Journey of IPL and Other Leagues

భారత దేశంలో క్రికెట్ మీద ఉన్న అభిమానం అందరికి తెలిసిందే, అలాంటి క్రికెట్ లో ఒక కొత్తరకమైన ఫార్మటు మరియు లీగ్ వస్తున్నాయంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అల్లాంటి అభిమానులని ఉత్సాహపరుస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతొ ఒక కొత్త ఫ్రాంచైజ్ టోర్నమెంట్ మొదలుపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతూ అలాగే మిగితా క్రికెట్ లీగ్స్ తో పాటు ఇతర క్రీడలకు కూడా స్ఫూర్తినిచ్చేలా అడుగు వేశారు బి.సి.సి.ఐ పెద్దలు. ఆ క్రికెట్ లీగ్స్ ఏంటి అలాగే మిగితా క్రీడలు ఎలా స్ఫూర్తిపొందాయో ఇప్పుడు తెల్సుకుందాం.

జీ మీడియా సంస్థ వారు భారత క్రికెట్ బోర్డు కి వ్యతిరేకంగా ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించి ఆ తరువాత నిషేదానికి గురైంది. మనమే సొంతంగా ఒక లీగ్ ఎందుకు ప్రారంభించవద్దు అని బి.సి.సి.ఐ. ఆలోచనలో పడింది. అప్పుడే లలిత్ మోదీ అనే వ్యాపారవేత్త తన ఆలోచనలతో బి.సి.సి.ఐ పెద్దలని కలిసి తన ఆలోచనలని పంచుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతొ బీజం వేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటి

భారత దేశంలో ఉన్న ఎనిమిది నగరాలని జట్లు గా మార్చి వేలంపాట వేశారు. భారత దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు ఆ జట్లని వేలంపాటలో కొనుగోలుచేయడం జరిగింది. ఆ నగరాలూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా, పంజాబ్, రాజస్థాన్. ఈ నగరాలని వేలంలో కొని వాటికి ఆకర్షించే పేర్లు పెట్టారు యజమానులు. ఆటగాళ్ళని కూడా వేలంపాటలో కొనుగోలుచేశారు.

ప్రతీ నగరంలో ఉన్న స్థానిక అంతర్జాతీయ ఆటగాడిని సారధిగా నియమించారు అంటే ముంబై నగరానికి సచిన్ టెండూల్కర్, ఢిల్లీ నగరానికి, వీరేందర్ సెహ్వాగ్, కోల్కత్త నగరానికి సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ నగరానికి వి.వి.ఎస్ లక్ష్మణ్, బెంగళూరు నగరానికి రాహుల్ ద్రావిడ్ మరియు పంజాబ్ నగరానికి యువరాజ్ సింగ్. చెన్నై మరియు రాజస్థాన్ నగరాలకు మాత్రం స్థానికంగా కాకుండా వేలంలో కొన్న ఆటగాళ్ళని సారధ్య భాద్యతలు అప్పగించారు. చెన్నై జట్టుకి ధోని, రాజస్థాన్ జట్టుకి ఆస్ట్రేలియా స్పిన్ దిగజ్జ బౌలర్ షేన్ వార్న్.

ఫార్మటు

2008 సంవత్సరంలో మొత్తం ఎనిమిది జట్లతో సీజన్ ప్రారంభమైంది. ఒక జట్టు మిగితా జట్టుతో రెండుసార్లు ఆడేలా ప్రణాళిక రూపొందించారు అది కూడా ఒకటి వారి నగరంలో ఇంకోటి వీరి నగరంలో. ఉదాహరణకి హైదరాబాద్ జట్టు చెన్నైతో రెండుసార్లు తలపడితే ఒకసారి చెన్నైలో ఆడాలి రెండోసారి హైదరాబాద్ లో ఆడాలి ఈ విధంగా ఫార్మటు రూపుదిద్దుకుంది. ఈ లీగ్ మ్యాచ్ల తరువాత సెమీఫైనల్స్ ఆ తరువాత ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో రాజస్థాన్ చెన్నై జట్టు మీద గెలిచింది. ఇలా మొదటి సీజన్ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ముగిసింది. ఒక సీజన్ గడిచాక క్రికెట్ లోకం మొత్తం భారత్ వైపు ఆశ్చర్యంతో చూడటం మొదలు పెట్టింది.

వేదిక మార్పు, విమర్శలు

2009 సంవత్సరంలో భారత్ లో ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికా దేశంలో రెండవ సీజన్ నిర్వహించారు. అలా నిర్వహించినందుకు చాలా విమర్శలకు గురయ్యారు బి.సి.సి.ఐ పెద్దలు. భారత్ లో ఆడాల్సిన లీగ్ బయట దేశంలో ఎలా ఆడతారు అని విమర్శలు వచ్చాయి. ఈ సీజన్ కి విజేత హైదరాబాద్ జట్టు. 2010 సంవత్సరంలో మళ్లీ భారత్ లో జరగడం చెన్నై జట్టు విజయం సాధించడం జరిగింది.

కొత్త జట్లు, రద్దైన జట్లు, కొత్త ఫార్మటు

2011 సంవత్సరం లో రెండు కొత్త జట్లు పూణే, కేరళ ఈ లీగ్ లో చేరడం జరిగింది. ఈ సంవత్సరంలో కొత్త ఫార్మటు మొదలుపెట్టారు. లీగ్ మ్యాచ్లు అన్ని ముగిసిన తరువాత సెమీఫైనల్స్ పేరుతొ కాకుండా క్వాలిఫయింగ్ మరియు ఎలిమినేటర్ పేర్లతో ఆడటం జరిగింది. మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది, ఓడిపోయిన జట్టుకి ఇంకో అవకాశం లభిస్తుంది అదే ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఆడటం, దీన్నే క్వాలిఫయింగ్ – 2 మ్యాచ్ అంటారు ఆ తరువాత ఫైనల్స్.

2012 సంవత్సరంలో కేరళ జట్టుని కొన్ని కారణాల వల్ల రద్దు చేస్తే, 2013 సంవత్సరంలో హైదరాబాద్ జట్టు కొన్నికారణాల వల్ల రద్దు చేసుకుంది మరియు మరో కొత్త యజమాని హైదరాబాద్ జట్టుని కొనుగోలుచేసింది. పూణే జట్టు కూడా కొన్ని కారణాలతో రద్దవడంతో మళ్ళీ ఎనిమిది జట్లు మిగిలాయి.

వేదిక మార్పు

2014 సంవత్సరం లో భారత్ లో ఎన్నికల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో కొన్ని మ్యాచ్లు జరిగాయి తరువాత భారత్ లో ఎన్నికలు ముగియగానే మరికొన్ని మ్యాచ్లు భారత్ దేశంలో జరిగాయి. 2015 సంవత్సరంలో లీగ్ మొత్తం భారత్ లో జరిగింది. 2016 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాలు చెన్నై మరియు రాజస్థాన్ జట్లని నిషేదించారు.

చెన్నై మరియు రాజస్థాన్ జట్ల స్థానాల్లో గుజరాత్, పూణే జట్లని తీస్కోరావడం జరిగింది. 2017, 2018 సంవత్సరాలలో ఈ రెండు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటం జరిగింది. రెండేళ్ల నిషేధం ముగిసిన తరువాత మళ్ళీ చెన్నై, రాజస్థాన్ జట్లు వెనక్కి వచ్చాయి అలాగే గుజరాత్, పూణే జట్లు లీగ్ నుంచి తప్పుకున్నాయి. 2019 సంవత్సరంలో చెన్నై, రాజస్థాన్ జట్లు తిరిగి లీగ్ లో పాల్గొనడం జరిగింది.

కోవిడ్ – 19, వేదిక మార్పు, కొత్త జట్లు

2020 సంవత్సరంలో కోవిడ్ – 19 కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ఆడటం జరిగింది. 2021 సంవత్సరంలో మళ్ళీ భారత్ దేశంలో ఐపీఎల్ మ్యాచ్లు ధైర్యంగా నిర్వహించినా కొన్ని మ్యాచ్లు జరిగిన తరువాత ఆటగాళ్లు అలాగే జట్టు నిర్వాహకుల్లో కొంతమంది కోవిడ్ బారిన పడటంతో లీగ్ నిలిపివేసి మళ్ళీ కొన్ని నెలలు తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో నిర్వహించారు.

2022 సంవత్సరంలో మరో రెండు కొత్త జట్లు జతకలిసాయి. గుజరాత్, లక్నో జట్లు ఐపీఎల్ ఆడటం జరిగింది మరియు అనూహ్యంగా ఆడిన మొదటి సీజన్ లోనే గుజరాత్ టైటిల్ కైవసం చేసుకుంది. 2023 సంవత్సరంలో కూడా లీగ్ ని  విజయవంతంగా నిర్వహించారు. అలా ఇప్పుడు 10 జట్లతో ఐపీఎల్ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ లీగ్ వల్ల ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు, మారుమూల గ్రామాల్లో ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఇంకొంతమంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి అందరి అభిమానాన్ని పొందుతున్నారు.

ఆకర్షించే పేర్లు

నగరాలకు ఆకర్షమైన పేర్లు అని మనం చెప్పుకున్నాం మరి ఆ పేర్లేంటో ఇప్పుడు తెల్సుకుందాం. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ XI పంజాబ్, కోల్కత్త నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, కోచి టస్కర్ కేరళ, పూణే వారియర్స్ ఇండియా, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, రైసింగ్ పూణే సూపర్ జయింట్, గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జయింట్స్. కొన్ని జట్లు పేర్లు అచ్చి రావట్లేదని మార్చుకోవడం జరిగింది, ఆ పేర్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్.

వివాదాలు

ఇలాంటి భారీ లీగ్ ఉంటె వివాదాలు కూడా ఉండటం సహజం మరి ఆ వివాదాలు ఏంటి అవి కూడా చెప్పుకుందాం.

స్పాట్ ఫిక్సింగ్ పేరుతొ భారీగా డబ్బులు చేతులు మారడం, ఆటగాళ్ళని అరెస్ట్ చేయడం, జట్టు నిర్వాహకులు బెట్టింగ్ కి పాల్పడటం, హర్భజన్ సింగ్ మరియు శ్రీశాంత్ గొడవ ఇంకా ఇలాంటివి ఎన్నో వివాదాలతో ఐపీఎల్ సాగింది. వీటితోపాటు డబ్బులు ఎక్కువ వస్తుండటంతో విదేశీ ఆటగాళ్లు తమ జట్టుకి కాకుండా ఈ లీగ్ ఆడటంతో ఆటగాళ్లకు మరియు వారి క్రికెట్ బోర్డుకు మధ్య వివాదాలు వచ్చాయి.

ఈ లీగ్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు రెండు సీజన్స్ ఆడిన తరువాత మూడవ సీజన్ నుంచి వారిని నిషేదించారు బి.సి.సి.ఐ పెద్దలు. భారత్ లో జరిగిన పేలుళ్ల కారణంగా వారిని నిషేధించడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైన తరువాత మిగితా దేశాలలో కూడా ఇలాంటి లీగ్ లు మొదలుపెట్టడం జరిగింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర జట్లు కూడా ఇలాంటి లీగ్ లు ప్రారంభించారు.

ఛాంపియన్స్ లీగ్ 20-20, కొత్త లీగ్ కొత్త ఫార్మటు

ఐపీఎల్ ప్రారభించిన సంవత్సరానికి మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు భారత్, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు. ఆ ఆలోచన పేరే ఛాంపియన్స్ లీగ్ 20-20, అంటే అన్ని లీగ్స్ నుంచి ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు మరియు ఓడిన జట్టు ఈ ఛాంపియన్స్ లీగ్ లో ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ నుంచి రెండు జట్లు అలాగే మిగితా దేశాలలో జరిగే ఫ్రాంచైజ్ లీగ్ కాకుండా స్థానిక 20-20 లీగ్ ఆడే జట్లు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాయి. మొదటి సీజన్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక,వెస్టిండీస్ లీగ్స్ నుంచి చెరో రెండు జట్లు మరియు ఐపీఎల్ నుంచి 3 జట్లు ఈ లీగ్ లో పాల్గొన్నాయి. రెండవ సీజన్ వచ్చేసరికి భారత్ నుంచి కూడా రెండు జట్లు పాల్గొన్నాయి.

ఇన్ని విజయవంతమైన లీగ్స్ చుసిన కొంతమంది బడా వ్యాపారవేత్తలు ఒక అడుగు ముందుకేసి రకరకాల ఫార్మాట్లతో లీగ్స్ ప్రారంభించారు. 10-10 లీగ్ మ్యాచ్లు అని 100 బాల్స్ లీగ్ మ్యాచ్లని. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఆటగాళ్లు కూడా కొన్ని లీగ్ మ్యాచ్లు ఆడటం విశేషం.

మహిళల ప్రీమియర్ లీగ్, సినిమా లీగ్

ఐపీఎల్ మొదలైన 11 సంవత్సరాల తరువాత అంటే 2018 సంవత్సరంలో మహిళలతో ఐపీఎల్ లాంటిది మొదలుపెట్టాలని ఆలోచన రాగానే ముందుగా 3 జట్లతో ఒక లీగ్ మొదలుపెట్టారు ఆ తరువాత 4 సంవత్సరాలకి అంటే 2023 సంవత్సరంలో అధికారికంగా ఐదు జట్లతో మహిళా ప్రీమియర్ లీగ్ మొదలు పెట్టారు ఇది కూడా విజయవంతం అయ్యింది.

ఐపీఎల్ స్పూర్తితో మరో కొత్త లీగ్ భారత్ లో అడుగుపెట్టింది అదే సి.సి.ఎల్ అంటే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సినిమా నటులు క్రికెట్ ఆడటం అందరికి తెలుసు కానీ నిజమైన క్రీడాకారులగా మారి ఆడితే ఎలా ఉంటుంది అని ఒక లీగ్ మొదలు పెట్టారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ నటులతో ఈ లీగ్ ప్రారంభమైంది. 4 జట్లతో ప్రారంభమైన ఈ సి.సి.ఎల్ ఇప్పుడు 8 జట్లతో ఆడుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ, పంజాబీ భాషల్లో నటిస్తున్న నటులు ఈ లీగ్ లో పాల్గొంటారు. విజయవంతంగా ఈ లీగ్ ఇప్పటివరకు 11 సీజన్లు ముగించింది.

మిగితా క్రీడల లీగ్

ఐపీఎల్ స్పూర్తితో భారత్ లో మరికొన్ని క్రీడలలో ఇలాంటి లీగ్లని ప్రవేశపెట్టారు. కబడ్డీ, టెన్నిస్, ఫుట్బాల్, బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్, రెస్లింగ్ మరియు ఖోఖో. ఇవి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు సాగడం విశేషం.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *