List of Pawan Kalyan Movies

Pawan Kalyan
Pawan Kalyan

“మెగాస్టార్” చిరంజీవి సోదరుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం.

మొదటి సినిమా

ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు పవన్ కళ్యాణ్. అక్కినేని నాగేశ్వర్రావు మనవరాలు సుప్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసే కొన్ని “మార్షల్ ఆర్ట్స్” ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశంలో “ఇతడే మన కళ్యాణ్” అని తేర మీద వేయడం అప్పట్లో అదొక సంచలనం. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం తరువాత వచ్చిన చిత్రం గోకులంలో సీత. రాశి కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో కధానాయకుడిగా హరీష్ నటించారు. గొప్పింటి కుర్రాడిగా చెడు సావాసాలకు అలవాటు పడ్డ కుర్రాడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకులు ముత్యాల సుబ్బయ్య మరియు ఈ చిత్రం పరవాలేదనిపించింది.

భీమినేని శ్రీవాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, దేవయాని కలిసి నటించిన సుస్వాగతం చిత్రం విజయాన్ని అందించింది. ప్రేమకథ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గణేష్ పాత్రలో నటించారు. ఐదేళ్ల నుంచి ప్రేమ కోసం తిరుగుతూ చివరికి ఆ ప్రేమ కోసం తండ్రి చనిపోయిన విషయం తెలీకుండా ఆఖరికి తండ్రి అంత్యక్రియలు కూడా చేయని ఒక కొడుకు పాత్రలో మనం చూడొచ్చు.

సుస్వాగతం చిత్రంలో “విలక్షణ” నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మరియు కథానాయకి దేవయాని తండ్రిగా, ఎప్పుడు కూతురిని అనుమానించే పోలీస్ పాత్రలో నటించారు. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా రఘువరన్ నటించారు. ఈ చిత్రానికి ఎస్. ఏ. రాజ్ కుమార్ సంగీతం అందించగా పాటలన్ని జనాదరణ పొందాయి.

వరుస విజయాలు

1998 సంవత్సరంలో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి కలిసి నటించిన తొలిప్రేమ చిత్రం భారీ విజయం సాధించింది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు. వైజయంతి సినిమా మీద అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో పురస్కారాలని అందుకుంది.

పి. ఏ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రీతి ఝిన్గానియా, అదితి గోవిత్రికర్ కలిసి నటించిన తమ్ముడు చితం భారీ విజయం సాధించింది. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు, తండ్రితో మందలింపబడుతూ ఉండే ఒక కుర్రాడు అతన్ని వెనకేసుకొచ్చే అన్నయ్య, స్నేహితులు మరియు ప్రియురాలు.

కిక్ బాక్సింగ్ చేసే అన్నయ్యకి జరిగిన ప్రమాదం వల్ల తన అన్నయ్య బదులుగా కిక్ బాక్సింగ్ ఫైనల్స్ ఆడి, చివరికి తన అన్నయ్య ఆశయం ఎలా నెరవేర్చాడు అనే కధ మీద తీసిన చిత్రం తమ్ముడు. ఈ చిత్రానికి రమణ గోగుల అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో “మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్” పాట ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తుంది.

2000 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయి, అమీషా పటేల్ కథానాయికలుగా ప్రకాష రాజ్ ప్రత్యేక పాత్రలో వచ్చిన చిత్రం బద్రి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ పోటా పోటీగా నటించారు. “నువ్వు నందా ఐతే నేను బద్రి బద్రీనాథ్” అంటూ చెప్పే సంభాషణలు ప్రేక్షకులను ఈలలు వేసేలా చేశాయి.

టి. త్రివిక్రమరావు నిర్మాణంలో వచ్చిన బద్రి చిత్రం ఘన విజయం సాధించింది. రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులని అలరించింది. ఇప్పటికి ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులని అలరిస్తుంది. అలీ, పవన్ కళ్యాణ్ మరియు బ్రహ్మానందం, మల్లికార్జునరావు మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయి. బద్రి చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అవ్వడం విశేషం.

2001 సంవత్సరంలో తమిళ దర్శకులు ఎస్. జె. సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన ఖుషి చిత్రం భారీ విజయం సాధించింది. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ మరో ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడం విశేషం.

ఖుషి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికి అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి అంతేకాకుండా ఈ చిత్రంలో కొన్ని పాటలకి నృత్య దర్శకుడిగా అలాగే కొన్ని ఫైట్ సన్నివేశాలకి ఫైట్ మాస్టర్ గా కూడా పని చేశారు పవన్ కళ్యాణ్.

వరుస పరాజయాలు

2002 సంవత్సరంలో ఒక్క చిత్రం కూడా విడుదల చేయని పవన్ కళ్యాణ్ 2003 సంవత్సరంలో జానీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహించడం విశేషం. రెండవ సారి ఈ చిత్రంలో రేణు దేశాయితో కలిసి నటించారు పవన్ కళ్యాణ్. “ఈ రేయి తీయనిది” అనే పాట చిట్టి చెల్లెలు అనే పాత ఎన్. టి. ఆర్. నటించిన చిత్రంలోని పాట ఈ చిత్రంలో జత పరచడం విశేషం. రమణ గోగుల అందించిన సంగీతం పరవాలేదనిపించగా, ఈ చిత్రం అభిమానులని నిరాశపరిచింది.

వీర శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ కలిసి నటించిన గుడుంబా శంకర్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించగా నృత్య దర్శకుడిగా మూడు పాటలు మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలని కూడా చిత్రీకరించారు. గుడుంబా శంకర్ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మెగా బ్రదర్ నాగబాబు నిర్మాణంలో రూపొందించారు మరియు ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి ముఖ్య పాత్రలో నటించగా మణిశర్మ సంగీతం అలరించింది.

ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహా ఒబెరాయ్ కలిసి నటించిన బాలు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి జయసుధ ప్రత్యేక పాత్రలో నటించి అలరించారు. ఒక గ్యాంగ్స్టర్ దేగ్గెర ఘని పేరుతొ పని చేస్తూ ఆ తరువాత బాలు పేరుతొ మంచి వ్యక్తిగా మారిపోతారు పవన్ కళ్యాణ్. వైజయంతి మూవీస్, కెఏడి మూవీస్ బ్యానర్ మీద సి. అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

తమిళ దర్శకులు ధరణి దర్శకత్వంలో ఏ. ఎం. రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రాజా, ముకేశ్ రిషి కలిసి నటించిన బంగారం చిత్రం నిరాశపరిచింది. విడిసాగర్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది మరియు ఈ చిత్రంలో నటి త్రిష అతిధి పాత్రలో మెరిశారు.

మరికొన్ని చిత్రాలు

భిమ్మీనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్కళ్యాణ్, ఆసిన్, సంధ్య, శివబాలాజీ కలిసి నటించిన అన్నవరం చిత్రం పరవాలేదనిపించింది. అన్న చెల్లి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించగా దినా ఈ చిత్రానికి నేపధ్య సంగీతం అందించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, కమిలిని ముఖర్జీ కలిసి నటించిన జల్సా చిత్రం విజయం సాధించింది. 2007 సంవత్సరారంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. కళాశాల విద్యార్థిగా అలాగే నక్సలైట్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపిస్తారు.

బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలాగే ప్రకాష్ రాజ్ నటన ప్రేక్షకులను నవ్వులు తెప్పిస్తాయి. సరదా సరదాగా సాగిపోయే జల్సా చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని పాటలన్ని ప్రేక్షకులని అలరిస్తాయి.

ఎస్. జె. సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నికిషా పటేల్, శరణ్య, నాజర్, చారంరాజ్, మనోజ్ బాజ్పాయి, అలీ కలిసి నటించిన పులి చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఐపీఎస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొమరం పులి పేరుతొ విడుదలవలసిన చిత్రం కొన్ని సంఘటనల కారణంగా పులి పేరు పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు.

జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కృతి కర్బందా, త్రిష కలిసి నటించిన తీన్మార్ చిత్రం నిరాశపరిచింది. హిందీ భాషలో వచ్చిన లవ్ ఆజ్ కల్ చిత్రానికి తీన్మార్ పేరుతొ తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ప్రేమ కధ నేపధ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అకట్టుకోలేదు. మణిశర్మ అందించిన సంగీతం అలరించగా శ్రీ రామచంద్ర పాడిన “గెలుపు తలుపు తీసే” పాట అలరించింది.

విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ మీద నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ, నగేస్జ్ ముంత, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించిన పంజా చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సారః జేన్ దియాస్, అంజలి లావానియా, అడవి శేష్ కలిసి నటించారు మరియు ఈ చిత్రంలో బాలీవుడ్ కధానాయకుడు జాకీ షరాఫ్ ప్రతినాయకుడి పాత్రలో నటించడం విశేషం. మాఫియా నేపధ్య మీద తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

భారీ విజయాలు

హిందీ భాషల్లో వచ్చిన దబాంగ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు దర్శకులు హరీష్ శంకర్. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బండ్ల గణేష్ గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్, శృతి హస్సన్ కలిసి నటించిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఈ చిత్రంలో ఒక కొత్త తరహా నటన పవన్ కళ్యాణ్ నుంచి చూడవచ్చు.

గబ్బర్ సింగ్ చిత్రం వసూళ్లతో పాటు కొన్ని పురస్కారాలు కూడా తీసుకొచ్చింది. ఈ చిత్రంలో వచ్చే అంత్యాక్షరి సన్నివేశం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులని ఇప్పటికి ఉర్రుతలూగిస్తుంది. ఈ చిత్రంలో “నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది” లాంటి సంభాషణలు ప్రేక్షకులను అలరించాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో సుహాసిని నటించారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, తమన్నా, గాబ్రియేల్ బెంటంటే కలిసి నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం పరవాలేదనిపించింది. పూరి జగన్నాద్, పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు. రాజకీయం, జర్నలిజం నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసం అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత కలిసి నటించిన అత్తారింటికి దారేది చిత్రం భారీ విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. జల్సా చిత్రం తరువాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. తన తాతయ్యకు దూరంగా ఉన్న మేనత్తను కలపడానికి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే పాత్రలో నటించారు పవన్ కళ్యాణ్.

అత్త పాత్రలో నటి నదియా, తాతయ్య పాత్రలో ప్రముఖ హిందీ నటులు బోమన్ ఇరానీ, తండ్రి పాత్రలో ముకేశ్ ఋషి అలాగే మావయ్య పాత్రలో రావు రమేష్ నటించారు. విడుదలకి ముందే సగం చిత్రం పైరసీ సిడిలో విడుదలైన కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసి బ్రహ్మరధం పట్టడం జరిగింది. ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ చిత్రానికి కొన్ని పురస్కారాలు లభించడం విశేషం.

ఈ చిత్రంలో వచ్చే కొన్ని సంభాషణలు అభిమానులకి కనువిందు చేయడం విశేషం. “నేను సింహం లాంటోడిని అది గెడ్డం గీసుకోదు” అనే డైలాగ్ ప్రేక్షకులను ఈలలు వేసేలా చేస్తుంది. 2013 సంవత్సరంలో బి. వి. ఎస్. ఎన్. ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు మరియు ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందడం విశేషం. అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళ్, కన్నడ మరియు బెంగాలీ భాషలో రూపొందించారు.

వరుస చిత్రాలు

కిశోరె కుమార్ పార్దాసాని దర్శకత్వంలో “విక్టరీ” వెంకటేష్, పవన్ కళ్యాణ్ శ్రియ శరన్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో వెంకటేష్ గోపాల్ రావు పాత్రలో నాస్తికుడిగా, పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా దేవుడి పాత్రలో నటించారు. తనకు జరిగిన ఒక సమస్య వల్ల దేవుడి మీద కోర్టులో కేసు వేస్తారు వెంకటేష్, అది తెలిసి అన్ని మతాల గురువులు పెద్దలు వెంకటేష్ మీద దాడికి ప్రయత్నించగా పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడతారు.

హిందీ భాషలో వచ్చిన ఓహ్ మై గాడ్ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెలుగులో రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో కొన్ని సంభాషణలు ప్రేక్షకులను అలరిస్తాయి. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మాత గురువు పెద్దగా నటించడం విశేషం.

కె. ఎస్. రవీంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కాజల్ కలిసి నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. గబ్బర్ సింగ్ చిత్రానికి రెండవ భాగంగా వచ్చిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కద అందించగా ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద పవన్ కళ్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్లా కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

కిశోరె కుమార్ పార్దాసాని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శృతి హస్సన్ కలిసి నటించిన కాటమరాయుడు చిత్రం నిరాశపరిచింది. తమిళ చిత్రం వీరం రీమేక్ చిత్రంగా తెలుగులో రూపొందించడం జరిగింది. అన్నదమ్ముల కధ నేపధ్యం మీద వచ్చిన ఈ చిత్రంలో అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ తముళ్ల పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ కలిసి నటించిన అగ్న్యాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించారు మరియు ప్రముఖ నటి ఖుష్బూ తల్లి పాత్రలో నటించి మెప్పించారు. తమిళ నటులు ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.

అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం ప్రేక్షకులని అలరించింది మరియు ఈ చిత్రంలో “కొడకా కోటేశ్వరరావు” అనే పాట పాడారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రంలో “విక్టరీ” వెంకటేష్ అతిధి పాత్రలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన మూడవ చిత్రం అగ్న్యాతవాసి.

మరికొన్ని చిత్రాలు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 2021 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, శృతి హస్సన్, అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ కలిసి నటించిన వకీల్ సాబ్ చిత్రం విజయం సాధించింది. హిందీ భాషలో వచ్చిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతొ రూపొందించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అడ్వకేట్ పాత్రలో నటించి అభిమానులని అలరించారు.

ముగ్గురు మహిళలను కొంతమంది అబ్బాయిలు వేధించడమే కాకుండా తిరిగి ఆ నేరం ఆ మహిళలపైనే వేస్తారు ఆ తరువాత ఆ మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళ కేసుని పవన్ కళ్యాణ్ ఎలా వాదిస్తారు అనేది ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ అడ్వకేట్ పాత్రలో పవన్ కళ్యాణ్ కి పోటీగా వాదిస్తారు.

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, బ్యవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ల మీద దిల్ రాజు, శిరీష్ మరియు బోణి కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది.

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 2022 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్, రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్, సముద్రఖని కలిసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం పరవాలేదనిపించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎస్. ఐ. పాత్రలో నటించగా రానా దగ్గుబాటి హవాల్దార్ పాత్రలో నటించారు. అయ్యప్పన్ కోషియం అనే మలయాళ భాషలో వచ్చిన చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ పేరుతొ రూపొందించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు పాటలు కూడా విజయం సాధించాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

2023 సంవత్సరంలో సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) కలిసి నటించిన బ్రో చిత్రం పరవాలేదనిపించింది. ప్రతిసారి టైం లేదు అని కుటుంబ సభ్యులతో మరియు పని చేసే చోట చెప్పే సాయి దుర్గ తేజ్ పాత్ర ఒక ప్రమాదంలో మరణించగా తనని మళ్ళీ తన వాళ దెగ్గర కొన్ని రోజులు వరకు పంపించే టైం పాత్రలో నటించారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లి పాత్రలో నటించారు.

తమిళ్ భాషలో వచ్చిన వినోదయ సీతాం అనే చిత్రానికి తెలుగులో బ్రో పేరుతొ రీమేక్ చేశారు దర్శకులు సముద్రఖని మరియు తమిళ చిత్రానికి కూడా సముద్రఖని దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రానికి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్ల మీద టి. జి. విశ్వప్రసాద్,వివేక్ కూచిబొట్ల నిర్మించారు. బ్రో చిత్రానికి ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించింది మరియు పాటలు కూడా విజయం సాధించాయి.

రాజకీయ ప్రస్థానం

2009 సంవత్సరంలో తన సోదరుడు చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చురుక్కా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో జనసేన పేరుతొ కొత్త రాజకీయ పార్టీ సాహపించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి ఎం. ఎల్. ఏ అవ్వడం విశేషం అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరియు ఇతర శాఖా మంత్రిగా చురుగ్గా పనిచేస్తున్నారు.

వ్యక్తిగతం

సెప్టెంబర్ 2, 1971 సంవత్సరం బాపట్ల లో జన్మించారు పవన్ కళ్యాణ్. తండ్రి వెంకట్ రావు మరియు తల్లి అంజనా దేవి. ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క మరియు ఒక చెల్లి. పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవికి నాల్గవ సంతానం. నెల్లూరు మరియు చెన్నై లో తన చదువుని కొనసాగించారు. వివాహానికి వస్తే మొదటి వివాహం కొంతకాలమే ఉన్న రెండవ వివాహం ప్రేమ వివాహం అవ్వడం విశేషం.

బద్రి చిత్రంలో నటించిన రేణు దేశాయ్ తో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వీరికి ఒక బాబు, ఒక పాపా. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రెండవ భార్యకు దూరమయ్యి మూడవ వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మరియు ఇది కూడా ప్రేమ వివాహమే. విదేశీ నటి అన్న లెజినోవా అనే మహిళను చేసుకున్నారు పవన్ కళ్యాణ్ మరియు వీరికి ఒక పాపా, ఒక బాబు.

పవన్ కళ్యాణ్ గురించి మరికొన్ని విశేషాలు

పవన్ కళ్యాణ్ అభిమానులు తనని “పవర్ స్టార్” అనే బిరుదుతో పిలుచుకుంటారు. కరాటే లో “బ్లాక్ బెల్ట్” సాధించారు అలాగే కొన్ని మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం పొందారు పవన్ కళ్యాణ్. ఎన్నో రకాల సేవ కార్యక్రమాలు మరియు ఎంతోమందికి గుప్తదానం చేయడం విశేషం. “మెగాస్టార్” చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో కొన్ని ఫైట్ సన్నివేశాలకి దర్శకత్వం వహించారు పవన్ కళ్యాణ్.

“మెగాస్టార్” చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS చిత్రంలో ప్రత్యేక పాటలో కనపడి అభిమానులని అలరించారు మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో సోదరుడు చిరంజీవితో కలిసి ఒక సన్నివేశంలో అలరించారు పవన్ కళ్యాణ్. “హార్డ్వర్డ్ విశ్వ విద్యాలయానికి” అతిధిగా పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి పుస్తకాలూ చదవడం అంటే చాల ఇష్టం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాత్ర దానం చేశారు పవన్ కళ్యాణ్ మరియు తాను నటించిన చిత్రాల్లో చిన్న చిన్న పాటలు కూడా పాడారు పవన్ కళ్యాణ్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్, మేఘ ఆకాష్ నటించిన చల్ మోహన రంగ చిత్రాన్ని పవన్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ల మీద త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్. సుధాకర్ రెడ్డిలతో కలిసి నిర్మించారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం
  1. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి
  2. గోకులంలో సీత
  3. సుస్వాగతం
  4. తొలిప్రేమ
  5. తమ్ముడు
  6. బద్రి
  7. ఖుషి
  8. జానీ
  9. గుడుంబా శంకర్
  10. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ (ఒక పాటలో అతిధి పాత్ర)
  11. బాలు
  12. అన్నవరం
  13. బంగారం
  14. శంకర్ దాదా జిందాబాద్ (అతిధి పాత్ర)
  15. జల్సా
  16. పులి
  17. తీన్మార్
  18. పంజా
  19. గబ్బర్ సింగ్
  20. కెమెరామెన్ గంగతో రాంబాబు
  21. అత్తారింటికి దారేది
  22. గోపాల గోపాల
  23. సర్దార్ గబ్బర్ సింగ్
  24. కాటమరాయుడు
  25.  అగ్న్యాతవాసి
  26. వకీల్ సాబ్
  27. భీమ్లా నాయక్
  28. బ్రో

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *