
భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమకి ప్రత్యేక స్థానం ఉంది, ప్రతి సంవత్సరం తెలుగు భాషలో ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకుంటాయి అలాగే ఎంతోమంది నటి నటులకు మరియు సాంకేతిక నిపుణులకు అవకాశాలు లభిస్తూ ఉంటాయి, మరి అలంటి తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు మొదలైంది, విడుదలైన మొదటి చిత్రం ఏది, దాని వెనుక ఎవరున్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం.
తెలుగు సినిమా పితామహుడుగా, మొదటి నిర్మాణ సంస్థ అధినేతగా అలాగే తెలుగులో మొట్ట మొదటి మూకీ సినిమా నిర్మించిన నిర్మాతగా నిలిచిపోయిన వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గురించి తెలుసుకుందాం.
రఘుపతి వెంకయ్య నాయుడు ఎవరు
చిన్నతనం నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు చిత్ర లేఖనం మరియు శిల్ప కళ మీద ఆసక్తి పెంచుకోవడంతో తన తండ్రి చెన్నై నగరానికి పంపించడం జరిగింది. అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని తను నేర్చుకుంటున్న కళల మీద మరింత శ్రద్ధ చూపించడం మొదలుపెట్టారు రఘుపతి వెంకయ్య నాయుడు. ఒక వైపు చిత్ర లేఖనం ప్రదర్శిస్తూనే మరో వైపు ఆయిల్ పెయింటింగ్ కళ నేర్చుకుని రకరకాల చిత్రాలు చేయడం జరిగింది అలాగే ఎన్నో శిల్పాలని తీర్చిదిద్దారు.
చెన్నై నగరంలో ఉంటున్న పెద్ద పెద్ద జమీందార్లు, రాజవంశీయులకు రఘుపతి వెంకయ్య నాయుడు రూపొందించిన చిత్రాలు మరియు శిల్పాలు చూసి ఆకర్షితులయ్యారు. తన ప్రతిభను ప్రోత్సహించడానికి ఆ చిత్రాలు మరియు శిల్పాలు కొనుగోలు చేసి ప్రోత్సహించారు అక్కడి జమీందార్లు. ఒక వైపు చిత్ర కళ, శిల్ప కళ చేస్తూనే మరో కొత్త విషయం మీద ఆసక్తి పెంచుకున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు.
అప్పుడే ఫొటోస్టూడియోలు చెన్నై నగరంలో అభివృద్ధి చెందుతుండటంతో ఫోటో స్టూడియో స్థాపించి రకరకాలుగా ఫోటోల మీద ప్రయోగాలు చేశారు రఘుపతి వెంకయ్య నాయుడు.
నిశ్శబ్ద చిత్రాలు
అప్పుడప్పుడే మూకీ చిత్రాలు ప్రారంభం అవ్వడంతో తన మనసు చిత్రాల వైపు మళ్లడం జరిగింది. ఒక వైపు ఫోటో స్టూడియో చూసుకుంటూ మరో వైపు సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. సినిమా నిర్మాణం అంటే ఏంటి, సినిమాలు ఎలా తీస్తారు అనే విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు.
సినిమా నిర్మాణం గురించి తెలుసుకునే క్రమంలో క్రోనో మెగాఫోన్ అనే పరికరాన్ని పత్రికలో చూసి ఎలాగైనా కొనుగోలు చేయాలనీ లండన్ నగరం నుంచి తెప్పించుకున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు. ఈ పరికరం వల్ల ఉపయోగం ఏంటంటే ఒక వైపు చిత్రం ప్రదర్శిస్తున్నప్పుడు ఈ పరికరాన్ని జత చేస్తే శబ్దంతో కూడిన చిత్రాన్ని ప్రదర్శించవచ్చు. ఈ క్రోనో మెగాఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఒక 4,000 నిశ్శబ్ద చిత్రం కూడా ఉచితంగా రావడం జరిగింది.
చెన్నై నగరం, విక్టోరియా పబ్లిక్ హాల్ లో మొదటిసారి నిశ్శబ్ద చిత్రాన్ని క్రోనో మెగాఫోన్ జత చేసి ప్రదర్శించడం జరిగింది. తన ప్రయోగం విజయం సాధించడంతో చెన్నై నగరంలోని కొన్ని గ్రామాలూ, పట్టణాళ్ళతో పాటు బెంగళూరు, విజయవాడ లాంటి నగరాలతోపాటు శ్రీలంక, బర్మా, రంగూన్ లాంటి ప్రదేశాల్లో కూడా ప్రదర్శించడం విశేషం.
1910 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య నాయుడు ఒక టెంట్ హౌస్ స్థాపించి తన చిత్రాలని ప్రదర్శించడం జరిగింది. ఆ తరువాత 1912 సంవత్సరంలో చెన్నై నగరంలోని మౌంట్ రోడ్ దెగ్గర గైటీ థియేటర్, మింట్ స్ట్రీట్ దెగ్గర క్రౌన్ థియేటర్, పురసవాక్కంలో గ్లోబ్ థియేటర్లు నిర్మించి చిత్రాలు ప్రదర్శించడం జరిగింది. భారత ప్రేక్షకుల కోసం నిర్మించిన మొదటి థియేటర్ గైటీ థియేటర్ కావడం విశేషం.
ఈ థియేటర్లలో కొన్ని అమెరికా, బ్రిటిష్ దేశాల్లో రూపొందించిన చిత్రాలని ప్రదర్శించడం జరిగింది. ఈ థియేటర్లలో ప్రదర్శించిన మొదటి ఆంగ్ల చిత్రం ది మిలియన్ డాలర్ మిస్టరీ. ఆ తరువాత ది బ్రోకెన్ కాయిన్, మిస్టీరియస్ అఫ్ మీరా, క్లచింగ్ హ్యాండ్, రాజాస్ కాస్కెట్, పెర్ల్ ఫిష్ మరియు గ్రేట్ బర్డ్ చిత్రాలని ప్రదర్శించారు రఘుపతి వెంకయ్య నాయుడు. సినిమా చిత్రాల సంభందించిన సాంకేతిక మీద శిక్షణ ఇవ్వడానికి ఒక సినిమా లైబ్రరీ స్థాపించడం జరిగింది.
సినిమా నిర్మాణం
థియేటర్లు నిర్మించి చిత్రాలు ప్రదర్శిస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు గారికి సినిమా నిర్మాణం మీద మనసు పడింది, వెంటనే సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవడానికి తన కుమారుడిని లండన్ నగరానికి పంపించడం జరిగింది. వెంకయ్య నాయుడు తనయుడు అక్కడ ప్రముఖ ఆంగ్ల దర్శకులు సెసిల్ బి. డెమిల్లె దెగ్గర సహాయ దర్శకుడిగా చేరడం జరిగింది.
అక్కడ కొన్ని రోజులు పని నేర్చుకుంటూ మిగితా విషయాల మీద అవగాహన పెంచుకోవడం మొదలుపెట్టారు వెంకయ్య నాయుడు తనయుడు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు. కొన్ని రోజుల తరువాత భారత దేశానికి ఒక కెమెరాతో తిరిగి వచ్చి ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించడం జరిగింది. 1919 సంవత్సరంలో స్టార్ అఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి మీనాక్షి కళ్యాణం అనే చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ చిత్రం మదురై నగరంలోని మీనాక్షి ఆలయం పరిసరాల ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఆ చిత్రం రూపొందించిన తరువాత కెమెరాలో కొన్ని సాంకేతిక కారణాలు లోపించడం వల్ల ఉన్న ఫిలిం కాస్త పాడవటంతో చిత్రాన్ని మధ్యలో ఆపేయడం జరిగింది. ఆ తరువాత మరో కెమెరాను కొనుగోలు చేసి తన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు దర్శకత్వంలో మొదటి చిత్రాన్ని నిర్మించారు రఘుపతి వెంకయ్య నాయుడు.
1921 సంవత్సరంలో మొదటి మూకీ చిత్రాన్ని నిర్మించారు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు, ఆ చిత్రం పేరు భీష్మ ప్రతిజ్ఞ. ఈ చిత్రం తరువాత గజేంద్ర మోక్షం, భక్త నందనార్, సముద్ర మధనం మరియు మత్స్యావతారం చిత్రాలు కూడా నిర్మించారు రఘుపతి వెంకయ్య నాయుడు. ఈ చిత్రాలన్నీ మూకీ చిత్రాలు కావడం విశేషం. ఈ చిత్రాల్లో తెలుగు మహిళలు నటించడానికి ముందుకు రాకపోవడంతో ఆంగ్లో ఇండియన్ మహిళలు నటించడం జరిగింది.
రఘుపతి వెంకయ్య నాయుడు వెంకయ్య గ్లాస్ స్టూడియో పేరుతొ ఒక సినిమా స్టూడియోని నిర్మించడం జరిగింది కానీ విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేనందున సూర్యుడు కిరణాలతో వచ్చే సూర్య రష్మిని ఉపయోగించుకుని అక్కడ చిత్రాలు రూపొందించడం విశేషం. వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నా కూడా ఆర్ధికంగా వెనుకబడ్డారు రఘుపతి వెంకయ్య నాయుడు.
ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ అనే నిర్మాణ సంస్థతో పొడి పడలేక తన సంస్థని అమ్ముకుని మళ్ళీ ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చేసారు రఘుపతి వెంకయ్య నాయుడు. తండ్రి సినిమాని వదిలేసినా కూడా తనయుడు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడు మాత్రం సినీ పరిశ్రమలో కొనసాగడం జరిగింది.
వ్యక్తిగతం
రఘుపతి వెంకయ్య నాయుడు అక్టోబర్ 15, 1869 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మాచిలీపట్నంలో రఘుపతి అప్పయ్య నాయుడు మరియు శేషమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. రఘుపతి వెంకయ్య నాయుడు కుటుంబం సైన్యంలో పని చేయడం విశేషం. వీరి పూర్వికులు హైదరాబాద్రెజిమెంట్లో మద్రాస్ ఆర్మీ, ఈస్ట్ ఇండియా కంపెనీలకు కమాండర్లుగా పనిచేయడం విశేషం మరియు వెంకయ్య నాయుడు తండ్రి భారత సైనిక అధికారంలో సుబేదార్ గా ఉన్నారు.
రఘుపతి వెంకయ్య నాయుడు సోదరుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్య వేత్తగా మరియు సామాజిక సంస్కర్తగా ఉండేవారు. 1941 సంవత్సరం, మార్చ్ 15న అనారోగ్యంతో కన్ను మూశారు రఘుపతి వెంకయ్య నాయుడు.
బయోపిక్
రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా దర్శకులు బాబ్జి ఒక చిత్రాన్ని రూపొందించారు, ఆ చిత్రం పేరు రఘుపతి వెంకయ్య నాయుడు. ఈ చిత్రంలో రఘుపతి వెంకయ్య నాయుడు పాత్రలో ప్రముఖ నటులు నరేష్ నటించడం విశేషం. 2019 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి మండవ సతీష్ బాబు నిర్మించగా శ్రీ వెంకట్ సంగీతం అందించడం జరిగింది. యెల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, “మహర్షి” రాఘవ, మేల్కొటే, రావికొండలరావు తాతదితరులు నటించడం జరిగింది.
రఘుపతి వెంకయ్య పురస్కారం
తెలుగు సినిమా ప్రస్థానానికి కారణమైన రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1981 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు సినీ పరిశ్రమకి సేవ చేసిన మహామహులకి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది.
ఈ పురస్కారం ఇచ్చేటప్పుడు బంగారు నంది మరియు 50,000/- రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. 2016 సంవత్సరం తరువాత ఈ పురస్కారాన్ని ఇవ్వడం ఆపేశారు. మొదట రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అని పిలిచేవారు ఆ తరువాత కొన్ని కారణాలవల్ల రఘుపతి వెంకయ్య పురస్కారం పేరుతొ ఇవ్వడం ప్రారంభించారు.
రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి దర్శక నిర్మాత ఎల్. వి. ప్రసాద్, 1980 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2016 సంవత్సరంలో “మెగాస్టార్” చిరంజీవి గారికి ఈ పురస్కారం దక్కడం విశేషం.
రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అందుకున్న వ్యక్తుల జాబితా
- 1980 – ఎల్. వి. ప్రసాద్ – దర్శకులు, నిర్మాత
- 1981 – పి. పుల్లయ్య – దర్శకులు, నిర్మాత
- 1982 – బి. ఏ. సుబ్బారావు – దర్శకులు, నిర్మాత
- 1983 – ఎం. ఏ. రెహమాన్ – సినిమాటోగ్రాఫర్
- 1984 – కొసరాజు రాగహవయ్యా – పాటల రచయిత, కవి
- 1985 – భానుమతి – నటి, నిర్మాత
- 1986 – బాపు – దర్శకులు
- 1986 – ముళ్ళపూడి వెంకట రమణ – రచయిత
- 1987 – బి. నాగిరెడ్డి – నిర్మాత
- 1988 – డి. వి. ఎస్. రాజు – నిర్మాత
- 1989 – అక్కినేని నాగేశ్వరరావు – నటులు
- 1990- దాసరి నారాయణరావు – దర్శకులు
- 1991 – కె. విశ్వనాధ్ – దర్శకులు
- 1992 – ఎస్. రాజేశ్వరరావు – సంగీత దర్శకులు
- 1993 – డి. మధుసూధనరావు – నిర్మాత
- 1994 – అంజలి దేవి – నటి
- 1995 – కె. ఎస్. ప్రకాష్ రావు – నటులు, దర్శకులు, నిర్మాత
- 1996 – ఇంటూరి వెంకటేశ్వరరావు – సినీ పాత్రికేయులు
- 1997 – వి. మధుసూధనరావు – దర్శకులు, నిర్మాత
- 1998 – గుమ్మడి – నటులు
- 1999 – శాంతా కుమారి – నటి, నిర్మాత
- 2000 – తాడేపల్లి లక్ష్మి కాంతారావు – నటులు, నిర్మాత
- 2001 – అల్లు రామలింగయ్య – నటులు
- 2002 – పి. సుశీల – గాయని
- 2003 – వి. బి. రాజేంద్ర ప్రసాద్ – నిర్మాత
- 2004 – కృష్ణవేణి – నటి, నిర్మాత
- 2005 – ఎం. ఎస్. రెడ్డి – దర్శకులు, నిర్మాత
- 2006 – డి. రామానాయుడు – నిర్మాత
- 2007 – తమ్మారెడ్డి కృష్ణ మూర్తి – నిర్మాత
- 2008 – విజయ నిర్మల – నటి, దర్శకులు, నిర్మాత
- 2009 – కె. రాఘవ – నిర్మాత
- 2010 – ఎం. బాలయ్య – దర్శకులు, నిర్మాత
- 2011 – కైకాల సత్యనారాయణ – నటులు, దర్శకులు, నిర్మాత
- 2012 – కోడి రామకృష్ణ – దర్శకులు
- 2013 – వాణిశ్రీ – నటి
- 2014 – కృష్ణంరాజు – నటులు
- 2015 – ఈశ్వర్ – రరచయిత – పబ్లిసిటీ డిజైనర్
- 2016 – చిరంజీవి – నటులు
ముగింపు
రఘుపతి వెంకయ్య నాయుడు చేసిన కృషి తెలుగు సినిమా మరిచిపోని వారసత్వంగా నిలిచిపోయింది. ఆయన ఆశయాలు, ప్రయత్నాలు సినీ పరిశ్రమకు గొప్ప బలం అయ్యాయి. తెలుగు సినిమా ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దార్శనికుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.