప్రపంచకప్ అప్పుడు కొట్టిన బంతి సిక్సర్ గా వెళ్లి ప్రేక్షకులు కూర్చున్న కుర్చీలో పడగా, ఆ కుర్చీలని ధోనికి అంకితం ఇచ్చారు. ఝార్ఖండ్ నగరంలోని ఒక మైదనాంలో ఉన్న స్టాండ్కు ధోని పేరు పెట్టడం విశేషం.
మాహి, కెప్టెన్ కూల్, తలా అని అభిమానులు ధోనిని అభిమానంతో పిలుస్తారు. ధోనికి బైకులంటే చాల ఇష్టం, అందుకని తన దెగ్గర రకరకాల బైక్లు ఉండటం విశేషం. వికెట్ కీపర్ గా మరియు బ్యాటర్ గా ఎన్నో రికార్డులు సృష్టించారు మహేంద్ర సింగ్ ధోని. ఎన్నో రకాల ప్రకటనలో కనిపించి అభిమానులని మెప్పించారు ధోని అలాగే ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతొ నిర్మాణ సంస్థ స్థాపించి ఎల్ జి ఎం అనే చిత్రాన్ని తమిళ భాషలో రూపొందించారు.