List of Uday Kiran Movies

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి పేరు ఉదయ్ కిరణ్. ఒక సామాన్య యువకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుని ‘లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిత్రాల గురించి తెలుసుకుందాం.

సినీ ప్రస్థానం

తేజ దర్శకత్వంలో ఉషాకిరణ్ బ్యానర్ మీద రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో ఉదయకిరణ్ కధానాయకుడిగా పరిచయం అయ్యారు మరియు కథానాయికగా రీమాసేన్ కూడా ఈ చిత్రం సినిమాతో పరిచయం అవ్వడం విశేషం. ప్రేమకధ నేపధ్యం మీద తీసిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.

దర్శకులు తేజ, నటులు ఉదయకిరణ్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం నువ్వు నేను. ఈ చిత్రంతో అనిత తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టడం జరిగింది. ప్రేమకధ నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టడం విశేషం.

తనికెళ్ళ భరణి, రాళ్లపల్లి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం. ఎస్. నారాయణ, వైజాగ్ ప్రసాద్, సునీల్ కలిసి నటించిన ఈ చిత్రం ఎన్నో పురస్కారాలు అందుకోవడం విశేషం. వ్యాపారవేత్త కొడుకు, పాలమ్మేవాడి కూతురి మధ్య జరిగే ప్రేమ, ఆ ప్రేమని కాదనే పెద్దలు ఆ తరువాత జరిగే సంఘటనల మీద తీసిన చిత్రం నువ్వు నేను.

ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికి మంచి పేరు రావడం విశేషం. ఈ చిత్రంతో సునీల్ కి హాస్యనటుడిగా మంచి గుర్తింపు లభించింది. “నువ్వు యూత్ ఏంట్రా” అని స్నేహితులందరూ సునీల్ ని ఆటపట్టించే సన్నివేశం అలరిస్తుంది. నువ్వు నేను చిత్రంలో తెలంగాణ శకుంతల నటనకి తను చెప్పే సంభాషణలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం విశేషం.

నువ్వు నేను చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం ఇప్పటికి ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ఈ చిత్రంలో అన్ని పాటలు విజయవంతం అవ్వడం విశేషం. గాజువాకపిల్ల మెం గాజులోళ్ళం కాదా పాటని ఇప్పటికి వింటారు సంగీత అభిమానులు. ఆరోజుల్లో ఈ పాట సంగీత ప్రియుల్ని ఒక ఊపు ఊపింది అని చెప్పుకోవచ్చు. నువ్వు నేను చిత్రాన్ని హిందీ భాషలో ఏ దిల్ పేరుతొ తమిళ్ భాషలో మదురై వీరం పేరుతొ రీమేక్ చేయడం జరిగింది.

హ్యాట్రిక్ చిత్రం

వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయకిరణ్, రీమాసేన్ కలిసి నటించిన మనసంతా నువ్వే చిత్రం భారీ విజయం సాధించింది. చిత్రం సినిమా తరువాత ఉదయ్ కిరణ్, రీమాసేన్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం మనసంతా నువ్వే. తను రాయ్, తణికెళ్లభరణి, చంద్రమోహన్, సునీల్, శిజు, శివారెడ్డి నటించిన ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.

మనసంతా నువ్వే చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులని అలరించాయి. ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న కధానాయకుల జాబితాలో ఉదయకిరణ్ చేరడం జరిగింది. చిన్ననాటి స్నేహితులు విడిపోయి ఆ తరువాత పెరిగి పెద్దయ్యి వారి ప్రేమని ఎలా వ్యక్తపరిచారు మరియు వారి ప్రేమని కథానాయకి తండ్రి తణికెళ్లభరణి ఎలా అందుకున్నారు అనేది చిత్ర కధ.

వరుస చిత్రాలు

ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో ఉదయకిరణ్, గజాల, ప్రత్యుష కలిసి నటించిన కలుసుకోవాలని చిత్రం ఘన విజయం సాధించింది. కైకాల సత్యనారాయణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి ముఖ్యంగా “ఆకాశం తన రెక్కల కోమల కప్పుతూ ఉంటె” పాట జనాదరణ పొందింది.

వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయకిరణ్, అనిత కలిసి నటించిన శ్రీరామ్ చిత్రం పరవాలేదనిపించింది. ఆశిష్ విద్యార్ధి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఉదయకిరణ్ పోలీస్ అవ్వాలనే ఆశతో కష్టపడుతూ ఉంటారు ఉదయకిరణ్. ఈ చిత్రానికి సంగీతం ఆర్. పి. పట్నాయక్ అందించడం జరిగింది. నువ్వు నేను చిత్రం తరువాత ఉదయకిరణ్, అనిత కలయికలో వచ్చిన రెండవ చిత్రమిది.

ఎస్. వి. ఎన్ వరప్రసాద్ దర్శకత్వంలో ఉదయకిరణ్, రిచా కలిసి నటించిన హోలీ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం. ఎస్. రాజు నిర్మాణంలో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉదయకిరణ్, ఆర్తీ అగర్వాల్, జతిన్ కలిసి నటించిన చిత్రం నీ స్నేహం.

“కళాతపస్వి” కె. విశ్వనాధ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతంతో పాటు ఈ చిత్రంలో అన్ని పాటలు విజయవంతం అయ్యాయి. గాయని ఉష పాడిన చినుకు తడికి పాటకి నంది పురస్కారం అందుకోవడం విశేషం. ఈ చిత్రంలో ఉదయకిరణ్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఉదయకిరణ్, వెన్య కలిసి నటించిన మిస్టీరియస్ గర్ల్ చిత్రాన్ని తెలుగులో జోడి No. 1 పేరుతొ దర్శకులు ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేశారు.

చాలా కాలం విడుదలకు నోచుకోని జోడి No. 1 చిత్రం కధానాయకుడిగా ఉదయకిరణ్ కి గుర్తింపు లభించిన తరువాత జోడి No. 1 చిత్రం విడుదలవడం విశేషం. సగం హిందీ, సగం ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.

మరికొన్ని చిత్రాలు

రాజశేఖర్ దర్శకత్వంలో ఉదయకిరణ్, శ్రియశరన్ కలిసి నటించిన నీకునేను నాకునువ్వు చిత్రం అపజయాన్ని చూసింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో “రెబెల్ స్టార్” కృష్ణంరాజు, సుమన్ ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం అలరించగా ఎస్. పి. చరణ్ పాడిన “తెలుగు భాష తియ్యదనం, తెలుగు భాష గొప్పదనం” పాట ప్రేక్షకులను అలరించింది.

ఆర్పుతన్ దర్శకత్వంలో ఉదయకిరణ్, దివ్య ఖోస్లా కలిసి నటించిన లవ్ టుడే చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆర్. బి. చౌదరి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. తేజ దర్శకత్వంలో ఉదయకిరణ్, సద కలిసి నటించిన ఔనన్నా కాదన్నా చిత్రం పరవాలేదనిపించింది.

అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. దర్శకులు తేజ, ఉదయకిరణ్ కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఔనన్నా కాదన్నా. ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పండించిన హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

తమిళ చిత్రం

తమిళ దిగజ్జ దర్శకులు బాలచందర్ దర్శకత్వంలో ఉదయకిరణ్ నటించిన తమిళ చిత్రం పోయి. ఈ చిత్రంతో ఉదయకిరణ్ తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు మరియు కథానాయికగా విమలారామన్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. పోయి చిత్రానికి ప్రకాష్ రాజ్ నిర్మించగా విద్యాసాగర్ సంగీతం అందించారు. అబద్దం పేరుతొ ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించడం విశేషం.

ఇ. సత్తిబాబు దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ఉదయకిరణ్, నేహా జుల్కా కలిసి నటించిన చిత్రం వియ్యాలవారి కయ్యలు. శ్రీహరి, షాయాజీ షిండే, కవిత, కౌసల్య నటించిన ఈ చిత్రం పరవాలేదనిపించింది. రమణ గోగుల అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.రాజ్ కపూర్ దర్శకత్వంలో ఉదయకిరణ్, దియా, సత్యరాజ్ కలిసి నటించిన తమిళ చిత్రం వంబు సందై.

లక్ష్మి పుత్రుడు పేరుతొ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం జరిగింది మరియు ఈ చిత్రం నిరాశపరిచింది. మదన్ దర్శకత్వంలో పరుచూరి శివరాం ప్రసాద్ నిర్మాణంలో ఉదయకిరణ్, అదితి శర్మ కలిసి నటించిన గుండెఝల్లుమంది చిత్రం పరవాలేదనిపించింది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో “సూపర్ స్టార్” కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు.

రామ్ కలిదిండి దర్శకత్వంలో ఉదయకిరణ్, కృతి అహుజా కలిసి నటించిన ఏకలవ్యుడు చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. బాలి శ్రీరంగం దర్శకత్వంలో ఉదయకిరణ్, మీరా జాస్మిన్, రంభ కలిసి నటించిన తమిళ చిత్రం పెన్ సింగం. దివంగత తమిళ మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి రచించిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.

ఎస్. పి. మురుగేషన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు మరియు ఈ చిత్రం నిరాశపరిచింది.శుభ సెల్వం దర్శకత్వంలో ఉదయకిరణ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రదీప్ కోనేరు అందించిన సంగీతం అలరించింది.

ఈ చిత్రాన్ని ఓరు ముతం ఓరు యుద్ధం పేరుతొ తమిళ్ భాషలో కొంతమంది తమిళ నటులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. బాలాజీ ఎన్. సాయి దర్శకత్వంలో ఉదయకిరణ్, రేష్మ రాథోర్ కలిసి నటించిన జై శ్రీరామ్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించారు ఉదయకిరణ్ మరియు తన నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ చిత్రానికి ఢాకే సంగీతం అందించారు.

ఉదయకిరణ్ నటించిన ఈ చిత్రం ఆఖరి చిత్రంగా వెండితెర మీద విడుదలైంది. మోహన్ దర్శకత్వంలో చాంద్ గారి మూన్నా నిర్మాణంలో ఉదయకిరణ్, మదాలస శర్మ, గరిమ కలిసి నటించిన చిత్రం చెప్పిన కధ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇప్పటికి విడుదలవలేదు. ఈ చిత్రానికి మున్నా కాశి సంగీతం అందించారు.

వ్యక్తిగతం

ఉదయకిరణ్ 1980 సంవత్సరం 26 జూన్ న వి. కె. మూర్తి, నిర్మల దంపతులకు విజయవాడలో జన్మించారు. ఉదయకిరణ్ చదువంతా హైదరాబాద్ నగరంలో కొనసాగింది. ఉదయకిరణ్ కి ఒక సోదరుడు ఒక సోదరి ఉన్నారు. ప్రముఖ నటులు “మెగాస్టార్” చిరంజీవి కుమార్తె సుష్మితతో నిశ్చితార్ధం జరగడం ఆ తరువాత అది పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలో ఆగిపోవడం జరిగాయి.

2012 సంవత్సరంలో విషిత అనే యువతి ని వివాహం చేసుకున్నారు ఉదయకిరణ్. 2014 సంవత్సరంలో మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

ఉదయకిరణ్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. చిత్రం
  2. నువ్వు నేను
  3. మనసంతా నువ్వే
  4. కలుసుకోవాలని
  5. శ్రీరామ్
  6. హోలీ
  7. నీస్నేహం
  8. జోడి No 1
  9. నీకు నేను నాకు నువ్వు
  10. లవ్ టుడే
  11. అవునన్నా కాదన్నా
  12. పోయి(తమిళ్)
  13. వియ్యాలవారి కయ్యలు
  14. వంబు సాండల్(తమిళ్)
  15. గుండెఝల్లుమంది
  16. ఏకలవ్యుడు
  17. పెన్ సింగం (తమిళ్)
  18. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా
  19. జై శ్రీరామ్
  20. చిత్రం చెప్పిన కధ

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *