First Indian Male Test Cricket Captain – C.K.Nayudu

CK Nayudu
CK Nayudu

భారత పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాక తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు తో ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టుకి సారధ్యం వహించిన ఆటగాడు సి. కే. నాయుడు, మరియు తనే మొదటి భారత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ సారధి అవ్వడం విశేషం. ఈయన మన తెలుగు వారు కావడం తెలుగువారందరికీ గర్వకారణం.

సి.కే.నాయుడు ఎవరు

సి. కే. నాయుడు పూర్తి పేరు కొట్టారీ కనకయ్య నాయుడు. 1895 అక్టోబర్ 31 న మహారాష్ట్ర రాష్ట్రంలో నాగపూర్ నగరంలో సెంట్రల్ ప్రావిన్స్ లో కొట్టారీ సూర్య ప్రకాష్ రావు నాయుడు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. నలుగురు అన్నదమ్ముల్లో నాయుడు మొదటివారు. నాయుడు చదువంతా నాగపూర్ లోని పాఠశాల మరియు కళాశాలలో సాగింది.

నాయుడు చిన్ననాటి నుంచే ఆటల మీద మక్కువ ఎక్కువ ఉండటం వల్ల క్రికెట్ తో పాటు ఫుట్బాల్, హాకీ  మరియు ఇతర ఆటలు కూడా ఆడేవారు. పాఠశాల వయసులోనే తన క్రికెట్ జట్టుకి సారధిగా వ్యవహరించారు. ఆర్. రాజన్న అనే కోచ్ నాయుడు గారికి చిన్నతనంలోనే ఆటలో మెళకువలు నేర్పించడం జరిగింది.

కుటుంబ చరిత్ర

సి.కే.నాయుడు పూర్వికులు సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణ జిల్లా, మచిలీపట్నం. ఆ తరువాత వారు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి నిజం నవాబు దెగ్గర పనికి కుదరడం జరిగింది. ఆ తరువాత నాయుడు గారి తాతగారైన నారాయణస్వామి నాయుడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నుంచి నాగపూర్ నగరానికి వలస వెళ్లడం జరిగింది.

నారాయణస్వామి నాయుడు నాగపూర్ లో న్యాయవిద్య అభ్యసించడం జరిగింది మరియు ఆయన నాగపూర్ నగరంలోనే ఉత్తమ వకీలుగా పేరు సంపాదించారు. నారాయణస్వామి నాయుడు రాజకీయాల్లో కూడా పాల్గొనేవారు మరియు ఆయనకి కొంత వ్యవసాయ భూమి కూడా ఉండటం విశేషం.

నారాయణస్వామి నాయుడు గారికి ఇద్దరు తనయులు మరియు ఇద్దర్ని కూడా పైచదువుల కోసం విదేశాలకు పంపించడం జరిగింది. రెండో తనయుడైన సూర్య ప్రకాష్ రావు నాయుడు ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. సూర్య ప్రకాష్ రావు నాయుడు చదువు పూర్తి చేసి మరలా నాగపూర్ నగరానికి వచ్చి వకీలుగా శిక్షణ తీసుకోవడం జరిగింది.

ఆ తరువాత కొన్నేళ్లపాటు నాగపూర్ హై కోర్ట్ లో జస్టిస్ గా పనిచేశారు. ఇంగ్లాండ్ దేశం నుంచి న్యాయ విద్యతో పాటు ఆ దేశం వారు కనిపెట్టిన క్రికెట్ ఆటని కూడా నాగపూర్ నగరానికి తీస్కోరావడం జరిగింది, మరియు నాగపూర్ ప్రజలకు పరిచయం చేశారు సూర్య ప్రకాష్ రావు నాయుడు.

క్రికెట్ జీవితం

సి.కే.నాయుడు 1916 సంవత్సరంలో “బాంబే క్వాడ్రాంగులర్ టోర్నమెంట్” తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టడం జరిగింది. హిందూ జట్టు తరపున యూరప్ జట్టుతో ఆడీ 4 వికెట్లు తీయడం జరిగింది, బంతితోనే కాకుండా బ్యాట్ తో కూడా సిక్సర్ కొట్టి పరుగుల ఖాతా తెరవడం జరిగింది. 1917 సంవత్సరంలో పారిస్ జట్టు తో ఆడీ 80 పరుగులు సాధించారు. 1917 సంవత్సరంలో బొంబాయి నగరంలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ XI తరుపున ఆడీ శతకం సాధించారు సి.కే.నాయుడు.

ఆ మ్యాచ్లో సి.కే.నాయుడు 122 పరుగులు చేయడమే కాకుండా తమ జట్టుకి విజయాన్ని అందించారు అదికూడా ఇన్నింగ్స్ తేడాతో. 1919 సంవత్సరంలో సెంట్రల్ ప్రావిన్స్ తరపున మరియు 1920 సంవత్సరంలో మద్రాస్ (ఇప్పటి చెన్నై) తరపున ఆడటం జరిగింది. కొన్ని సంవత్సరాలపాటు సి.కే.నాయుడు ఆడే ఆట మరియు తను బ్యాట్ తో కొట్టే భారీ షాట్స్ కి సాంప్రదాయమైన భారత క్రికెట్ చరిత్రలో కధలుగా చెప్పుకునేవారు.

డిసెంబర్ 1920 మద్రాస్ నగరంలో యూరప్ దేశం తో ఆడీ 120 పరుగులు సాధించారు. మద్రాస్ నగరంలోని చెపాక్ మైదానం లో ఆడిన మ్యాచ్ లో సి.కే.నాయుడు కొట్టిన బంతి సిక్సర్ అవ్వగా అది మైదానం గోడ దాటి 140 మీటర్ ఎత్తు నుంచి భూమి మీదకి పడటం విశేషం. 1926-1927 సంవత్సరాలలో బాంబే (ఇప్పుడు ముంబై అని పిలుస్తున్నారు) నగరంలోని జింఖానా మైదానంలో ఆర్థర్ గిల్లిగాన్ సారధ్యంలో మరిలేబోన్ క్రికెట్ క్లబ్ తో హిందువుల జట్టు తరుపున దూకుడుగా ఆడి 65 నిమిషాల్లో శతకం సాధించి మరియు 116 నిమిషాలలో 153 పరుగులు సాధించారు.

తన శతకంలో 11 సిక్సర్లు కొట్టి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక్క కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. మహామహులైన ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెదిరే బంతితో విరుచుకుపడుతున్న కొంచెం కూడా బెదరకుండా శతకం సాధించడం విశేషం. ఈ శతకానికి గాను ఎం.సి.సి. జట్టు సి.కే.నాయుడు గారికి వెండి బ్యాట్ ను బహుకరించింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భారత జట్టు ఆట చుసిన తరువాత గిల్లిగాన్ అనే వ్యక్తి టెస్ట్ క్రికెట్ లో భారత జట్టుని భాగం చెయ్యడానికి ప్రయత్నించారు. అతని ప్రయత్నాలు ఫలించి 1928 లో భారత క్రికెట్ జట్టు కి టెస్ట్ హోదా లభించడమే కాకుండా “”భారత క్రికెట్ బోర్డు” ప్రారంభించడం జరిగింది. భారత క్రికెట్ జట్టుకి టెస్ట్ హోదా రావడానికి కారణాలలో ఒకటి సి.కే.నాయుడు గారి అద్భుత ప్రదర్శన కూడా ఉండటం విశేషం.

టెస్ట్ హోదా మరియు మొదటి సారధి

1931 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టుకి అంతర్జాతీయ టెస్ట్ హోదా లభించిన తరువాత 1932 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు తమ మొదటి టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టుతో ఆడటానికి ఆ దేశానికి పయనం అవ్వడం జరిగింది. టెస్ట్ హోదా లభించిన తరువాత వచ్చిన కొత్త సమస్య జట్టుకి సారధ్యం ఎవరు వహించాలి అని, కానీ అప్పటికే సి.కే.నాయుడు పేరు అందరు ప్రతిపాదించారు.

కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారత జట్టుకి సారధ్యం వహించాలని అప్పటి భారత్ లోని రాజ్యాలని పరిపాలించే రాజులూ, మహారాజులు సారధ్యం వహించాలని ఉత్సాహపడ్డారు కానీ కొన్ని కారణాలు తరువాత ఒక్కొక్కరు తప్పుకోవడం జరిగింది.

