భారత్ దేశంలో క్రికెట్ ఆటని ఒక క్రీడల కాకుండా మతం లాగ చూస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు క్రికెట్ అభిమానులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. కొంతమంది సరదా కోసం క్రికెట్ ఆడితే ఇంకొంతమంది జాతీయ జట్టు లో చోటు సంపాదించి అందరి ద్రుష్టిని ఆకర్షించాలని చూస్తారు, మరి జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే ఎం చేయాలి, ఎవరు ఎంపిక చేస్తారు ఆ విషయాలు తెలుసుకుందాం.
భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ముందుగా “రంజీ ట్రోఫీ” ఆడాలి ఆ తరువాత మన ప్రతిభని గుర్తించి జాతీయ జట్టులో ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
రంజీ ట్రోఫీ అంటే ఏంటి
“ది క్రికెట్ ఛాంపియన్షిప్” పేరుతొ “బి.సి.సి.ఐ” 1934 సంవత్సరంలో “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ప్రారంభించింది, తరువాత 1935 సంవత్సరంలో “రంజీ ట్రోఫీ” గా పేరు మార్చడం జరిగింది. అప్పటినుంచి ఆ పేరుతోనే ఆడటం మొదలు పెట్టారు. భారత దేశంలో ఉన్న రాష్ట్రాలు, నగరాలూ మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి అనుసంధానంగా ఉండే “క్రికెట్ అసోసియేషన్” ఈ రంజీ ట్రోఫీ లో పాల్గొంటాయి. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ప్రైవేట్ సంస్థలతో కూడిన 2 జట్లు ఈ ట్రోఫీ లో పాల్గొంటాయి.
రంజీ ట్రోఫీ పేరు మార్పుకి కారణం ఏంటి
“రంజిత్ సింహ్జి” అనే వ్యక్తి చదువుల కోసం ఇంగ్లాండ్ దేశం వెళ్లి అక్కడ చదువుకుంటూ క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఇంగ్లాండ్ జట్టు తరుపు నుంచి 1896 సంవత్సరం నుంచి 1902 సంవత్సరం వరకు ఆడటం జరిగింది. భారత్ దేశం నుంచి క్రికెట్ ఆడిన మొట్ట మొదటి భారతీయుడు కాబట్టి తన పేరు పెట్టడం జరిగింది.
1934 సంవత్సరం లో మద్రాస్ (ఇప్పటి చెన్నై) నగరం లోని చెపాక్ మైదానం లో మద్రాస్ మరియు మైసూర్ నగరాల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ విజేతగా మద్రాస్ నిలిచింది. ఇన్నింగ్స్ తేడా మరియు 23 పరుగుల తేడాతో మద్రాస్ జట్టు గెలిచింది. ఆ సీజన్ ముగిసే సమయానికి ముంబై జట్టు టోర్నమెంట్ గెలవడం జరిగింది.
“పాటియాలా మహారాజు” భూపేందర్ సింగ్ ఆ ట్రోఫీ ని అందించడం జరిగింది. “నవనగర్ జామ్ సాహెబ్” కుమార్ శ్రీ రంజిత్ సింహ్జి గారి గుర్తు గా ఈ ట్రోఫీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఈ టోర్నమెంట్ ప్రతీ సంవత్సరం విరామం లేకుండా సాగింది కానీ మధ్యలో కొరోనా కాలంలో మాత్రమే ఈ ట్రోఫీ జరగలేదు.
రంజీ ట్రోఫీ ఫార్మటు
రంజీ ట్రోఫీ ప్రారంభించినప్పుడు నాలుగు జోన్లు కూడిన జట్లని ప్రకటించారు. ఉత్తరం, దక్షిణం, పశ్చిమ మరియు తూర్పు జోన్లు ఉన్న జట్లతో ఆడటం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తరువాత మరో జోన్ వచ్చి చేరింది అదే సెంట్రల్ జోన్ తో కూడిన జట్టు ఈ ట్రోఫీ లో భాగమైంది. ముందు లీగ్ దశ ఆ తరువాత నాకౌట్ దశ ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 1957-1958 సంవత్సరం నుంచి రౌండ్ రాబిన్ లీగ్ ఆడటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి నాకౌట్ దశ ఆ తరువాత ఫైనల్. 1970-1971 సంవత్సరం నుండి 2001-2002 సంవత్సరాల వరకు జోన్లు వారీగా ఆడుతూ రౌండ్ రాబిన్ లీగ్, నాకౌట్ దశ ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ ఇలా ఆడటం జరిగింది.
కొత్త ఫార్మటు
2002-2003 సంవత్సరం నుంచి రంజీ ట్రోఫీ ఫార్మటు లో మార్పులు చేశారు. ఉత్తరం, దక్షిణం, పశ్చిమ మరియు తూర్పు జోన్లుగా ఉన్న జట్లతో పాటు సెంట్రల్ జోన్ జట్టుని కూడా రద్దు చేసి మరో కొత్త పద్దతిలో ఈ ఫార్మటు ఆడటం మొదలుపెట్టారు. 28 జట్లలో 15 జట్లని “ఎలైట్” పేరుతొ రెండు గ్రూపులు “ప్లేట్” పేరుతొ రెండు గ్రూపులు గా విభజించి ఆడటం మొదలుపెట్టారు. ఎప్పటిలాగే రౌండ్ రాబిన్ లీగ్ పేరుతొ ప్రతి జట్టు తమ గ్రూప్ లో ఉన్న అన్ని జట్లతో ఆడతాయి. ఆ తరువాత నాకౌట్ దశ ప్రారంభం అవుతుంది. ఆ నాకౌట్ దశ లో చెరో రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తారో వారు సెమీఫైనల్, అందులో గెలిచినా వారు ఫైనల్ ఆడటం జరుగుతుంది.
2006-2007 సంవత్సరం లో “సూపర్ లీగ్” పేరుతొ రెండు గ్రూపులు మరియు “ప్లేట్ లీగ్” పేరు తో రెండు గ్రూపులు విభజించబడ్డాయి. 2008-2009 సంవత్సరాలలో “సూపర్ లీగ్” ముందుగా ఈ కొత్త ఫార్మటు తో ఆడటం మొదలు పెట్టింది ఆ తరువాత 2010-2011 సంవత్సరాలలో “ప్లేట్ గ్రూప్” కూడా ఈ ఫార్మటు లో వచ్చి చేరింది.
2012-2013 సంవత్సరాలలో మరో సారి ఫార్మటు ని మార్చడం జరిగింది. సూపర్ లీగ్, ప్లేట్ లీగ్ పేర్లు మార్చి “గ్రూప్ ఏ, గ్రూప్ బి” మరియు “గ్రూప్ సి” పేర్లతో ఆడటం మొదలుపెట్టారు. 2017-2018 సంవత్సరాలలో మళ్ళీ నాలుగు గ్రూప్స్ ని తీసుకొచ్చారు, “గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి” మరియు “గ్రూప్ డి” ని చేర్చడం జరిగింది.
2018-2019 మరియు 2019-2020 సంవత్సరాలలో మరో సారి ఫార్మటు మార్చి “గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి” తో పాటు “ప్లేట్ గ్రూప్” ని చేర్చడం జరిగింది. ఆ తరువాత 2021-2022 సంవత్సరంలో 9 గ్రూప్స్ గా విభజించడం జరిగింది. “గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి,గ్రూప్ డి, గ్రూప్ ఇ గ్రూప్ ఎఫ్, గ్రూప్ జి, గ్రూప్ హెచ్” మరియు “ప్లేట్ గ్రూప్”. 2022-2023 సంవత్సరంలో మళ్ళీ “గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి” తో పాటు “ప్లేట్ గ్రూప్” ని చేర్చడం జరిగింది. ఇలా రకరకాల ఫార్మాట్లని మారుస్తూ రంజీ ట్రోఫీ నిర్వహిస్తున్నారు.
రంజీ ట్రోఫీ గురించి మరికొన్ని విశేషాలు
- రంజీ ట్రోఫీ మ్యాచ్లు అన్ని టెస్ట్ మ్యాచ్ పద్దతిలో జరుగుతాయి.
- రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు నాలుగు రోజులు జరుగుతాయి ఆ తరువాత నాకౌట్ మ్యాచ్లు ఫైనల్ మ్యాచ్లు మాత్రం ఐదు రోజులు జరుగుతాయి.
- ఈ నాకౌట్ మరియు ఫైనల్ మ్యాచ్లలో ఖచ్చితంగా ఒక విజేత ఉంటారు.
- ఒకవేళ మ్యాచ్ డ్రా అవ్వడం జరిగితే మొదటి ఇన్నింగ్స్ లో ఏ జట్టైతే ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు.
- ఎక్కువ రంజీ ట్రోఫీ గెలిచినా జట్టుగా ముంబై జట్టు రికార్డు సాధించింది, మొత్తం 41 సార్లు ముంబై జట్టు ట్రోఫీ గెలిచారు.
- ఎక్కువ పరుగులు (12,308) సాధించిన ఆటగాడిగా వసీం జాఫర్ రికార్డు సృష్టించారు.
- ఎక్కువ మ్యాచ్లు (155) ఆడిన ఆటగాడిగా కూడా వసీం జాఫర్ ముందున్నారు.
- ఎక్కువ శతకాలు (40) సాధించిన ఆటగాడిగా కూడా వసీం జాఫర్ ముందున్నారు
- ఎక్కువ వికెట్లు (640) పడగొట్టిన బౌలర్ గా రాజిందర్ గోయెల్ ముందున్నారు.
- ప్రేమంగ్సు ఛటర్జీ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించారు.