
తెలుగు సినిమా అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుల్లో తరుణ్ ఒకరు. “లవర్ బాయ్” గా పిలవబడే తరుణ్, తన నటనతో, మరియు హృదయానికి హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలనటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి తెలుగు, తమిళ్, మలయాళంలో నటించి ఆ తరువాత కధానాయకుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తున్న తరుణ్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
బాలనటుడిగా
మనసు మమత చిత్రంతో తరుణ్ సినీ పరిశ్రమలోకి బాలనటుడిగా పరిచయం అయ్యారు. 1990 సంవత్సరంలో మౌళి దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద రామోజీరావు నిర్మించిన ఈ చిత్రంలో నరేష్, సితార కలిసి నటించారు. ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం అలరించింది. ఈ చిత్రంలో నరేష తనయుడి పాత్రలో నటించారు తరుణ్ మరియు ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు.
కుర్ర రంగారావు దర్శకత్వంలో నరేష్, నిరోషా కలిసి నటించిన బుజ్జిగాడి బాబాయ్ చిత్రంలో నటించారు తరుణ్ మరియు ఈ చిత్రానికి రాజ్ – కోటి సంగీతం అందించారు. తమిళ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో రఘువరన్, రేవతి తనయుడిగా నటించారు తరుణ్. ఈ చిత్రంలో తరుణ్ చెల్లెళ్ళు గా శృతి, షామిలి నటించారు.
మానసిక ఎదుగుదల లేని పాత్రలో బేబీ షామిలి నటన అద్భుతం అని చెప్పాలి. ఈ చిత్రానికి తరుణ్, షామిలి, శృతి నటనకి జాతీయ ఉత్తమ పురస్కారం రావడం విశేషం. ఇళయరాజా అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని అంజలి పేరుతోనే తెలుగులో విడుదల చేయడం జరిగింది.
మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ముటి కలిసి నటించిన తమిళ చిత్రం తళపతి చిత్రం, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్, విజయశాంతి నటించిన సూర్య ఐ. పి. ఎస్ చిత్రంలో నటించారు తరుణ్. శివన్ దర్శకత్వంలో తరుణ్ బాలనటుడిగా నటించిన మలయాళ చిత్రం అభయం అనే బాలల చిత్రం నటించారు. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు లభించాయి.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, మోహిని కలిసి నటించిన సోసియో ఫాంటసీ చిత్రం ఆదిత్య 369. టైం మిషన్ నేపథ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో తరుణ్ ఒక పాత్రలో నటించారు. పి. సి. శ్రీరామ్ దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్య నటించిన మీరా చిత్రంలో నటించారు తరుణ్.
ఎన్. హరిబాబు దర్శకత్వంలో అట్లూరి రామారావు, రామోజీరావు కలిసి నిర్మించిన తేజ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఎంతో తెలివైన బాలుడిగా నటించడం విశేషం. మర బొమ్మలతో, సాంకేతిక వస్తువులతో ఆటలాడుతూ వాటితో అందర్నీ ఆశ్చర్య పరుస్తాడు. ఒక హత్య చుసిన తేజ ఆ నేరస్థుడ్ని తన తెలివితేటలతో ఎలా పట్టించాడు అనేది ఈ చిత్రంలో చూడొచ్చు.
ఈ చిత్రంలో తరుణ్ నటనకి ప్రశంసలతో పాటు నంది పురస్కారం లభించింది. సత్యన్ అంతికడ్ దర్శకత్వంలో తరుణ్ నటించిన మలయాళ సినిమా మై డియర్ ముథచన్ చిత్రంలో నటించారు. పెరళ దర్శకత్వంలో జగపతిబాబు, దివ్యవాణి, కిన్నెరా నటించిన పిల్లలు దిద్దిన కాపురం చిత్రంలో తరుణ్ ద్విపాత్రాభినయంలో నటించడమే కాకుండా తన పాతరకి నంది పురస్కారం అందుకోవడం విశేషం. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
రేపటి రౌడీ, మలయాళ చిత్రం జానీ, అక్కినేని నాగార్జున నటించిన వజ్రం మరియు శ్రీహరి నటించిన విజయరామరాజు చిత్రాల్లో బాలనటుడిగా నటించి అందర్నీ అలరించారు.
కధానాయకుడిగా అరంగ్రేటం
కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద రామోజీరావు నిర్మాణంలో తరుణ్ కధానాయకుడిగా పరిచయమైన చిత్రం నువ్వేకావాలి. రిచా కధానాయికగా నటించిన ఈ చిత్రంలో సాయికిరణ్, వర్ష, సునీల్, కోవై సరళ నటించారు. ఒక ప్రత్యేక పాటలో నటి లైలా మెరవగా ఒక సన్నివేశంలో నటి ప్రేమ నటించారు.
మలయాళం చిత్రానికి రీమేక్ గా 2000 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. కోటి అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఈ చిత్రంలో పాటల్ని అలరించాయి. ఈ చిత్రంలో “అనగనగ ఆకాశం ఉంది” పాట ఇప్పటికి పాడుతూ ఉంటారు. ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు అందించడం విశేషం.
రాజశేఖర్ దర్శకత్వంలో తరుణ్, పల్లవి నటించిన అంకుల్ చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రానికి హాస్య నటులు ఏ వి ఎస్ నిర్మాతగా వ్యవహరించారు. బాలశేఖరన్ దర్శకత్వంలో తరుణ్, శివాజీ, స్నేహ, ప్రీత కలిసి నటించిన ప్రియమైననీకు చిత్రం ఘన విజయం సాధించింది. ప్రేమకధ నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో ఆలీ, వేణుమాధవ్, బబ్లు హాస్యంతో అలరించగా శివ శంకర్ అందించిన సంగీతం అలరించింది.
ప్రియమైననీకు చిత్రాన్ని తమిళ్ భాషలో కాదల్ సుగమనతు పేరుతొ కొన్ని సన్నివేశాలతో పాటు కొంతమంది తమిళ నటులతో చిత్రీకరించడం జరిగింది. శ్రీరామ్ బాలాజీ దర్శకత్వంలో తరుణ్, రిచా కలిసి నటించిన చిరుజల్లు చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో ప్రముఖ నేపధ్య గాయకులూ ఎస్. పి. బాలసుబ్రమణ్యం ప్రతినాయకుడి పాత్రలో నటించారు మరియు వందేమాతరం సంగీతం అందించారు.
ఈ చిత్రంలో “రాధే రాధే” అంటూ రాధా కృష్ణుల మీద వచ్చే పాట ప్రేక్షకులను అలరిస్తుంది. తరుణ్, రిచా కలయికలో వచ్చిన రెండవ చిత్రం చిరుజల్లు. వై. కాశి విశ్వనాధ్ దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో వచ్చిన నువ్వులేక నేనులేను చిత్రంలో తరుణ్, ఆర్తి అగర్వాల్, లయ, కిరణ్ రాథోడ్ నటించారు.
నువ్వులేక నేనులేను చిత్రంలో సునీల్ పండించిన హాస్యంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ అందించిన సంగీతం ప్రజాదరణ పొందింది. శేఖర్ సూరి దర్శకత్వంలో తరుణ్, రీమాసేన్, గజాల కలిసి అంటించిన అదృష్టం చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
కె. షాజహాన్ దర్శకత్వంలో ఆర్. బి. చౌదరి నిర్మాణంలో తరుణ్, కునాల్, హంసవార్దన్, స్నేహ, ప్రీత, దము కలిసి నటించిన తమిళ చిత్రం పున్నగై దేశం. ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించగా ఈ చిత్రం పరవాలేదనిపించింది.
వరుస చిత్రాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2002 సంవత్సరంలో విడుదలైన నువ్వే నువ్వే చిత్రం ఘన విజయం సాధించింది. తరుణ్, శ్రియ శరన్ కలిసి నటించిన ఈ చిత్రం దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి చిత్రం అవ్వడం విశేషం. ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుధ, సునీల్, మధుమిత నటించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ఈ చిత్రంలో అన్ని పాటలకి ప్రజాదరణ లభించడం విశేషం.
అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు గొప్పింటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ చిత్ర కధ. ప్రేమ కధ నేపథ్యం మాత్రమే కాకుండా తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ, భావోద్వేగం మీద తీసిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రియ శరన్ తండ్రి కూతుళ్లుగా నటించారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రతి సంభాషణ మన గుండెలకు హత్తుకుంటుంది.
ప్రేమించిన వ్యక్తిని కాదని తనకి నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడే తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, తన ప్రేమని ఎందుకు అర్ధం చేస్కొట్లేదు అని వివరణ ఇచ్చే పాత్రలో తరుణ్ అద్భుతంగా నటించారు. నువ్వే నువ్వే చిత్రానికి కొన్ని పురస్కారాలు రావడం విశేషం మరియు ఈ చిత్రాన్ని మరాఠీ భాషలో చిత్రీకరించడం జరిగింది.
కొండా దర్శకత్వంలో శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ మీద కె. ఎల్. నారాయణ, ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం పరవాలేదనిపించింది. తరుణ్, శ్రీదేవి, అనిత, రాజీవ్ కనకాల నటించిన ఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సంగీత అభిమానులను అలరించాయి.
బి. వి. రమణ దర్శకత్వంలో తరుణ్, శ్రియ శరన్, శివబాలాజీ కలిసి నటించిన ఎలా చెప్పను చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో శివబాలాజీ మృతి చెందడం అది తెలిసి వాళ్ళ నాన్న అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. ఆ ప్రమాదానికి తరుణ్ కారణమవడం తనకి తప్ప మిగితా ఎవరికీ తెలియకపోవడంతో వాళ్ళ వ్యాపారం లో ఉద్యోగం సంపాదించి నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకొస్తారు.
సునీల్, బ్రహ్మానందం, కోవైసరళ పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా పాటలన్ని ప్రేక్షకులను అలరించాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ. ఎం. రత్నం నిర్మాణంలో తరుణ్, త్రిష, శ్రియ శరన్ కలిసి నటించిన చిత్రం నీమనసు నాకుతెలుసు. తెలుగుతో పాటు తమిళ్ భాషలో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది.
ఎనక్కు 20 ఉనక్కు 18 పేరుతొ తమిళ్ బభాషలో విడుదలయింది ఈ చిత్రం. ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం పాటలన్ని అదరణపొందాయి. రెండు భాషల్లో ఈ చిత్రం పరవాలేదనిపించింది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తరుణ్, నౌహీద్ సైరుసి నటించిన సఖియా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రముఖ నటి లక్ష్మి ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
మరికొన్ని చిత్రాలు
రమేష్ వర్మ దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మాణంలో తరుణ్, రాజా, సలోని కలిసి నటించిన చిత్రం ఒక ఊరిలో ప్రేక్షకులను నిరాశపరిచింది. చిన్ననాటి స్నేహితులు తరుణ్, సలోని ప్రేమను పెద్దలు తిరస్కరించగా మరో స్నేహితుడు వాళ్ళని కలపాలని చూస్తాడు, చివరికి వాళ్ళు ఎలా కలిసారా లేదా అనేది చిత్రం. ఈ చిత్రంలో ప్రముఖ నటి నిరోషా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరించింది.
కె. షాజహాన్ దర్శకత్వంలో ఆర్. బి. చౌదరి నిర్మాణంలో తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్, ప్రియమణి, అంకిత కలిసి నటించిన నవవసంతం చిత్రం విజయం సాధించింది. తమిళ చిత్రం పున్నగై దేశం చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో చిత్రీకరించారు. ఎస్. ఏ. రాజ్ కుమార్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించగా పాటలు కూడా జనాదరణ పొందాయి.
ఈ చిత్రంలో విజయం కోసం ఎదురుచూస్తూ కష్టపడుతున్న తన ముగ్గురు స్నేహితుల కోసం తను కష్టపడుతూ వాళ్ళని పైకి ఎలా తీసుకొచ్చాడు అనేది చిత్ర నేపధ్యం. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, ఇలియానా కలిసి నటించిన భలేదొంగలు చిత్రం పరవాలేదనిపించింది. ఇంట్లో నుంచి పారిపోయి నగరానికి చేరుకున్న తరుణ్, ఇలియానా బతుకుతెరువు కోసం రోమియో, జూలియట్ అని పేర్లు మార్చుకుని దొంగతనాలు చేస్తూ ఉంటారు మరియు వాళ్ళని పట్టుకోవడానికి డీసీపీ పాత్ర జగపతిబాబు ప్రయత్నిస్తూ ఉంటారు.
చివరికి ఎం జరుగుతుంది అనేది ఈ చిత్ర కధ. ఈ చిత్రానికి కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించారు మరియు ఒక పాటలో చార్మీ తళ్లుకున్న మెరుస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తరుణ్, జెనీలియా కలిసి నటించిన శశిరేఖా పరిణయం ప్రేక్షకులను నిరాశపరిచింది. మణిశర్మ, విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
కన్మణి దర్శకత్వంలో తరుణ్, విమలా రామన్ కలిసి నటించిన చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చిత్రం నిరాశపరిచింది. భారతి గణేష్ దర్శకత్వంలో తరుణ్, యామీగౌతమ్ కలిసి నటించిన యుద్ధం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు మరియు ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్రలో నటించారు. అశోక్ తేజ దర్శకత్వంలో శ్రీకాంత్, తరుణ్ కలిసి నటించిన వేట, రమేష్ గోపి దర్శకత్వంలో తరుణ్, ఓవియా కలిసి నటించిన ఇది నా లవ్ స్టోరీ నిరాశపరిచాయి.
వ్యక్తిగతం
జనవరి 8, 1981 సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించారు తరుణ్. తరుణ్ తండ్రి ప్రముఖ ఒడియా దర్శకుడు, నిర్మాత, నటుడు సుశాంత్ చక్రపాణి మరియు తల్లి ప్రముఖ నటి రోజారమణి. బాలనటిగా, సహాయనటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రోజారమణి గారు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తరుణ్ చదువంతా హైదరాబాద్ లోనే కొనసాగింది. తరుణ్ కి ఒక సద్దరి ఉన్నారు.
ఈటీవీ తెలుగులో ప్రసారమైన వండర్ బాయ్ కార్యక్రమంలో తరుణ్ నటించారు. క్రికెట్ అంటే ఇష్టపడే తరుణ్ ప్రతి ఏడాది జరిగే సీసీఎల్ టోర్నమెంట్ లో చురుగ్గా పాల్గొంటారు అంతేకాకుండా టాలీవుడ్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లలో ఆడారు. సినిమా తారలు క్రికెట్ క్రీడకారులు ఆడిన మ్యాచ్లో “మాస్టర్ బ్లాస్టర్” సచిన్ టెండూల్కర్ తో కలిసి ఆడారు తరుణ్.
తరుణ్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
బాలనటుడిగా:
- మనసు మమత
- బుజ్జిగాడి బాబాయ్
- అంజలి (తమిళ్)
- తళపతి (తమిళ్)
- సూర్య ఐ.పి.ఎస్
- అభయం (మలయాళం)
- ఆదిత్య 369
- మీరా (తమిళ్)
- తేజ
- మై డియర్ ముథాచన్ (మలయాళం)
- పిల్లలు దిద్దిన కాపురం
- రేపటి రౌడీ
- జానీ (మలయాళం)
- వజ్రం
- విజయరామరాజు
కధానాయకుడిగా:
- నువ్వేకావాలి
- అంకుల్
- ప్రియమైన నీకు
- చిరుజల్లు
- నువ్వులేక నేనులేను
- పున్నగై దేశం (తమిళ్)
- అదృష్టం
- నువ్వే నువ్వే
- నిన్నే ఇష్టపడ్డాను
- ఎలా చెప్పను
- ఎనక్కు 20 ఉనక్కు 18 (తమిళ్)
- నీ మనసు నాకు తెలుసు
- సఖియా
- సోగ్గాడు
- ఒక ఊరిలో
- నవ వసంతం
- భలే దొంగలు
- శశిరేఖ పరిణయం
- చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
- యుద్ధం
- వేట
- ఇది నా లవ్ స్టోరీ