2001 సంవత్సరం లో భారత క్రికెట్ జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో బలంగా ఉంది కానీ భారత జట్టుకి ఉన్న ప్రధానమైన సమస్య సరైన వికెట్ కీపర్ లేకపోవడమే. అప్పటివరకు భారత జట్టుకి వికెట్ కీపర్ & బ్యాటర్ గా నయన్ మోంగియా ఉండటం జరిగింది కానీ 2001 సంవత్సరం తరువాత నయన్ మోంగియా భారత క్రికెట్ జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సరైన వికెట్ కీపర్ మరియు బ్యాటర్ భారత జట్టుకి దొరకలేదు. ఎంతోమంది ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చిన కూడా వినియోగించుకోలేకపోయారు.
విజయ్ దహియా, సబా కరీం, సమీర్ దీఘే, దీప్ దాస్ గుప్త, దినేష్ కార్తీక్, అజయ్ రాత్ర, పార్థివ్ పటేల్ లాంటి ఆటగాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చిన కూడా నిరాశపరిచారు, చివరికి రాహుల్ ద్రావిడ్ ని వన్డే క్రికెట్ లో వికెట్ కీపింగ్ చేయమని కోరడంతో తాను ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. కానీ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం వికెట్ కీపర్ సమస్య తొలగిపోలేదు. వికెట్ కీపింగ్ కోసం మళ్లి నయన్ మోంగియాని వెనక్కి పిలుద్దామా లేక కొత్త ఆటగాడి కోసం వేచి చూద్దామా అనే ఆలోచనలో పడ్డారు బి.సి.సి.ఐ పెద్దలు మరియు అప్పటి సారధి సౌరవ్ గంగూలీ.
అది 2004 డిసెంబర్, భారత జట్టు బాంగ్లాదేశ్ జట్టు తో వారి దేశంలో వన్డే క్రికెట్ ఆడటానికి వెళ్లడం జరిగింది మరియు మరో కొత్త ఆటగాడిని వికెట్ కీపర్ గా ఎంపిక చేసి జట్టు తో తీసుకెళ్లింది. ఆ కుర్రాడికి బ్యాటింగ్ అవకాశం వచ్చింది కానీ వెంటనే రన్ అవుట్ అవ్వడం జరిగింది అది కూడా సున్నా పరుగుల మీద.
ఆ కుర్రాడికి మరోసారి అవకాశం ఇవ్వాలని జట్టు సారధి సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి ఎంపిక చేశారు. ఈసారి భారత్ లోనే వన్డే క్రికెట్ ఆడటం జరిగింది. ఈ సిరీస్ లో రెండవ వన్డేలో ఆ కుర్రాడు శతకం చేయడం జరిగింది. ఆ తరువాత శ్రీలంక తో జరిగిన సిరీస్ లో అవకాశం లభించింది. ఆ మ్యాచ్ లో భారత్ లక్ష్యన్నీ ఛేదిస్తున్న సమయంలో ఆ కుర్రాడు మూడో స్థానం లో వచ్చి 183 పరుగులు కొట్టి భారత జట్టుకి విజయాన్ని అందించాడు. తరువాత ఆ కుర్రాడు మళ్ళీ ఎప్పుడు వెనుతిరిగి చూసుకోలేదు మరియు బి.సి.సి.ఐ పెద్దలు, సారధి సౌరవ్ గంగూలీ అలాగే భారత జట్టు కూడా కొత్త వికెట్ కీపర్ మరియు బ్యాటర్ కోసం వెనుతిరిగిచూడలేదు.
ఇంతకీ ఎవరా కుర్రాడు అతని పేరేంటి
రాంచి నగరం నుంచి వచ్చిన ఆ కుర్రాడి పేరు మహేంద్ర సింగ్ ధోని. చిన్నతనం నుంచి ఫుట్ బాల్ మీద మక్కువ ఎక్కువ. పాఠశాలలో ఫుట్ బాల్ ఆడుతూ ఉండేవారు మరియు గోల్ కీపింగ్ చేయడంలో నిపుణుడు. ఒక రోజు పాఠశాలలో క్రికెట్ జట్టులో ఉన్నవికెట్ కీపింగ్ చేసే ఆటగాడు రాలేదని ఆ క్రికెట్ కోచ్ ధోని తో మాట్లాడి తమ క్రికెట్ జట్టులో వికెట్ కీపింగ్ చేయమని కోరడం దానికి ధోని సరే అని ఒప్పుకోవడం జరిగింది. ఆ కోచ్ ఇచ్చిన సలహా మేరకు ధోని ఫుట్ బాల్ వదిలి క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు ముఖ్యంగా వికెట్ కీపింగ్ లో మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. చదువుతో పాటు క్రికెట్ ఆడుతూనే భారత రైల్వే లో ఉద్యోగం సంపాదించారు.
భారత జట్టు తరపున ఆడుతూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ధోని. తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో వికెట్ కీపింగ్ చేయడం, ఒక వైపు బ్యాటింగ్ చేస్తూ మరో వైపు వికెట్ కీపింగ్ చేస్తూ చిరుత పులి వేగంతో స్టంపింగ్ చేయడం, రనౌట్ చేయడం తనకు మాత్రమే సాధ్యం అనేలా వికెట్ కీపింగ్ చేస్తున్నారు ధోని. హెలికాప్టర్ షాట్ పేరు తో కొత్తరకమైన షాట్ ఆడి అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకునేలా చేశారు.