సారధ్య బాధ్యతలు సి.కే.నాయుడు చేతికి వచ్చినా కూడా కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితో ఉండటం జరిగింది ఎందుకంటే ఒక సామాన్య మనిషి సారధ్యం ఎలా వహిస్తాడని ఆ జట్టు మేనేజర్ “పోర్బందర్ మహారాజు”ని ప్రాధేయబడ్డారు కొంతమంది ఆటగాళ్లు, కానీ “పటియాలా మహారాజు” మాత్రం సి.కే.నాయుడు సారధ్యాన్ని అంగీకరించాలని ఆటగాళ్ళని ఆదేశించడం జరిగింది.

36 వయసులో సి.కే. నాయుడు భారత క్రికెట్ జట్టులో అడుగుపెట్టి మొదటి టెస్ట్ క్రికెట్ సారధి అవ్వడం జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచారు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన చేతికి గాయమైన కూడా 40 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది.

అత్యుత్తమ ప్రదర్శన

ఇంగ్లాండ్ టూర్ కొనసాగింపుగా లార్డ్స్ మైదానంలో ఎం. సి. సి. జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాయుడు 118 పరుగులు సాధించడం జరిగింది. ఆ టూర్లో నాయుడు గారు పరుగుల వరద సృష్టించి (1618 పరుగులు) అందరికన్నా ఎక్కువ పరుగులు సాధించడం జరిగింది. 40 సగటుతో 5 శతకాలు మరియు బౌలర్ గా ఒక వికెట్కు 25 పరుగుల సగటుతో 65 వికెట్లు తీయడం జరిగింది.

ఈ టూర్లో బౌలింగ్ లోను తన అత్యుత్తమ ప్రదర్శన లీసెన్స్టర్ షైర్  జట్టుతో ఆడి 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది ఈ టూర్ లో ముఖ్యమైన బౌలర్లైనా మహమ్మద్ నిస్సార్ మరియు అమర్ సింగ్ ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది. ఈ టూర్ లో భారత జట్టు 26 మ్యాచ్ లు ఆడితే 9 మ్యాచ్ లు గెలిచి మరో తొమ్మిది మ్యాచ్లు ఓడిపోయి మరో 8 మ్యాచ్లు డ్రా గా ముగిసాయి.

1933 సంవత్సరంలో “విస్డెన్ పత్రిక” వారు ప్రచురించిన “కధనం” ఉత్తమ క్రికెటర్ అఫ్ ది ఇయర్ కధనంలో ఐదుగురు క్రికెట్ ఆటగాళ్లలో ఒకరు సి.కే. నాయుడు. తన నాయకత్వ లక్షణాలు మరియు ఆటతీరుకు ఈ గౌరవం దక్కడం విశేషం. 1933-34 సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకి వచ్చినప్పుడు కూడా సి.కే. నాయుడు భారత జట్టుకి సారధ్యం వహించారు.

ఈ పర్యటనలో భారత జట్టు 4 టెస్ట్ మ్యాచ్లలో 3 ఒడి ఒకటి డ్రా చేసుకుంది. ఈ టూర్ లో జరిగిన మొదటి మ్యాచ్లో నాయుడు మరియు లాల అమర్నాథ్ కలిసి మూడో వికెట్ కు 186 భాగస్వామ్యన్నీ నెలకొల్పారు. బొంబే నగరంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో నాయుడు 67 పరుగులు మరియు లాల అమర్నాథ్ 118 పరుగులు సాధించారు.

సారధి మార్పు మరియు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్

1936 సంవత్సరంలో భారత జట్టు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు కూడా నాయుడు జట్టులో సభ్యుడిగా మాత్రమే ఉన్నారు కానీ సారధ్య భాద్యతలు మాత్రం విజయనగరం మహారాజకుమార్ గారికి అప్పజెప్పడం జరిగింది. ఈ టూర్ లో నాయుడు గారు తన ఆఖరి మ్యాచ్ ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ లో నాయుడు గారు 81 పరుగులు సాధించారు మరియు టెస్ట్ క్రికెట్ లో నాయుడు గారికి ఇది అత్యధిక స్కోర్ ఉండటం విశేషం. ఈ టూర్ లో నాయుడు గారు 1,102 పరుగులు మరియు 26 సగటుతో మరియు 31.78 సగటుతో 51 వికెట్లు తీయడం జరిగింది.

అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడ్కోలు పలికిన తరువాత నాయుడు గారు రంజీ ట్రోఫీలో ఆడటం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, హోల్కర్ జట్టు తరపున ఆడటం జరిగింది.  తొమ్మిది సార్లు హోల్కర్ జట్టుని రంజీ ట్రోఫీ ఫైనల్ వరకు తీసుకొచ్చారు మరియు నాలుగు సార్లు ఫైనల్ గెలిచారు. భారత క్రికెట్ బోర్డు నాయుడు గారి 50 వ పుట్టిన రోజు పురస్కరించుకొని ఒక చారిటీ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.

క్రికెట్ క్లబ్ అఫ్ ఇండియా మరియు సి.కే. నాయుడు XI మధ్య ఈ చారిటీ మ్యాచ్ నిర్వహించారు. గుల్ మహమ్మద్, డేనిష్ కాఫ్టన్ లాంటి ఆటగాళ్లు నాయుడు గారి జట్టులో ఉండటం జరిగింది. 1952-1953 సంవత్సరంలో బెంగాల్ జట్టుతో రంజీ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ ఆడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హోల్కర్ రాష్ట్రము నుంచి కల్నల్ గా కూడా రాజీనామా చేయడం జరిగింది.

1956-1957 సంవత్సరంలో నాయుడు గారి రిటైర్మెంట్ వెనక్కితీసుకుని ఉత్తరప్రదేశ్ జట్టు తరపున రంజీ ట్రోఫీ ఆడాలని కోరడం జరిగింది. ఆ సీజన్లో రాజస్థాన్ జట్టుపై 84 పరుగులు చేయడం విశేషం. తన ఆఖరి ఆట బొంబాయి జట్టు పై ఆడీ 52 పరుగులు చేయడం జరిగింది అప్పుడు అతని వయసు 62.

క్రికెట్ వీడ్కోలు తరువాత

సి. కే. నాయుడు తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో జట్లు తరపున ఆడటం జరిగింది. హిందుస్, మద్రాస్, హైదరాబాద్, సెంట్రల్ ఇండియా, హోల్కర్, ఆంధ్ర మరియు ఉత్తర్ ప్రదేశ్ జట్లకు ఆడారు. 47 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి రికార్డు సృష్టించారు సి.కే. నాయుడు మరియు 12,000 పరుగులు చేసారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సి.కే. నాయుడు అత్యధిక స్కోర్ 200 చేయడం విశేషం అప్పుడు అతని వయసు 51. 36.37 సగటుతో రంజీ ట్రోఫీ లో 2567 పరుగులు చేసారు, ఇందులో 5 శతకాలు ఉండటం విశేషం. బొంబాయి క్వాడ్రంగులర్ టోర్నమెంట్ లో సగటు 45.87 తో 2,156 పరుగులు చేశారు.

క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తరువాత జాతీయ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా మరియు బి. సి. సి. ఐ కి వైస్ ప్రెసిడెంట్ గా అలాగే రేడియో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటులో ముఖ్య భూమికను పోషించి మరియు వ్యవస్థాపిక అధ్యక్షుడిగా ఉన్నారు. గుంటూరు నగరంలో స్థానిక ఆటగాళ్ళని తయారు చేశారు సి. కే. నాయుడు మరియు ఆయన సోదరుడు సి. ఎస్. నాయుడు.

వ్యక్తిగత జీవితం

సి.కే. నాయుడు గారికి ఇద్దరు భార్యలు మరియు తొమ్మిది మంది సంతానం. పెళ్లైన కొన్ని సంవత్సరాలకి మొదటి భార్య చంద్రమ్మ కన్నుమూశారు ఆ తరువాత గుణవతి అనే ఆవిడతో సి. కే. నాయుడు గారికి రెండో వివాహం జరిగింది. తన కుటుంబంతో నాగపూర్ నుంచి ఇండోర్ నగరానికి వలస వెళ్లారు సి. కే. నాయుడు. హోల్కర్ రాష్ట్ర పాలకుడైన టుకోజిరావు III సైన్యంలో నియమించబడ్డ కెప్టెన్ హోదాతో వెళ్లడం జరిగింది.

సి.కే. నాయుడు మరియు వారి కుటుంబసభ్యులు ఆంధ్ర రాష్ట్రానికి దూరంగా ఉన్నాకూడా ఇంట్లో మాత్రం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు పాటించేవారు. సి.కే. నాయుడు తన 72వ పుట్టినరోజుకి కొద్దీ నెలల ముందు అనారోగ్యం పాలయ్యారు. కొద్దీ రోజుల తరువాత మాట పడిపోవడం మరియు పరామర్శకి ఎవరన్నా సందర్శించడానికి వస్తే వారిని లోపలికి  అనుమతించేవారు కాదు కుటుంబసభ్యులు. 1967 సంవత్సరంలో 14 నవంబర్ నాడు సి.కే. నాయుడు కాలం చేశారు.

గణాంకాలు

టెస్ట్ క్రికెట్: సి. కె. నాయుడు తన క్రికెట్ జీవితంలో మొత్తం 7 అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లు ఆడి 25.00 సగటుతో 350 పరుగులు సాధించారు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 81. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 858 బంతులు వేయగా 42.88 సగటుతో 9 వికెట్లు పడగొట్టారు మరియు అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చి 3/40 అలాగే 4 క్యాచ్లు అందుకున్నారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్: సి. కె. నాయుడు ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం 207 మ్యాచ్లు ఆడి 35.94 సగటుతో 11,825 పరుగులు సాధించారు. ఇందులో 26 శతకాలు, 58 అర్ధ శతకాలు ఉండటం విశేషం మరియు అత్యధిక స్కోర్ వచ్చేసి 200. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 25,798 బంతులు వేయగా 29.28 సగటుతో 411 వికెట్లు పడగొట్టగా, 12 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు అలాగే రెండు సార్లు మ్యాచ్లో 10 వికెట్లు తీయడం జరిగింది. అత్త్యుత్తమ బౌలింగ్ వచ్చేసి 7/44 మరియు 170 క్యాచ్లు ఒక స్టాంపింగ్ చేయడం విశేషం.

సి.కే. నాయుడు గురించి మరికొన్ని విషయాలు
  • ప్రకటనలో కనిపించిన మొట్ట మొదటి భారత క్రికెట్ ఆటగాడు సి.కే. నాయుడు.
  • 1956 సంవత్సరంలో భరత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
  • పద్మభూషణ్ పురస్కారం అందుకున్న మొదటి క్రికెట్ ఆటగాడు సి.కే. నాయుడు.
  • 2006 సంవత్సరంలో బి. సి. సి. ఐ కల్నల్ సి.కే.నాయుడు జీవిత సాఫల్య పురస్కారంతో ఒక పురస్కారం నెలకొల్పడం జరిగింది.
  • 1973-1974 సంవత్సరంలో భారత్ దేశంలో జరిగిన అండర్ 25 డొమెస్టిక్ టౌర్నమెంట్లని సి. కే. నాయుడు ట్రోఫీగా పిలిచేవారు.
  • క్రికెట్ క్లబ్ అఫ్ ఇండియా లో ఒక హాల్ పేరుకి సి. కే. నాయుడు పేరుని పెట్టడం జరిగింది.
  • 2014 సంవత్సరంలో సి. కే. నాయుడు గారి పేరు “విస్డెన్ ఇండియా” హాల్ అఫ్ ఫేమ్ లో చేర్చడం జరిగింది.
  • నాయుడు పుట్టిన నాగపూర్ నగరంలో ఒక వీధికి తన పేరు పెట్టడం విశేషం.
  • విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ వద్ద సి. కె. నాయుడు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు.
  • సి.కే. నాయుడు పూర్వికులు నివసించిన మచిలీపట్నంలో ఒక రహదారికి తన పేరును పెట్టారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి గారు.
  • 2018 సంవత్సరంలో భారత మాజీ సారధి అనిల్ కుంబ్లే, సి. కే. నాయుడు గారి విగ్రహాన్ని మచిలీపట్నంలో ఆవిష్కరించడం జరిగింది.
  • విశాఖపట్నం లోని ఏసీఏ – విడిసిఏ మైదానం వద్ద “ది కొలొస్సన్ అఫ్ క్రికెట్” పేరుతొ 2005 ఏప్రిల్ 4న కాంస్య విగ్రహం ఆవిష్కరించారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *