
భారత్ దేశంలో క్రికెట్ ఆటని ఒక క్రీడల కాకుండా మతం లాగ, ఆటగాళ్ళని దైవాలుగా కొలుస్తారు మన భారత ప్రేక్షకులు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు క్రికెట్ అభిమానులు క్రికెట్ ఆడుతూ మనకు కనిపిస్తూనే ఉంటారు. కొంతమంది సరదా కోసం క్రికెట్ ఆడితే ఇంకొంత మంది జాతీయ జట్టులో చోటు సంపాదించి అందరి ద్రుష్టిని ఆకర్షించాలని చూస్తారు.
మరి అందరి దృష్టిని ఆకర్షించాలంటే ఎం చేయాలి, అలాగే జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే ఎం చేయాలి, ఎవరు ఎంపిక చేస్తారు, ఎలా ఎంపిక చేస్తారు ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ముందుగా మంచి క్రికెట్ కోచ్ దెగ్గర సాధన చేసి, శిక్షణ తీసుకుని ఆ తరువాత క్లబ్ క్రికెట్ తరుపున ఆడాలి, అక్కడ మన ఆటతీరు చూసి నచ్చితే కొన్ని టోర్నమెంట్లలో ఆడే అవకాశం ఇస్తారు, అక్కడ మనం మంచి ప్రతిభ కనబరిస్తే డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్లో మన పేరుని సిఫార్సు చేయడం జరుగుతుంది.
భారత దేశంలో భారత క్రికెట్ బోర్డు (బి.సి.సి.ఐ) నిర్వహించే వివిధ క్రికెట్ టౌర్నమెంట్లని డొమెస్టిక్ క్రికెట్ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటారు. ఈ టోర్నమెంట్లలో ఆడితే మన ప్రతిభని గుర్తించి జాతీయ క్రికెట్ జట్టులో ఎంపిక చేస్తారు. ఇక టోర్నమెంట్ల విషయానికి వస్తే ఇప్పటికే మనం రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దియోధర్ ట్రోఫీ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మరో టోర్నమెంట్ గురించి తెలుసుకోబోతున్నాం అదే దులీప్ ట్రోఫీ.
దులీప్ ట్రోఫీ అంటే ఏంటి, ఎప్పుడు మొదలుపెట్టారు, ఎవరి పేరు మీద ఈ టోర్నమెంట్ ఆడటం జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
దులీప్ ట్రోఫీ
బి. సి. సి. ఐ అంటే భారత క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభించిన మరో కొత్త క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ. ప్రముఖ క్రికెట్ ఆటగాడైన దులీప్ సింహ్జి పేరు మీద ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. 1961 – 1962 సంవత్సరంలో ఈ టోర్నమెంట్ సంభందించిన మొదటి సీజన్ జరిగింది.
జట్లు
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జట్ల విషయానికి వస్తే భారత దేశం నుంచి 5 జోన్లని ఎంపిక చేశారు భారత క్రికెట్ బోర్డు పెద్దలు. ఆ 5 జోన్లని జట్లుగా మార్ఛి ఈ దులీప్ ట్రోఫీని ప్రారంభించారు. ఇక ఆ 5 జోన్లు గురించి తెలుసుకోవాలంటే సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ మరియు సెంట్రల్ జోన్. ఈ 5 జోన్ల జట్లతో ఆడటం ప్రారంభించారు మరియు మొదటి సీజన్ విజేతగా వెస్ట్ జోన్ నిలిచింది.
2002 – 2003 సంవత్సరం నుంచి దులీప్ ట్రోఫీ ఆడే జట్లలో మార్పు తీసుకొచ్చారు అదే ఎలైట్ మరియు ప్లేట్ పధ్ధతి. ఎలైట్ గ్రూప్ ఏ, ఎలైట్ గ్రూప్ బి, ప్లేట్ గ్రూప్ ఏ, ప్లేట్ గ్రూప్ బి మరియు ప్లేట్ గ్రూప్ సి జట్లు దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది. 2003 – 2004 సంవత్సరంలో ఎలైట్ గ్రూప్ మరియు ప్లేట్ గ్రూప్ పధ్ధతి తీసేసి మళ్ళీ జోన్లతో కూడిన జట్లని తీసుకొచ్చారు. ఈ 5 జోన్లతో పాటు మరో జట్టు కూడా భాగం అవ్వడం విశేషం.