అప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ మరియు వన్డే క్రికెట్ ఉన్న క్రికెట్ చరిత్రలో కొత్తగా పొట్టి క్రికెట్ ఫార్మటు వచ్చి చేరింది అదే 20-20 క్రికెట్, ఇరు జట్లు 20-20 ఓవర్లు ఆడేలాగా ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఈ 20-20 ఫార్మటు లో ప్రపంచకప్ కూడా ఆడాలి అని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదన తో ముందుకు రావడం, దీనికి అన్ని క్రికెట్ బోర్డు లు ఆమోదం తెలపడం జరిగింది.
20-20 ప్రపంచకప్
అప్పుడే భారత జట్టు 2007 సంవత్సరంలో వెస్ట్ ఇండీస్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఓడిపోయి ఘోరపరాభవం చూసి మధ్యలోనే నిష్క్రమించింది. ఆ బాధలో ఉన్న భారత జట్టుకి ఇంకో ప్రపంచకప్ మొదలవుతుంది అనగానే కుర్రాళ్లతో కూడిన జట్టుని దక్షిణాఫ్రికా పంపించాలని అప్పటి సారధి రాహుల్ ద్రావిడ్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ మరియు మిగితా సీనియర్ ఆటగాళ్లు ఆమోదించారు అలా ధోని ని సారధిగా నియమించింది బి.సి.సి.ఐ.
ధోని సారధ్యం లోని భారత యువ జట్టు 2007లో జరిగిన 20-20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లడం అనూహ్యంగా కప్ గెలవడం జరిగింది. 2008 సంవత్సరంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు పెట్టడం చెన్నై జట్టుకి సారధి గా ధోని ని నియమించడం తరువాత చెన్నై జట్టు 5 సార్లు కప్ గెలవడం అందరికి తెలిసందే.
20-20 ప్రపంచకప్ గెలిచినా తరువాత ధోని 20-20 ఫార్మటు కి అలాగే వన్డే జట్టుకి పూర్తిగా సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత టెస్ట్ జట్టు నుంచి సారధిగా మరియు ఆటగాడిగా అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించగానే టెస్ట్ జట్టుకి కూడా సారధిగా బాధ్యతలు తీసుకున్నారు.
2011 ప్రపంచకప్
భారత జట్టు 1983 సంవత్సరంలో కపిల్ దేవ్ సారధ్యంలో వెస్ట్ ఇండీస్ ని ఓడించి ప్రపంచకప్ గెలిచింది ఆ తరువాత ఎప్పుడు కూడా భారత్ ప్రపంచకప్ గెలిచింది లేదు మరియు దెగ్గర గా వచ్చి ఓడిపోయేది, అలా ప్రపంచకప్ భారత్ జట్టుకి అందని ద్రాక్ష లా మిగిలిపోయింది. కానీ ధోని సారధ్యంలో 2011 సంవత్సరంలో భారత్ లో జరిగిన ప్రపంచకప్ లో భారత్ జట్టు శ్రీలంక జట్టు మీద ఫైనల్ మ్యాచ్ ఆడి ప్రపంచకప్ గెలిచింది. సిక్స్ కొట్టి ధోని విజయాన్ని అందించాడు. ఆ విజయాన్ని సచిన్ టెండూల్కర్ కి అంకితం ఇచ్చారు ధోని. ధోని సారధ్యంలో ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా వరసపెట్టి కప్స్ అలాగే ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలిచారు.
2014 సంవత్సరంలో ధోని టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. 2019 ప్రపంచకప్ తరువాత అటు వన్డేలోను మరియు 20-20 ఫార్మటు లోను రిటైర్మెంట్ ప్రకటించారు మహేంద్ర సింగ్ ధోని. ధోని రిటైర్మెంట్ తరువాత మళ్ళీ వికెట్ కీపర్ సమస్య వస్తుంది అనుకున్నారు కానీ రిద్ధిమాన్ సహా, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు ధోని లేని లోటు అభిమానులకి తీర్చారు. మధ్యలో కొన్ని మ్యాచ్ లలో రాబిన్ ఉత్తప్ప, కే.ఎల్.రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు కూడా చాల బాగా వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ చేశారు.
మహేంద్ర సింగ్ ధోని గురించి మరి కొన్ని విషయాలు మీకోసం:
- 2010 జులై 4 న ధోని సాక్షి సింగ్ రావత్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె జీవా.
- భారత క్రికెట్ కోసం ధోని చేసిన సేవలు గురించి భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవం దక్కింది.
- 2006 సంవత్సరంలో ఎం.టి.వి యూత్ ఐకాన్ అఫ్ ది ఇయర్ గా నిలిచారు
- 2008 సంవత్సరం లో మేజర్ ధ్యాంచంద్ పురస్కారం లభించింది
- 2009 సంవత్సరం లో పద్మశ్రీ మరియు 2018 సంవత్సరంలో పద్మభూషణ్ లభించింది.
- ఎం.ఎస్.ధోని అంటోల్డ్ స్టోరీ పేరుతొ హిందీ పరిశ్రమలో చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజపుట్ నటించారు.