కొత్త విదేశీ జట్టు
2003 – 2004 సంవత్సరంలో 5 జోన్లతో కూడిన జట్టుతో పాటు ఒక విదేశీ జట్టు ఇంగ్లాండ్ ఏ కూడా భాగం అవ్వడం విశేషం. 6 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది. ఈ పద్ధతిని కొన్ని సంవత్సరాలు కొనసాగించారు. బీసీబీ XI అని బాంగ్లాదేశ్ జట్టు ఒక సంవత్సరం ఆడితే మరో సంవత్సరం జింబాబ్వే జట్టు ఈ టోర్నమెంట్లో ఆడటం జరిగింది.
ఆ మరుసటి సంవత్సరం శ్రీలంక ఏ జట్టు, ఆ తరువాతి సంవత్సరం ఇంగ్లాండ్ లయన్స్ జట్టు ఈ ట్రోఫీ లో పాల్గొనడం జరిగింది. 2008 – 2009 సంవత్సరంలో విదేశీ జట్లని పక్కన పెట్టి మళ్ళీ 5 జోన్లతో దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది. 2016 – 2017 సంవత్సరం నుంచి మళ్ళీ జట్లలో మార్పు చేశారు. ఈసారి 5 జోన్లను తీసేసి కేవలం మూడు జట్లతో దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది.
ఆ మూడు జట్లు ఇండియా రెడ్, ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్ పేర్లతో ఈ ట్రోఫీ ఆడటం జరిగింది. 2022 – 2023 సంవత్సరంలో మళ్ళీ మూడు జట్లేన ఇండియా రెడ్, ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్ పక్కన పెట్టి జోన్లు వారీగా దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది. ఈసారి 6 జోన్ల జట్లతో దులీప్ ట్రోఫీ ఆడటం జరిగింది, అందులో 5 జోన్లయినా సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ మరియు సెంట్రల్ జోన్ గురించి మనకు తెలిసందే.
ఈ 5 జోన్లు కాకుండా మరో జోన్ ఈ టోర్నమెంట్లో ఆడటానికి సిద్ధమైంది అదే నార్త్ ఈస్ట్ జోన్ జట్టు. ఆరో జట్టుగా ఈ దులీప్ ట్రోఫీలో నార్త్ ఈస్ట్ జోన్ జట్టును ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఆరు జోన్లతో దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. 2024 సంవత్సరం, సెప్టెంబర్ నెలలో జరిగిన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో జోన్ల పద్దతిని తీసేసి ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి జట్లతో ఆడాలని నిశ్చయించారు. మరి రాబోయే సంవత్సరాలలో మరింకెన్ని మార్పులు చేస్తారో చూడాలి.
ఫార్మటు
ఇక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఫార్మటు గురించి తెలుసుకోవాలనుంటే ప్రతిసారి పరిస్థితులకు అనుకూలంగా ఫార్మాటుని మార్చుతూ వచ్చారు నిర్వాహకులు. మొదట నాకౌట్ పద్ధతుల ద్వారా ఈ టోర్నీ ఆడటం ప్రారంభించారు, ఆ తరువాత రౌండ్ రాబిన్ లీగ్ పద్దతి ద్వారా ఆడటం మొదలుపెట్టారు. ఇలా ప్రతిసారి కొన్ని సంవత్సరాలు నాకౌట్ పద్దతి మరి కొన్నిసార్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిని అమలుచేస్తున్నారు. 2024 సంవత్సరం, సెప్టెంబర్ నెలలో జరిగిన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో మళ్ళీ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిని తీసుకొచ్చారు.
నాకౌట్ పద్దతి మరియు రౌండ్ రాబిన్ లీగ్ అంటే ఏంటి, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. నాకౌట్ పద్దతి అంటే రెండు జట్లు తలపెడితే ఓడిపోయిన జట్టు వెంటనే నిష్క్రమిస్తుంది, అదే గెలిచిన జట్టు మాత్రం తర్వాతి మ్యాచ్లకు సిద్ధపడుతుంది. అలా మ్యాచ్లు ఆడుతూ ఫైనల్ వరకు చేరుకుంటుంది.
ఇక రౌండ్ రాబిన్ లీగ్ గురించి చెప్పాలంటే ప్రతి జట్టు మిగిలిన జట్లతో తలపడతాయి, ఆ తరువాత ఏ జట్టు ఎక్కువ మ్యాచ్లు గెలిచి ఎక్కువ పాయింట్లతో ముందువరసలో నిలుస్తుందో ఆ జట్టు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఇక ఈ మ్యాచ్లన్నీ టెస్ట్ క్రికెట్ ఫార్మటులో ఆడటం జరుగుతుంది, అది కూడా 4 రోజులు ఆడతారు మరియు ఫైనల్ మ్యాచ్ ఉంటె 5 రోజులు ఆడతారు. ఒక వేళా డ్రా ఐతే మొదటి ఇన్నింగ్స్లో ఏ జట్టైతే ఎక్కువ పాఱుగులు చేసిందో వారిని విజేతగా ప్రకటిస్తారు.
దులీప్ సింహ్జి ఎవరు

దులీప్ సింహ్జి 1905 సంవత్సరం, 13 జూన్ అప్పటి బ్రిటిష్ ఇండియా (ఇప్పటి గుజరాత్ రాష్ట్రం) లోని నవనగర్ నగరంలో జన్మించారు. ప్రముఖ క్రికెట్ ఆటగాడు అలాగే భారత్ దేశంలో పుట్టి ఇంగ్లాండ్ దేశం తరపున క్రికెట్ ఆడిన రంజిత్ సింహ్జి గారి మేనల్లుడు. దులీప్ సింహ్జి పూర్తి పేరు కుమార్ శ్రీ దులీప్ సింహ్జి. నవనగర్ రాజ వంశం నుంచి వచ్చిన దులీప్ సింహ్జి, చదువంతా రాజ్ కోట్ నగరంలో కొనసాగింది. ఆ తరువాత ఇంగ్లాండ్ దేశం వెళ్ళీ అక్కడున్న కళాశాలలో మరియు విశ్వ విద్యాలయంలో చదువుకున్నారు.
క్రికెట్ కెరీర్
1926 సంవత్సరంలో సస్సెక్స్ జట్టు తరుపున మొదటి సారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు దులీప్ సింహ్జి. 1928 సంవత్సరంలో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ సీజన్లో 2500 పరుగులు సాధించారు. 1930 సంవత్సరంలో జరిగిన సీజన్లో ఒక్కరోజులోనే 333 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. దులీప్ సింహ్జి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో మూడు సార్లు రెండు ఇన్నింగ్స్ లో శతకం సాధించారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 49.95 సగటుతో 15,485 పరుగులు సాధించారు అలాగే 50 శతకాలు సాధించారు. సస్సెక్స్ జట్టు తరపున ఆడుతూ 51.56 సగటుతో 9,178 పరుగులు సాధించి 35 శతకాలు చేయడం జరిగింది. దులీప్ సింహ్జి స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసేవారు మరియు 256 కాచ్లు పట్టడం జరిగింది. 1926 – 1932 సంవత్సరం మధ్యలో కౌంటీ ఛాంపియన్షిప్ లో బ్యాటింగ్ సగటులో ముందు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం
1929 సంవత్సరంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆరంగ్రేటం చేయడం జరిగింది. ఆస్ట్రేలియా జట్టుతో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 173 పరుగులు చేయడం జరిగింది. ఇది తన అత్యధిక స్కోర్ అవ్వడం విశేషం. 12 టెస్ట్ మ్యాచ్లు ఆడి 58.52 సగటుతో 995 పరుగులు చేయడం జరిగింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటులో దులీప్ సింహ్జి సగటు ఒకటి.
ఇక టెస్ట్ మ్యాచ్లో మూడు శతకాలు 5 అర్ధ శతకాలు సాధించడం జరిగింది. 1931 సంవత్సరంలో క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు దులీప్ సింహ్జి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలలో భారత హై కమిషనర్ భాద్యతలు చేపట్టారు. భారత్ తిరిగి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పని చేయడం జరిగింది. 1959 డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించారు దులీప్ సింహ్జి.
గణాంకాలు
టెస్ట్ క్రికెట్: దులీప్ సింహ్జి తన జీవితంలో మొత్తం 12 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడగా 58.52 సగటుతో 995 పరుగులు సాధించారు, అందులో 3 శతకాలు, 5 అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోరర్ వచ్చేసి 173. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆరు బంతులు వేసి ఒక్క వికెట్ తీయలేదు, అంతేకాకుండా 10 క్యాచ్లు అందుకున్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: దులీప్ సింహ్జి తన జీవితంలో మొత్తం 205 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడగా 49.96 సగటుతో 15,485 పరుగులు సాధించారు, అందులో 50 శతకాలు, 64 అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 333. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 1,835 బంతులు వేయగా 48.03 సగటుతో 28 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 4/49, అంతేకాకుండా 256 క్యాచ్లు అందుకున్నారు.
కొన్ని విషయాలు
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున 238 క్యాప్ ఆటగాడిగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టారు దులీప్ సింహ్జి. కుడి చేతి బ్యాటర్ మరియు కుడి చేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ వేయగలరు దులీప్ సింహ్జి. 1930 సంవత్సరంలో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారం లభించడం విశేషం.